‘జేబులు నింపిన ఎన్నికలు’ పై పోస్టుమార్టం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిధులను మింగేసిన కొందరు ఎంపీడీవోలపై విచారణ జరుగుతోంది. స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిధులకు తోడు, మండల పరిషత్‌ల నిధులను వాహనాల వినియోగం కోసం ఖర్చు చేసిన విషయం విదితమే. కొందరు ఎంపీడీవోలు లాగ్‌బుక్‌లు లేకుండా వాహన వినియోగం పేరిట భారీగా నిధులు కాజేశారు.
ప్రజాధనంతో తమ జేబు లు నింపుకున్న అధికారుల వ్యవహారంపై ‘సాక్షి’ గత నెల 30వ తేదీన ‘జేబులు నింపిన ఎన్నికలు’ శీర్షికన ప్రచురించిన కథనం కలకలం సృష్టిస్తోంది. అక్రమార్కుల బండారం బయట పెట్టేందుకు ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగగా, తాజాగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీలు) సైతం ఆరా తీస్తున్నారు.
కాగా ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం జిల్లాకు ఈసారి కూడా భారీగానే నిధులు కేటాయించింది. పోలింగ్ స్టేషన్ల సంఖ్యను బట్టి ఒక్కో మండలానికి రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు నిధులు విడుదల చేసింది.
ఈ నిధులతో ఎన్నికలను సజావుగా నిర్వహించే అవకాశం ఉంది. ఎంపీడీవోలు సైతం ఈ నిధుల నుంచే ఆయా మండలాల్లో పోలింగ్ స్టేషన్లను బట్టి రూ. 1.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు వా హన వినియోగం కోసం ఖర్చు చేసే వీలుంది. అయినప్పటికీ ఎన్నికల నిర్వహణ నిధులకు తోడు మండల పరిషత్ సాధారణ నిధుల నుంచి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో.. ఒక్కో నెలకు రూ. 24 వేల చొప్పున డ్రా చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నే పథ్యంలో వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు ఇంటెలిజెన్స్ విభాగం విచారణకు దిగగా.. తాజాగా ఎంపీపీలు ‘పరిషత్’ నిధుల వినియోగంపై ఆరా తీస్తున్నారు. దీంతో రెండు రకాలుగా నిధులు కాజేసిన కొందరు ఎంపీడీవోల్లో దడ మొదలైంది. మండల పరిషత్ కార్యాలయాల ఖాతాల్లో నెలల వారీగా ఎంత జమయ్యింది? ఏ ఏ పద్దుల కింద ఎంపీడీవోలు ఎంత ఖర్చు చేశారు? ప్రధానంగా మార్చి, ఏప్రిల్, మే నెలలకు ముందు పరిషత్‌ల నిధుల నిల్వ ఎంత? జూలై ఒకటి నాటికి ఏ ఏ పద్దుల కింద ఎంతెంత ఖర్చు చేశారు? అన్న లెక్కలు తేల్చే పనిలో ఎంపీపీలు ఉన్నట్లు తెలుస్తోంది.
జడ్పీ నుంచి రూ. 34 లక్షలు?
మండల పరిషత్ నిధులకు తోడు ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచి రూ. 34 లక్షలు డ్రా చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం రూ. 2.92 కోట్లు ప్రభుత్వం కేటాయించగా.. జడ్పీ నుంచి మరో రూ. 34 లక్షలు డ్రా చేయాల్సిన అవసరం ఏమోచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలింగ్ స్టేషన్ల వారీగా నిధులతో పాటు మండల పరిషత్ నిధులను వాహనాల పేరిట కొందరు ఎంపీడీవోలు కాజేస్తే.. రూ. 34 లక్షల జడ్పీ నిధులు ఎటు వెళ్లాయన్న విషయమై సర్వత్రా చర్చ జరుగుతోంది.