cricket lessons
-
స్పిన్‌ను ధోనిలాగా ఆడాలి
న్యూఢిల్లీ: భారత మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ చిన్నారులకు క్రికెట్ పాఠాలు బోధించారు. జీఎంఆర్ గ్రూప్ ఏర్పాటు చేసిన ఓ క్యాంప్‌లో 12-13 ఏళ్ల వయసున్న 100 మంది పిల్లలకు ఆటలోని సాంకేతిక అంశాలపై శిక్షణ ఇచ్చారు.బ్యాటింగ్‌లో వివిధ రకాల మెలకువలతో పాటు స్పిన్నర్లను ఎదుర్కోవడంపై పలు సూచనలు చేశారు. టీమిండియా కెప్టెన్ ఎం.ఎస్. ధోని స్పిన్‌ను అద్భుతంగా ఆడతాడని ఈ సందర్భంగా కితాబిచ్చారు. మహీ బ్యాటింగ్, స్టాన్స్, టెక్నిక్ గురించి చిన్నారులకు వివరించారు. ‘ధోని స్పిన్ ఆడుతున్నప్పుడు బంతిని బాగా వెనుక నుంచి తీసుకుంటాడు. సిక్సర్లు కొట్టినప్పుడు మినహా... మిగతా సందర్భాల్లో ఎక్కువగా బ్యాక్ఫుట్లోనే ఆడతాడు. భారత్‌లో చాలా మంది క్రికెటర్లు స్పిన్ బాగా ఆడతారు. కానీ వారందరిలో ధోని మెరుగ్గా ఆడతాడు’ అని ఢిల్లీ డేర్‌డెవిల్స్ చీఫ్ కోచ్ అయిన కిర్‌స్టెన్ వెల్లడించారు. చిన్నారులు వేసిన ప్రశ్నలకు కోచ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘రెండు మిలియన్ డాలర్లకు వీరూను రిటైన్ చేసుకోవాలని మీరు ఫ్రాంచైజీ యాజమాన్యానికి సూచిస్తారా?’ అని అడిగిన ఓ ప్రశ్నకు... గట్టిగా నవ్వుతూ సమాధానాన్ని దాటవేశాడు. -
అనాథ పిల్లలకు ద్రవిడ్ పాఠాలు
బెంగళూరు: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్... ఓ 25 మంది అనాథ పిల్లలకు క్రికెట్లో మెళకువలు నేర్పాడు. మంగళవారం ఏర్పాటు చేసిన ‘క్యాంప్ విత్ ద చాంప్’ కార్యక్రమంలో భాగంగా అతను రోజంతా పిల్లలకు క్రికెట్ పాఠాలు చెబుతూ గడిపాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో, టెలికామ్ బ్రాండ్ ఐడియా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆటకు సంబంధించిన ప్రాథమికాంశాలను నేర్చుకోవాలనుకునే వారికి నియమ నిబంధనలను తెలియజేస్తూ కొన్ని వీడియోలను రూపొందించారు. మరోవైపు సెహ్వాగ్, జహీర్, గంభీర్‌లాంటి సీనియర్ ఆటగాళ్లు జాతీయ జట్టులోకి తిరిగి వస్తారని ద్రవిడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. విండీస్‌తో తలపడే భారత్ ‘ఎ’ జట్టులో ఈ ముగ్గురికి చోటు దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవకాశాన్ని వాళ్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు.