వైద్యురాలి హత్యోదంతంలో... దీదీ సర్కారు 10 తప్పులు
యావద్దేశాన్నీ కదిలించిన యువ వైద్యురాలి పాశవిక హత్యోదంతంలో మమతా సర్కారు తీరు మొదటినుంచీ తీవ్ర విమర్శలపాలైంది. దాంతో దోషులను కాపాడేందుకు ప్రభుత్వమే ప్రయతి్నస్తోందన్న అనుమానాలు నానాటికీ బలపడుతున్నాయి. ఈ ఘటన పట్ల రగిలిపోయిన వైద్యులు, వైద్య సిబ్బంది విధులు బహిష్కరించి రోడ్లపైకెక్కారు. ఇది దేశవ్యాప్త ఆందోళనలకు దారితీయడంతో సుప్రీంకోర్టే ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఆద్యంతం తప్పులతడకేనంటూ అత్యున్నత న్యాయస్థానం కూడా తాజాగా తీవ్రంగా తలంటింది. ఇంతటి దారుణాన్ని ఆత్మహత్యగా చిత్రించజూసిన వైద్య కళాశాల ప్రిన్సిపల్ పట్ల పక్షపాతం, శాంతియుతంగా నిరసన చేస్తున్న వైద్య సిబ్బందిపై ఉక్కుపాదం, సోషల్ మీడియా విమర్శకుల నోళ్లు మూయించడానికి నోటీసులు, నేరం జరిగిన సెమినార్ హాల్లో ఆదరబాదరాగా మరమ్మతులు, ఆస్పత్రిపై మూక దాడిని అడ్డుకోలేక చేతులెత్తేయడం... ఇలా మమతా సర్కారు, కోల్‌కతా పోలీసులు వేసిన తప్పటడుగులు అన్నీ ఇన్నీ కావు...ఆస్పత్రి వర్గాల నిర్వాకం... 1. వైద్యురాలి అర్ధనగ్న మృతదేహం కళ్లముందు కన్పిస్తున్నా, ఒంటి నిండా గాయాలున్నా ఆసుపత్రి వర్గాలు ఆత్మహత్యగా చిత్రించేందుకు విశ్వప్రయత్నం చేశాయి. కానీ జరిగిన దారుణాన్ని పోస్ట్‌మార్టం నివేదిక బట్టబయలు చేసింది. ఒంటిపై 16, అంతర్గతంగా 9 గాయాలున్నాయని, ఒకరికి మించి రేప్ చేశారని, రెండు కాళ్లూ దారుణంగా విరిచేశారని, గొంతు నులిమి పాశవికంగా హత్య చేశారని పేర్కొంది.2. కూతురిని పొగొట్టుకుని పుట్టెడు దుఖంలో ఉన్న తల్లిదండ్రులను 3 గంటలకు పైగా ఆసుపత్రి బయటే నిలబెట్టారు. మృతదేహం దగ్గరికి కూడా పోనీయలేదు. పైగా ఆగమేఘాల మీద అంత్యక్రియలు పూర్తి చేయించేలా ఒత్తిడి తెచ్చారు. కోల్‌కతా పోలీసులు సరైన కోణంలో విచారణ జరపలేదని, దర్యాప్తు కొనసాగుతుండగానే హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేయించారని విపక్షాలతో పాటు డాక్టర్లు, బాధితురాలి తండ్రి ఆరోపించారు. పోలీసుల తీరు వెనక...? 3. వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె తల్లిదండ్రులకు పోలీసులు తొలుత చెప్పారు. తర్వాత రేప్, హత్య అని తెలిపారు. ఇంత సున్నితమైన అంశంలో ఇలా వ్యవహరించడం యాదృచి్ఛకం కాదంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. హతురాలి డైరీతో సహా పలు ఆధారాలను పోలీసులే ధ్వంసం చేశారనే ఆరోపణలున్నాయి. ఆమె తనను వేధించిన వారి గురించి డైరీలో కచి్చతంగా పేర్కొని ఉంటారంటున్నారు. ఈ ఉదంతం కోల్‌కతా పోలీసుల విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేసింది. దీనికి తోడు బాధితురాలి కుటుంబానికి మమత సర్కారు రూ.10 లక్షల పరిహారం ప్రకటించడం అగి్నకి మరింత ఆజ్యం పోసింది. న్యాయమడిగితే పరిహారం పేరిట ఈ పరిహాసమేమిటంటూ అంతా దుయ్యబట్టారు. వీటిపై కూడా ప్రభుత్వం నుంచి నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలే విన్పించాయి.సాక్ష్యాల చెరిపివేత?4. ఓవైపు హత్యాచారాన్ని నిరసిస్తూ ఆసుపత్రి బయట ఆందోళనలు, భారీ ప్రదర్శనలు జరుగుతుండగానే ఘోరానికి వేదికైన ఆస్పత్రి సెమినార్ హాల్లో ఆదరబాదరా మరమ్మతులు చేపట్టారు. పక్కనున్న బాత్రూం గోడను కూల్చేశారు. ఇదంతా ఆధారాలను చెరిపేసేందుకేననే సందేహాలు సహజంగానే తలెత్తాయి. మరమ్మతులు తప్పనిసరే అనుకున్నా ఇంతటి కీలక కేసు దర్యాప్తు జరుగుతుంటే ఇంకొంతకాలం ఆగలేరా అన్న వైద్య సమాజం ప్రశ్నలకు బదులే లేదు.5. ఆగస్టు 14న అర్ధరాత్రి సంఘీభావ ప్రదర్శనలు జరగుతుండగా.. అల్లరిమూకలు ఆర్జి కార్ ఆసుపత్రిలో విధ్వంసానికి దిగాయి. 40 నిమిషాలు వీరంగం సృష్టించాయి. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఆధారాలను ధ్వంసం చేసేందుకు టీఎంసీ గూండాలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీతో సహా పలువురు ఆరోపించారు.ప్రిన్సిపల్‌పై వల్లమాలిన ప్రేమ 6. ఆర్జి కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు మమత సర్కారు దన్నుగా నిలిచిన తీరు తీవ్ర దుమారం రేపింది. హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడమే గాక హతురాలి గురించి నెగెటివ్ వ్యాఖ్యలు చేయడంతో వైద్య లోకం మండిపడింది. వారి నిరసనల నేపథ్యంలో పదవికే రాజీనామా చేయాల్సి వచి్చంది. కానీ ఆ తర్వాత మమత సర్కారు వ్యవహరించిన తీరు ఆశ్రిత పక్షపాతానికి పరాకాష్టగా నిలిచిపోయింది. ఘోష్ రాజీనామాను ఆమోదించకపోగా, కొద్ది గంట్లోనే ఆయనను ప్రతిష్టాత్మక కోల్‌కతా నేషనల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్‌గా బదిలీ చేసింది. లెక్కలేనితనంతో వ్యవహరించినందుకు కనీసం క్రమశిక్షణ చర్యలైనా తీసుకోకపోగా ఈ రివార్డు ఏమిటంటూ వైద్యులంతా దుమ్మెత్తిపోశారు. ‘గో బ్యాక్’ అంటూ కోల్‌కతా మెడికల్ కాలేజీ వైద్యులు, వైద్య సిబ్బంది కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. చివరికి ఘోష్ తీరును కోల్‌కతా హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టి సెలవుపై పంపింది.నిరసనకారులపై ఉక్కుపాదం 7. హత్యాచారాన్ని నిరసిస్తూ వైద్యులు చేపట్టిన ఆందోళనలపై మమత సర్కారు తొలినుంచీ మొండివైఖరే ప్రదర్శించింది. వైద్యురాలి హత్య వెనుక మతలబుందని ఆర్జి కార్ ఆసుపత్రి తోటి వైద్యులు వెంటనే నిరసనకు దిగారు. సమ్మెకు దిగడం ద్వారా ప్రజలకు వారు అసౌకర్యం కలిగిస్తున్నారంటూ ప్రభుత్వం నిందించింది. వైద్యురాలికే భద్రత లేని వైనంపై ఆత్మవిమర్శ చేసుకోవడంతో పాటు సురక్షిత పనిప్రదేశాలపై వైద్యుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి సున్నితత్వమే లేకుండా వ్యవహరించింది. తక్షణం సమ్మె విరమించి విధులకు హాజరవాలంటూ డాక్టర్లపై తీవ్ర ఒత్తిడి తెచి్చంది. 8. భద్రతా కారణాల సాకుతో మోహన్‌బగాన్, ఈస్ట్‌బెంగాల్ జట్ల మధ్య జరగాల్సిన డెర్బీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను కోల్‌కతా పోలీసులు రద్దు చేశారు. మ్యాచ్‌కు భారీగా వచ్చే అభిమానులు డాక్టర్‌కు సంఘీభావంగా, మమత రాజీనామా డిమాండ్‌తో కదం తొక్కవచ్చనే భయంతోనే మ్యాచ్‌ను రద్దు చేశారని విమర్శకులు, అభిమానులు మండిపడ్డారు. దీన్ని జనాగ్రహాన్ని అణచివేసే చర్యగానే చూశారు. 9. జనాగ్రహం, వైద్యుల నిరసనల సెగతో ఉక్కిరిబిక్కిరైన కోల్‌కతా పోలీసులు తప్పిదాలను దిద్దుకోవాల్సింది పోయి ఎదురుదాడికి దిగి మరింత అప్రతిష్ట పాలయ్యారు. మమత రాజీనామా చేయాలన్న డిమాండ్లపై పోలీసు ఉన్నతాధికారులు ఎదురుదాడికి దిగి అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతల్లా వ్యవహరించారు. మీడియా అబద్ధాలను వ్యాప్తి చేస్తోందని, ఈ ఉదంతాన్ని రాజకీయం చేయాలని చూస్తోందని కోల్‌కతా పోలీస్ కమిషనర్ ఆరోపించారు. ఇక రాష్ట్ర మంత్రి ఉదయన్ గుహ మరో అడుగు ముందుకేసి మమత వైపు చూపుతున్న వేళ్లను విరిచేయాలంటూ పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, డాక్టర్లు, విద్యార్ధులపై పోలీసులు విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు 280 మందికి నోటీసులిచ్చారు.ముఖ్యమంత్రే నిరసనలకు దిగి... 10. సీఎంగా పరిస్థితిని చక్కదిద్దేందుకు కావాల్సిన అన్ని అధికారాలూ చేతిలో ఉన్న మమత స్వయంగా రోడ్డెక్కి అభాసుపాలయ్యారు. దోషులకు మరణశిక్ష పడాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించారు. నిజానికి సీబీఐకి కేసు బదిలీ కాకముందు కోల్‌కతా పోలీసుల ఉద్దేశపూర్వక అలక్ష్యమే కేసును పూర్తిగా నీరుగార్చిందనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర హోం శాఖ మమత చేతిలోనే ఉండటం కొసమెరుపు.– సాక్షి, నేషనల్ డెస్క్