Counseling centers
-
మెడికల్ కాలేజీల్లో కౌన్సెలింగ్ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: కాకతీయ మెడికల్ కాలేజీ ఎండీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం... నిజామాబాద్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థి ఆత్మహత్య.. ఖమ్మం జిల్లాకు చెందిన మెడికల్ విద్యార్థి విజయవాడలో ఆత్మహత్య ఘటనలు ఈ ఐదారు రోజుల్లో యావత్ సమాజాన్ని కుదిపేశాయి. మెడికల్ కాలేజీల్లో అసలేం జరుగుతోందని ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించింది. వేధింపులు, పరీక్షల ఒత్తిడి, ఇతరత్రా కారణాలతో వైద్య విద్యార్థుల ఆత్మహత్యలు, యత్నాలకు పాల్పడుతున్నారని గుర్తించారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో తక్షణమే కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడే విద్యార్థులకు కౌన్సెలింగ్ చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల నుంచి ఏమైనా ఫిర్యాదులు వస్తే తక్షణమే వాటిని పరిష్కరించాలని స్పష్టం చేసింది. ఫిర్యాదులను తమకు పంపించాలని, అందుకు తీసుకున్న చర్యలేంటో తెలియజేయాలని పేర్కొంది. ఇంటర్న్‌షిప్ విద్యార్థులకు, పీజీ మెడికల్ విద్యార్థులతో ఎన్ని గంటలు పనిచేయిస్తున్నారు? అదనపు గంటలు పనిచేయిస్తున్నారా? వీక్లీ ఆఫ్‌లు ఇస్తున్నారా? వంటి అంశాలపై సమగ్ర సమాచారం పంపాలని ఆదేశించింది. చాలా మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లోనూ పీజీ మెడికల్ విద్యార్థులపై సీనియర్ డాక్టర్లు పనిభారం వేస్తూ వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు సీనియర్ డాక్టర్లు పీజీలతో పనిచేయించుకుంటూ తమ సొంత ప్రైవేట్ ప్రాక్టీస్‌పై దృష్టి పెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటువంటి వారి వివరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 24 గంటల హెల్ప్‌లైన్.. అన్ని వైద్య కళాశాలల్లో తప్పనిసరిగా 24 గంటల హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని, డీన్ లేదా ప్రిన్సిపాల్ అధ్యక్షతన ఒక అంతర్గత ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని, కాలేజీల్లో ఆత్మహత్యల నివారణ కోసం సైకియాట్రీ సీనియర్ ప్రొఫెసర్‌ను సభ్యుడిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆపదలో ఉన్నవారు లేదా ఆత్మహత్య చేసుకొనే ధోరణి ఉన్నవారు సొసైటీ ఫర్ మెంటల్ హెల్త్ – 011–4076 9002 నంబర్‌కు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఫోన్ చేయవచ్చని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సూచించింది. గత ఐదేళ్లలో ఆత్మహత్యలకు పాల్పడిన వైద్య విద్యార్థుల వివరాలను, మధ్యలోనే చదువు మానేసిన విద్యార్థుల వివరాలను పంపించాలని ఎన్ఎంసీ కోరింది. ప్రతి మెడికల్ కాలేజీలోనూ విద్యార్థులకు యోగా, ధ్యానం తప్పనిసరి చేయాలని సూచించింది. ఆత్మహత్యల ధోరణిపై ఆందోళన వ్యక్తం చేసిన ఎన్ఎంసీ.. ఇలాంటి ఘటనలకు ర్యాగింగ్‌తో సంబంధం లేనప్పటికీ చాలా సందర్భాల్లో ర్యాగింగ్ వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయని భావిస్తోంది. వాటిపై సమీక్షించాల్సిన అవసరముందంటున్నారు. ‘ప్రతి ఒక్కరి జీవితం విలువైనది. విద్యార్థులు సురక్షితంగా చదువుకొనేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తాం. అందుకోసం ఎన్ఎంసీ సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. విద్యార్థుల్లో ఒత్తిడి, వేధింపులతో ఆత్మహత్యల వంటి ఘటనలను నిరోధించడానికి కౌన్సెలింగ్, ఇతర సహాయక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయాలి’అని ఎన్ఎంసీ కోరింది. ఆ ప్రకారం రాష్ట్రంలో చర్యలు చేపడుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. -
పీజీ కౌన్సెలింగ్‌పై రీయింబర్స్మెంట్ ఎఫెక్ట్!
- ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులు ఇవ్వని ప్రభుత్వాలు - సర్టిఫికెట్లు ఇచ్చేందుకు యాజమాన్యాలు ససేమిరా - అభ్యర్థులు విలవిల.. కౌన్సెలింగ్ కేంద్రాలు వెలవెల సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఉన్నత చదువులపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు అప్పటి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే సకాలంలో నిధులు కేటాయించకపోవడంతో ఫీజులు కళాశాలల ఖాతాలకు నేటికీ చేరలేదు. దీంతో విద్యార్థుల సర్టిఫికెట్లను యాజమాన్యాలు నిలిపివేశాయి. దీని ప్రభావం శనివారం ప్రారంభమైన పీజీఈసెట్ కౌన్సెలింగ్‌పై పడింది. ఖాళీగా కౌన్సెలింగ్ కేంద్రాలు గేట్, పీజీఈసెట్‌లో ర్యాంకులు సాధించినా కాలే జీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావడంలేదు. తాము బీటెక్ పాసైనట్లుగా వెబ్సైట్ మార్కుల జాబితాలు చూపినా అధికారులు అంగీకరించడంలేదు. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకుండా కౌన్సెలింగ్‌కు అనుమతించేది లేదని తెగేసి చెబుతున్నారు. అయితే.. అభ్యర్థులు పెద్దగా రాకపోవడంతో తొలిరోజు కౌన్సెలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి. పీజీ కోర్సుల్లో చేరాల్సిన గేట్ ర్యాంకర్ల ధ్రువపత్రాల పరి శీలనకు గడువు ఆదివారంతో ముగుస్తుండడంతో అభ్యర్థులు నానా హైరానా పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం సుమారు 30వేల మంది అభ్యర్థులు తమ ధ్రువపత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆర్జేయూకేటీలోనూ ఇదే దుస్థితి.. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో పరిస్థితి అలాఉంటే.. ప్రభుత్వ విద్యాసంస్థలు తామేమీ తీసిపోమంటున్నాయి. రాజీవ్‌గాంధీ వర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పరిధిలోని 4 ఐఐఐటీల్లోనూ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అధికారులు ససేమిరా అంటుండడం విచారకరం. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కోసం ఆర్జేయూకేటీ ఆధ్వర్యంలో ఆరేళ్ల కిందట 4 ఐఐఐటీలను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రవేశ పరీక్షలతో నిమిత్తం లేకుండా టెన్త్ మెరిట్ ప్రకారం ఇంటర్, డిగ్రీల్లో ప్రవేశం కల్పించారు. ఐదేళ్లపాటు ఫీజులు చెల్లించిన ప్రభుత్వం చివరి సంవత్సరంలో చెల్లించకపోవడంతో అక్కడి విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇడుపులపాయ, నూజి వీడు, బాసర, హైదరాబాద్ ఐఐఐటీల్లో డిగ్రీలు పూర్తిచేసిన విద్యార్థులకు ఫీజులు రాలేదని అధికారులు ఫలితాలను సైతం నిలిపివేశారు. ఐఐఐటీల్లో బీటెక్ పూర్తిచేసిన పలువురు విద్యార్థులు గేట్, పీజీఈసెట్లలో మంచి ర్యాంకులు సాధించినా.. కౌన్సెలింగ్‌కు హాజరుకాక ఉన్నత చదువులపై ఆశలు వదులుకుంటున్నారు. ఆశలు వదులుకున్నా.. మాది మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి. టెన్త్‌లో మంచి మార్కులు రావడంతో ఇడుపులపాయ ఐఐఐటీలో సీటు వచ్చింది. బాగా చదివి బీటెక్‌లోనూ 77శాతం మార్కు లు సాధించా. గేట్-2014లోనూ ర్యాంకు వచ్చింది. చివరి ఏడాది ఫీజు బకాయి ఉంద ని అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. -శ్రీలత, గేట్ ర్యాంకర్, మహ బూబ్‌నగర్ సర్టిఫికెట్లు ఉంటేనే అనుమతి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఫీజు బకాయిలుండటంతో సర్టిఫికెట్లు ఇవ్వ లేదని కొంతమంది చెబుతున్నారు. దాంతో మాకు సంబంధం లేదు. గేట్, పీజీఈసెట్లలో ర్యాంకులు వచ్చినవారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో వస్తేనే ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతిస్తాం. -సీతారామరాజు, జేఎన్టీయూహెచ్ అడ్మిషన్స్ డెరైక్టర్ ఫీజులు చెల్లించాల్సిందే.. బీటెక్ పూర్తయిన విద్యార్థులకు తమ సర్టిఫికెట్లు కావాలంటే ఫీజులు పూర్తిగా చెల్లించాల్సిందే. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే మా తప్పు కాదుకదా. ఫీజు బకాయిలు ఉన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వొద్దని ఆర్జేయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ ఆదేశించింది. ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్లిన అభ్యర్థులకు, ఒకవేళ ప్రభుత్వం నుంచి ఫీజులు వస్తే విద్యార్థులకు రీయింబర్స్మెంట్ చేస్తాం. - వేణుగోపాల్, ఐఐఐటీ డెరైక్టర్, ఇడుపులపాయ