మాఫీ మాయ | no corp lone abolished by chandra babu | Sakshi
Sakshi News home page

మాఫీ మాయ

Published Wed, Jun 1 2016 11:44 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

no corp lone abolished by chandra babu

‘రైతులూ.. మీరు తీసుకున్న రుణాలేవీ తిరిగి కట్టకండి. మేం అధికారంలోకి రాగానే పంట రుణాలన్నీ రద్దు చేస్తాం. వ్యవసాయం కోసం బంగారం కుదువబెట్టి తీసుకున్న అప్పులు సైతం ఎత్తివేస్తాం. బాకీలన్నీ మేమే తీర్చి మీరంతా సంతోషంగా ఉండేలా చూస్తాం’ అంటూ అన్నదాతలను ఆశల పల్లకిపై ఊరేగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు నీటి మూటలయ్యాయి.  ఆయన మాటలు నమ్మి రుణాలు చెల్లించని రైతులు వడ్డీ తడిసిమోపెడై మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రెండేళ్లు గడుస్తున్నా మాఫీ ఫలాలు అందలేదు. తొలకరి సాగుకు సమాయత్తమవుతున్న ప్రస్తుత తరుణంలోనైనా రుణమాఫీ హామీ నెరవేర్చాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

ఏలూరు (మెట్రో) :  జిల్లాలో మొత్తం 8 లక్షల మంది రైతులు రూ.7,245 కోట్లను వివిధ వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకున్నారు. ఈ విషయాన్ని 2014 మార్చి నాటి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో జిల్లాలో  విస్తృతంగా పర్యటించిన అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబు నాయుడు రైతులెవరూ రుణాలు చెల్లించవద్దంటూ ప్రచారం చేశారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని.. పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే ఆ అప్పులన్నిటినీ రద్దు చేస్తామని.. తొలి సంతకం అదే ఫైలుపై చేస్తామని ఘంటాపథంగా చెప్పారు.

అయితే, చంద్రబాబు చేసిన తొలి సంతకం రైతులను అప్పుల బారినుంచి బయట పడేయకపోగా.. మరింతగా ఊబిలోకి నెట్టేసింది. మొదటి విడత రుణమాఫీలో భాగంగా కోటయ్య కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం 174 జీవో జారీ చేసింది. జిల్లా రైతులకు రూ.1,100 కోట్లను రుణమాఫీ చేస్తున్నట్టు అందులో పేర్కొంది. చివరకు రూ.650 కోట్లు మాత్రమే విడుదల చేసింది. రూ.450 కోట్లు నేటికీ మంజూరు కాలేదు. 2.90 లక్షల మంది రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున రుణమాఫీ సొమ్ము విడుదల చేస్తామని ప్రకటించినా.. రెండేళ్లలో కనీసం 20 శాతం సొమ్ములైనా బ్యాంకులకు చేరలేదు.
 
బంగారమంతా వేలానికి..
బంగారు నగలు కుదువబెట్టి 2013-14 సంవత్సరాల్లో 3.50 లక్షల మంది రైతులు వ్యవసాయ అవసరాల కోసం రూ.2 వేల కోట్లను రుణాలుగా తీసుకున్నారు. ఆ రుణాలు సైతం మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మొహం చాటేశారు. దీంతో అప్పు చెల్లించలేక.. వడ్డీలపై వడ్డీలు పెరిగిపోవడంతో సుమారు 2 లక్షల మంది రైతులు బంగారాన్ని బ్యాంకుల్లోనే వదిలేశారు. బకాయిలను రాబట్టుకునేందుకు బ్యాంకులు ఆ బంగారాన్ని వేలం వేశాయి.
 
వడ్డీతో కలిసి తడిసిమోపెడైంది
మా గ్రామంలో పది మంది రైతులతో కలిసి రుణం తీసుకున్నాను. రుణమాఫీ వస్తుందని చెప్పారు. రెండేళ్లు ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. వడ్డీతో కలిసి అప్పు తడిసి మోపెడైంది. ఏమవుతుందోనని భయమేసి బయటినుంచి అప్పు తెచ్చి బ్యాంకు రుణం కట్టేశా. మళ్లీ రుణాలు తీసుకోవాలంటే భయమేస్తోంది. రుణమాఫీ హామీ అమలు కాకపోవడంతో తీసుకున్న సొమ్ముకు రెట్టింపు కట్టాల్సి వచ్చింది.
 - శిద్ధినీడి శివరామయ్య, రైతు, సారవ, మొగల్తూరు మండలం
 
 నిలువునా ముంచేశారు
 రుణమాఫీ పేరుచెప్పి రైతుల్ని నిలువునా ముంచేశారు. బాకీలన్నీ మాఫీ అవుతాయని ఎదురుచూస్తే.. వడ్డీల భారం పెరిగి రైతులంతా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. బకాయిలు కట్టలేదని బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. జిల్లాలోని రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టుగా ఉంది.
 - నల్లమిల్లి వీరరాఘవరెడ్డి, రైతు నాయకులు, పెంటపాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement