
స్పిన్‌ను ధోనిలాగా ఆడాలి
న్యూఢిల్లీ: భారత మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ చిన్నారులకు క్రికెట్ పాఠాలు బోధించారు. జీఎంఆర్ గ్రూప్ ఏర్పాటు చేసిన ఓ క్యాంప్‌లో 12-13 ఏళ్ల వయసున్న 100 మంది పిల్లలకు ఆటలోని సాంకేతిక అంశాలపై శిక్షణ ఇచ్చారు.బ్యాటింగ్‌లో వివిధ రకాల మెలకువలతో పాటు స్పిన్నర్లను ఎదుర్కోవడంపై పలు సూచనలు చేశారు. టీమిండియా కెప్టెన్ ఎం.ఎస్. ధోని స్పిన్‌ను అద్భుతంగా ఆడతాడని ఈ సందర్భంగా కితాబిచ్చారు. మహీ బ్యాటింగ్, స్టాన్స్, టెక్నిక్ గురించి చిన్నారులకు వివరించారు. ‘ధోని స్పిన్ ఆడుతున్నప్పుడు బంతిని బాగా వెనుక నుంచి తీసుకుంటాడు. సిక్సర్లు కొట్టినప్పుడు మినహా... మిగతా సందర్భాల్లో ఎక్కువగా బ్యాక్‌ఫుట్‌లోనే ఆడతాడు.
భారత్‌లో చాలా మంది క్రికెటర్లు స్పిన్ బాగా ఆడతారు. కానీ వారందరిలో ధోని మెరుగ్గా ఆడతాడు’ అని ఢిల్లీ డేర్‌డెవిల్స్ చీఫ్ కోచ్ అయిన కిర్‌స్టెన్ వెల్లడించారు. చిన్నారులు వేసిన ప్రశ్నలకు కోచ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘రెండు మిలియన్ డాలర్లకు వీరూను రిటైన్ చేసుకోవాలని మీరు ఫ్రాంచైజీ యాజమాన్యానికి సూచిస్తారా?’ అని అడిగిన ఓ ప్రశ్నకు... గట్టిగా నవ్వుతూ సమాధానాన్ని దాటవేశాడు.