crops lost
-
పంట పొలాలపై గజదాడులు
పలమనేరు/బంగారుపాళెం: జిల్లాలో ఏనుగుల దాడులు మళ్లీ తీవ్రమవుతున్నాయి. శుక్రవారం రాత్రి పలమనేరు, బంగారుపాళెం మండలాల్లో ఏనుగుల గుంపులు స్వైరవిహారం చేశాయి. మామిడి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలమనేరు మండలం పెంగరగుంటకు చెందిన బాబు, నక్షత్రయ్య, భీమప్ప, చంద్రయ్య పొలాల్లో ఒబ్బడి చేసి, రాశిపోసి ఉంచిన వడ్లను పూర్తిగా తినేశాయి. మరికొందరి పొలాల్లో వరికుప్పలను నాశనం చేశాయి. కృష్ణాపురం, ముçసలిమొడుగు, చిన్నకుంటల వద్ద మామిడి తోటలను ధ్వంసం చేశాయి. చెట్లకొమ్మలను విరిచేశాయి. పొలం గట్లపై ఉన్న అరటి, జామలాంటి చెట్లను విరిచేశాయి. ఇంద్రానగర్‌లోని రైతు చంద్ర మామిడితోటలో రాత్రంతా ఏనుగుల గుంపు మకాం వేశాయి. శనివారం ఉదయం అటవీ శాఖ సిబ్బందితో కలిసి స్థానికులు పెద్దయెత్తున శబ్దం చేయడంతో అవి అటవీ ప్రాంతం వైపు వెళ్లాయి. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేశారు. ఇన్నాళ్లు అడవిలోనే ఉన్న రాముడు, భీముడు అనే మదపుటేనుగులు పంట పొలాలపైకి వచ్చాయని బాధిత రైతు ఉమాపతి తెలిపాడు. బంగారుపాళెం మండలం అటవీ సరిహద్దు గ్రామమైన బండ్లదొడ్డిలో శుక్రవారం రాత్రి మామిడితోటపై ఏనుగులు దాడులు చేశాయి. గ్రామ సమీపంలోని తమిళనాడు–ఆంధ్ర సరిహద్దులో గల మోర్ధాన్‌డ్యామ్ మీదుగా ఏనుగులు మామిడి తోటలోకి వచ్చి, 15 మామిడి చెట్లను విరిచేశాయని బాధిత రైతు తెలిపారు. కీరమంద గ్రామంలో మామిడి, వరి పంటలను ధ్వంసం చేశాయి. అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగులను అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పాతాళంలో జలం
- పేరుకే వర్షాకాలం - వెంటాడుతున్న వర్షాభావం - భారీగా పడిపోయిన భూగర్భజలాలు - తాజా నీటి మట్టం సగటు 26 మీటర్లు - ఎండుతున్న బోరుబావులు - చాలా గ్రామాల్లో తాగునీటి తప్పని తిప్పలు - మల్బరీ, పండ్లతోటలకూ నష్టం గత సంవత్సరం ఇదే సమయానికి భూగర్భజల మట్టం 17 మీటర్లు ప్రస్తుతం జిల్లాలో భూగర్భజలమట్టం 26 మీటర్లు డేంజర్‌జోన్ ఉన్న ప్రాంతాలు ప్రాంతం మీటర్లు అగళిలో 83.64 గాండ్లపెంట 79.74 తలుపుల 72.37 లేపాక్షి మండలం శిరివరం 68.91 లేపాక్షి మండలం పులమతి 68.79 అమరాపురం 64.15 అమడగూరు మండలం మహమ్మదాబాద్ 61.21 బుక్కపట్నం మండలం పి.కొత్తకోట 61.01 జలం పాతాళంలోనికి పడిపోయింది. వందల అడుగులు బోర్లు వేసినా పైకి రాలేనంటోంది. వర్షాకాలంలోనూ సరైన వానలు కురవకపోవడంతో ఈసారి భూగర్భజలమట్టం దారుణంగా పడిపోయింది.౾ గత సంవత్సరంతో పోలిస్తే 9 మీటర్ల లోతుకు పడిపోయింది. భూగర్భజలశాఖ జిల్లా వ్యాప్తంగా బోరుబావులతో అనుసంధానం చేసిన ఫిజోమీటర్లలో నమోదైన వివరాలు తీసుకుంటే తాజా నీటి మట్టం సగటు 26 మీటర్లుగా నమోదైంది. వర్షాకాలంలో 26 మీటర్లు అంటే పరిస్థితి ప్రమాదకరంగానే ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని భూగర్భజలశాఖ అధికారులు చెబుతున్నారు. - అనంతపురం అగ్రికల్చర్ వర్షాభావ పరిస్థితులు వెంటాడుతుండటంతో పాతాళగంగ రోజురోజుకూ మరింత లోతుకు పడిపోతోంది. 2016–17 సంవత్సరంలో జూన్, జూలై మినహా ఆగస్టు నుంచి వర్షాలు కురవకపోవడంతో నీటి మట్టం పడిపోయింది. గతేడాది సాధారణ వర్షపాతం 552.3 మి.మీ కాగా 40 శాతం తక్కువగా వర్షాలు పడటంతో 338.8 మి.మీగా నమోదైంది. దీంతో చాలా మండలాలు, గ్రామాల్లో భూగర్భజలాలు భూతద్ధం పెట్టినా నీటి చెమ్మ కనిపించే పరిస్థితి లేదు. ఈ ఏడాది కూడా జూన్‌లో 63.9 మి.మీ గానూ 59 మి.మీ, జూలైలో 67.4 మి.మీ గానూ కేవలం 2 మి.మీ నమోదైంది. అంటే ఇప్పటివరకు 84.4 మి.మీ గానూ 27.50 శాతం తక్కువగా 61.4 మి.మీ వర్షం కురిసింది. మొత్తమ్మీద గత ఆగస్టు నుంచి ఇప్పటివరకు జిల్లాలో వరుణుడి జాడ కనిపించకపోవడంతో దాని ప్రభావం పాతాళగంగపై పడింది. అగళిలో 83.67 మీటర్లలో నీటి మట్టం జిల్లాలో తాజా సగటు నీటి మట్టం 26 మీటర్లుగా నమోదైనా... చాలా మండలాల్లో పరిస్థితి ప్రమాదకరంగా కనిపిస్తోంది. అగళిలో ఏకంగా 83.64 మీటర్లలో నీటి చుక్క కనిపిస్తుండం ఆందోళన కలిగిస్తోంది. గాండ్లపెంట 79.74 మీటర్లు, తలుపుల 72.37 మీటర్లు, లేపాక్షి మండలం శిరివరం 68.91 మీటర్లు, అదే మండలం పులమతి 68.79 మీటర్లు, అమరాపురం 64.15 మీటర్లు, అమడగూరు మండలం మహమ్మదాబాద్ 61.21 మీటర్లు, బుక్కపట్నం మండలం పి.కొత్తకోట 61.01 మీటర్లు, గుడిబండ మండలం మోరుబాగల్ 59.82 మీటర్లు, గోరంట్ల మండలం పులగూర్లపల్లి 58.82 మీటర్లు, మడకశిర మండలం ఆర్.అనంతపురం 57.88 మీటర్లు, సోమందేపల్లి మండలం చాలకూరు 57.21 మీటర్లు, పెనుకొండ 55.69 మీటర్లు, గుమ్మఘట్ట మండలం తాళ్లకెర 54.94 మీటర్లు, రాప్తాడు మండలం మరూరు 51.64 మీటర్లు, హిందూపురం మండలం మణేసముద్రం 43.95 మీటర్లు, తాడిమర్రి మండలం పిన్నదరి 43.24 మీటర్లు, కుందుర్పి మండలం ఎర్రగుంట్ల 41.34 మీటర్లు, రొద్దం మండలం రాచూరు 40.42 మీటర్లు, తనకల్లు మండలం కొక్కంటిక్రాస్ 39.64 మీటర్లు, యాడికి మండలం కోనుప్పలపాడు 38.36 మీటర్లు, శెట్టూరు మండలం అనుంపల్లి 36.60 మీటర్లు, కనగానపల్లి మండలం మామిళ్లపల్లి 36.34 మీటర్లు... ఇలా చాలా మండలాలు, గ్రామాల్లో భూగర్భదలమట్టం దారుణంగా పడిపోయింది. ఎండుతున్న బోర్లు వర్షాలు లేక భూగర్భజల మట్టం తగ్గిపోవడంతో బోరుబావులు ఎండిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2.50 లక్షల సంఖ్యలో బోరుబావులు ఉండగా గత వేసవిలోనే 70 నుంచి 80 వేల బోర్లు నీళ్లు రాక కట్టిపెట్టేశారు. వర్షాకాలం ఊరించినా ఫలితం లేకపోవడంతో ఇపుడు లక్షకు పైబడి బోర్లు ఎండుముఖం పట్టినట్లు అంచనా వేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని బోరుబావులు ఎండిపోవడం ఖాయమనే ఆందోళన వ్యక్తమవుతోంది. అరటి, బొప్పాయి, కళింగర, కర్భూజా, కూరగాయల పంటలు లాంటి స్వల్పకాలిక పంటలు అర్ధంతరంగా వదిలేస్తుండగా.. చీనీ, బత్తాయి, మామిడి, సపోటా, ద్రాక్ష, దానిమ్మ లాంటి దీర్ఘకాలిక పంటల విస్తీర్ణం సైతం కుదించుకుని అరకొర నీటితో తడుపుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక వరి పంట జోలికి వెళ్లడం మానేసిన రైతులు ఇతరత్రా వ్యవసాయ పంటలు కూడా సాగు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంతో ఇంతో ఆర్థికంగా చేయూతను ఇస్తున్న ఉద్యానతోటలు ఈసారి రైతులను దెబ్బతీయగా, మల్బరీ పంట కూడా చాలా చోట్ల వదిలేయాల్సి రావడంతో మరింత ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటికి సైతం ఇక్కట్లు పడుతున్న దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. కొత్తగా బోర్లు వేయిస్తూ భగీరథయత్నాలు చేస్తున్నా నీటి చుక్క కనిపించకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. -
పాడెక్కిన పథకాలు
అనంతపురం అగ్రికల్చర్ : వరుణుడు కరుణించకపోవడంతో ఈ సారి ఖరీఫ్, రబీ పంటలు పూర్తీగా తుడిచిపెట్టుకుపోయాయి. కరువు పరిస్థితులు విలయతాండవం చేస్తుండటంతో భవిష్యత్తుపై ‘అనంత’ జనం ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాన ప్రత్యామ్నాయంగా అంతో ఇంతో ఆదుకోవాల్సిన పశుసంవర్ధకశాఖ పథకాలు పూర్తీగా పడకేశాయి. పాడి, జీవాల పెంపకానికి పెద్ద పీట వేసి ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం పశుశాఖను పట్టించుకోకపోవడంతో ‘అనంత’లో పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. గత నాలుగైదేళ్లుగా పథకాలు, కార్యక్రమాలు లేక పశుసంవర్ధకశాఖ పూర్తీగా నీరసించిపోవడంతో రైతులు, కాపర్లు, ఇతరత్రా పేద వర్గాల జీవన ప్రమాణాలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. పాడికి పెద్దపీట అంటూనే.. తరచూకరువు పరిస్థితులు నెలకొంటున్న అనంతపురం జిల్లాలో పాడి, గొర్రెల పెంపకానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఏటా జిల్లాలో పర్యటించి వెళుతున్న కేంద్ర కరువు బందాలు గట్టిగా సిఫారసు చేస్తున్నా వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. జిల్లాలో 9.80 లక్షల సంఖ్యలో పశుసంపద, 42 లక్షల సంఖ్యలో గొర్రెలు, మేకలు, 18 లక్షల కోళ్లు, మరో 50 వేలు మూగజీవాలు ఉన్నాయి. పాడి పరిశ్రమపై 2.50 లక్షల కుటుంబాలు, 48 వేల కుటుంబాలు గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఓ వైపు కేంద్ర బందాలు సిఫారసులు చేస్తుండటం, మరో వైపు రైతు ప్రభుత్వమని గొప్పగా చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటను నిలుపుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. పశుసంవర్ధకశాఖకు కేటాయిస్తున్న బడ్జెట్, అమలు చేస్తున్న పథకాలు చూస్తే అందుకు విరుద్ధంగా ఉండటం విశేషం. పశుక్రాంతి లాంటి ప్రతిష్టాత్మకమైన పథకానికి ఫుల్స్టాప్ పెట్టగా.. మినీడెయిరీ లాంటి మంచి పథకానికి మంగళం పాడేశారు. జీవక్రాంతి ఊసేలేకపోగా.. పశుబీమా, జీవరక్షనిధి, బేడ్ఫాలక్బీమా లాంటి వాటిని పూర్తీగా అటకెక్కించారు. పెరటి కోళ్ల పెంపకం ఊరిస్తున్నా అతీగతి లేదు. డాక్టర్లు, కాంపౌండర్ల కొరత కారణంగా పశువైద్యానికి, వ్యాక్సినేషన్ లాంటి వాటికి ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కటీ కూడా లేదు : పశుశాఖ ద్వారా గత నాలుగేళ్లుగా ఒక్క పథకం కూడా అమలు చేయలేదంటే ప్రధాన ప్రత్యామ్నాయం పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. పెద్దగా ఉపయోగపని సునందిని, క్షీరసాగర వంటి మరీ చిన్న పథకాలతో పాటు అజొల్లా, హైడ్రోఫోనిక్ గడ్డిపెంపకం లాంటి పేరు తెలియని పథకాలను అమలులోకి తెచ్చారు. సునందిని మినహా మిగతా పథకాలపై లబ్ధిదారులు అనాసక్తి ప్రదర్శిస్తుండటంతో బలవంతంగా ముందుకు పోతున్నారు. పశుగ్రాసం కొరతను అధిగమించడానికి ట్యాంక్బెడ్ కల్టివేషన్, అరకొరగా పశుదాణా పంపిణీ, సైలేజ్ బేల్స్ ఇచ్చారు. గతేడాది 300 యూనిట్ల వరకు మినీషీప్, గోట్స్ మంజూరు చేసినా అందులో 90 శాతం అర్హులకు కాకుండా అధికార పార్టీ నేతలు చెప్పిన వాళ్లకు ఇచ్చేశారు. గత నాలుగేళ్లుగా జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి కూడా పాడి పశువు లేదా పాడి గేదె పంపిణీ చేయలేదంటే ఆ శాఖ దీనస్థితి అర్థమవుతుంది. జిల్లాలో డబుల్ డిజిట్ గ్రోత్ సాధించడానికి పాలు, గ్రుడ్లు, మాంసం అభివద్ధికి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ శాఖ డైరెక్టరేట్‌కు మూడు నెలలకోసారి రూ.వందలకోట్ల బడ్జెట్‌తో నివేదికలు, ప్రతిపాదనలు పంపుతున్నా ఫలితం కనిపించడం లేదు. తాజాగా రూ.776 కోట్ల భారీ బడ్జెట్‌తో తయారు చేసిన మూడేళ్ల ప్రణాళిక పంపడం విశేషం. -
వెంటాడుతున్న వర్షాభావం
– 48 మండలాల్లో పరిస్థితి దయనీయం – దారుణంగా దెబ్బతిన్న వేరుశనగ, ఇతర ఖరీఫ్ పంటలు అనంతపురం అగ్రికల్చర్ : మునుపెన్నడూ లేని స్థాయిలో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఉపరితల అవర్తనం, అల్పపీడనం ఏర్పడుతున్నా అనుకున్న స్థాయిలో వర్షాలు పడటం లేదు. రోజూ వర్షపాతం నమోదవుతున్నా తేలికపాటి మినహా చెప్పుకోదగ్గ వర్షం కురవడం లేదు. జూన్, జూలైలో మురిపించిన వరుణుడు కీలకమైన ఆగస్టులో మొహం చాటేయడంతో 7.45 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో సాగైన ఖరీఫ్ పంటలు దెబ్బతినడంతో ‘అనంత’ రైతులు భారీ నష్టాలు మూటగట్టుకున్నారు. సెప్టెంబర్‌లో కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా 48 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కూడేరు, కంబదూరు, పెద్దవడుగూరు, ఆత్మకూరు, మడకశిర వంటి 15 మండలాల్లో మాత్రమే కాస్త ఎక్కువగానూ సాధారణంగానూ వర్షపాతం నమోదైంది. తక్కిన మండలాల్లో తక్కువగా వర్షాలు కురిశాయి. గుమ్మఘట్టలో మరీ దారుణం : గుమ్మఘట్ట మండలంలో 72 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. గుమ్మఘట్టలో జూన్ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు 226.8 మి.మీ వర్షం పడాల్సి ఉండగా కేవలం 63 మి.మీ నమోదైంది. అలాగే బుక్కపట్నంలో 3890.9 మి.మీ గానూ 192 మి.మీ, రాప్తాడులో 272.2 మి.మీ గానూ 138.6 మి.మీ, కదిరిలో 366.7 మి.మీ గానూ 183.8 మి.మీ నమోదైంది. ఈ మూడు మండలాల్లో కూడా సాధారణం కన్నా 50 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. నల్లచెరువు 49 శాతం, రామగిరి 45 శాతం, తనకల్లు 42 శాతం, బొమ్మనహాల్ 40 శాతం, అమరాపురం 39 శాతం, కనగానపల్లి 37 శాతం, బెళుగుప్ప 37 శాతం, పుట్టపర్తి 36 శాతం, రొళ్ల, చిలమత్తూరు, గాండ్లపెంటలో 35 శాతం, అమడగూరు 32 శాతం, హిందూపురంలో 31 శాతం మేర తక్కువ వర్షపాతం కురిసింది. యాడికి, తాడిపత్రి, పెద్దపప్పూరు, శింగనమల, పామిడి, గార్లదిన్నె, ఉరవకొండ, బ్రహ్మసముద్రం, అనంతపురం, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, బత్తలపల్లి, ముదిగుబ్బ, ఎన్పీ కుంట, ఓడీ చెరువు, కొత్తచెరువు, పెనుకొండ, రొద్దం, పరిగి, నల్లమాడ, తలుపుల, విడపనకల్, వజ్రకరూరు, రాయదుర్గం, గుత్తి, గుంతకల్లు, కుందుర్పి, యల్లనూరు తదితర మండలాల్లో కూడా తక్కువగా వర్షాలు కురిశాయి. 45 రోజుల తర్వాత అగళిలో చినుకులు : ఆగస్టు నెలలో అగళి, రొళ్ల మండలాల్లో చినుకు జాడ లేదు. ఈ రెండు మండలాల్లో సున్నా వర్షపాతం నమోదు కావడం విశేషం. చివరకు సెప్టెంబర్ 7న రొళ్లలో 8 మి.మీ వర్షపాతం కురవగా అగళిలో ఈనెల 15న అంటే సరిగ్గా 45 రోజుల తర్వాత 16 మి.మీ మేర తేలికపాటి వర్షం పడింది. ఇలా నెలల తరబడి చినుకులు నేలకు పడకపోవడంతో పంటలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. కీలకమైన ఆగస్టులో 32 మండలాల్లో కనీసం 10 మి.మీ వర్షం పడిన దాఖలాలు లేవు. కేవలం ఒకట్రెండు సార్లు తుంపర వర్షం పడింది. మిగతా 31 మండలాల్లో ఒకట్రెండు తేలికపాటి వర్షం కురిసింది. దీంతో ఆగస్టు నెలలో 88.7 మి.మీ గానూ కేవలం 18.1 మి.మీ నమోదైంది. అంటే కురవాల్సిన వర్షం కన్నా 80 శాతం తక్కువగా పడటం గమనార్హం. ఇక సెప్టెంబర్‌లో భారీ వర్షాలు పడాల్సివుండగా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అక్కడక్కడా తేలికపాటి జల్లులు మినహా ఎక్కడా చెప్పుకోదగ్గ వర్షం పడలేదు. ఈనెలలో 118.4 మి.మీ భారీ సగటు నమోదు కావాల్సి ఉండగా 17 రోజులైనా 18.9 మి.మీ నమోదైంది. జూన్‌లో 63.9 మి.మీ గానూ 47 శాతం ఎక్కువగా 94.5 మి.మీ, జూలైలో 67.4 మి.మీ గానూ 52 శాతం అధికంగా 102.8 మి.మీ నమోదు కావడంతో ఆగస్టు, సెప్టెంబర్ వర్షాభావం అంతగా కనిపించని పరిస్థితి నెలకొంది. మొత్తమ్మీద ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు 278.4 మి.మీ గానూ 234.3 మి.మీ నమోదైంది. అంటే 16 శాతం మాత్రమే లోటు కనిపిస్తోంది. పంటల సాగుకు వీలుగా జూన్, జూలైలో మంచి వర్షాలు పడటంతో ఈ సారి ఏకంగా 7.45 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. అందులో ప్రధానమైన వేరుశనగ 6.09 లక్షల హెక్టార్లలో సాగైంది. ఆగస్టు, సెప్టెంబర్ వర్షాలు మొహం చాటేయడంతో వేరుశనగతో పాటు ఇతర పంటల పరిస్థితి దయనీయంగా తయారైంది.