బ్రాడ్‌కు జరిమానా విధించిన తండ్రి
లండన్ : ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జరిమానా విధించింది. ఇటీవలె పాకిస్తాన్‌తో ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో బ్రాడ్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో... మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తున్న అతని తండ్రి క్రిస్ బ్రాడ్ కుమారుడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. జరిమానాతోనే సరిపెట్టకుండా ఒక డీ మెరిట్ పాయింట్‌ను అతని ఖాతాలో వేశాడు. పాక్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో తన బౌలింగ్‌లో అవుటై పెవిలియన్‌కు వెళుతున్న యాసిర్ షాను ఉద్దేశించి బ్రాడ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఫీల్డ్ అంపైర్లు రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 2.5 ప్రకారం... బ్యాట్స్‌మన్ అవుటైనప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లు అతడిపై దూషణకు దిగడం, ఎగతాళి చేయడం వంటి వాటిని నేరంగా పరిగణిస్తారు.