టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆదివారం తెల్లవారు జామున చెన్నై తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లాకు చెందిన కాస్ట్యూమ్స్ కృష్ణ నటుడిగా అనేక సినిమాల్లో విలన్ పాత్రలు చేశాడు.
1954లో మద్రాస్ వెళ్లి, అక్కడ సినిమా వాళ్ల దగ్గర అసిస్టెంట్ కాస్ట్యూమర్‌గా జాయిన్ అయ్యారు. అతి తక్కువ కాలంలోనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో పాటు వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి లాంటి హీరోయిన్లకు కూడా ఆయన కాస్ట్యూమ్స్ అందించారు.
కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన భారత్ బంద్ చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యాడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తాత గా తండ్రిగా అనేక పాత్రల తో మెప్పించాడు. జగపతి బాబు హీరోగా వచ్చిన పెళ్ళిపందిరి చిత్రంతో పాటు మరో 7 సినిమాలను నిర్మించాడు. కన్నడంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని అరుంధతి పేరుతో రీమేక్ చేశాడు. కాస్ట్యూమ్ కృష్ణ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ‘కాస్ట్యూమ్ కృష్ణ మరణ వార్త వినడానికి బాధగా ఉంది. కుటుంబ సభ్యులకు సానుభూతి’ అని దిల్ రాజు ట్వీట్ చేశాడు.
Sad to hear about Costumes Krishna Garu's demise. Condolences to his family members. You will be missed. RIP... pic.twitter.com/m86Zr57Hjt
— Sri Venkateswara Creations (@SVC_official) April 2, 2023