పాడెక్కిన పథకాలు
అనంతపురం అగ్రికల్చర్ : వరుణుడు కరుణించకపోవడంతో ఈ సారి ఖరీఫ్, రబీ పంటలు పూర్తీగా తుడిచిపెట్టుకుపోయాయి. కరువు పరిస్థితులు విలయతాండవం చేస్తుండటంతో భవిష్యత్తుపై ‘అనంత’ జనం ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాన ప్రత్యామ్నాయంగా అంతో ఇంతో ఆదుకోవాల్సిన పశుసంవర్ధకశాఖ పథకాలు పూర్తీగా పడకేశాయి. పాడి, జీవాల పెంపకానికి పెద్ద పీట వేసి ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం పశుశాఖను పట్టించుకోకపోవడంతో ‘అనంత’లో పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. గత నాలుగైదేళ్లుగా పథకాలు, కార్యక్రమాలు లేక పశుసంవర్ధకశాఖ పూర్తీగా నీరసించిపోవడంతో రైతులు, కాపర్లు, ఇతరత్రా పేద వర్గాల జీవన ప్రమాణాలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది.
పాడికి పెద్దపీట అంటూనే.. తరచూకరువు పరిస్థితులు నెలకొంటున్న అనంతపురం జిల్లాలో పాడి, గొర్రెల పెంపకానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఏటా జిల్లాలో పర్యటించి వెళుతున్న కేంద్ర కరువు బందాలు గట్టిగా సిఫారసు చేస్తున్నా వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది.
జిల్లాలో 9.80 లక్షల సంఖ్యలో పశుసంపద, 42 లక్షల సంఖ్యలో గొర్రెలు, మేకలు, 18 లక్షల కోళ్లు, మరో 50 వేలు మూగజీవాలు ఉన్నాయి. పాడి పరిశ్రమపై 2.50 లక్షల కుటుంబాలు, 48 వేల కుటుంబాలు గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఓ వైపు కేంద్ర బందాలు సిఫారసులు చేస్తుండటం, మరో వైపు రైతు ప్రభుత్వమని గొప్పగా చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటను నిలుపుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. పశుసంవర్ధకశాఖకు కేటాయిస్తున్న బడ్జెట్, అమలు చేస్తున్న పథకాలు చూస్తే అందుకు విరుద్ధంగా ఉండటం విశేషం. పశుక్రాంతి లాంటి ప్రతిష్టాత్మకమైన పథకానికి ఫుల్‌స్టాప్ పెట్టగా.. మినీడెయిరీ లాంటి మంచి పథకానికి మంగళం పాడేశారు. జీవక్రాంతి ఊసేలేకపోగా.. పశుబీమా, జీవరక్షనిధి, బేడ్‌ఫాలక్‌బీమా లాంటి వాటిని పూర్తీగా అటకెక్కించారు. పెరటి కోళ్ల పెంపకం ఊరిస్తున్నా అతీగతి లేదు. డాక్టర్లు, కాంపౌండర్ల కొరత కారణంగా పశువైద్యానికి, వ్యాక్సినేషన్ లాంటి వాటికి ఇబ్బందులు తప్పడం లేదు.
ఒక్కటీ కూడా లేదు : పశుశాఖ ద్వారా గత నాలుగేళ్లుగా ఒక్క పథకం కూడా అమలు చేయలేదంటే ప్రధాన ప్రత్యామ్నాయం పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. పెద్దగా ఉపయోగపని సునందిని, క్షీరసాగర వంటి మరీ చిన్న పథకాలతో పాటు అజొల్లా, హైడ్రోఫోనిక్ గడ్డిపెంపకం లాంటి పేరు తెలియని పథకాలను అమలులోకి తెచ్చారు. సునందిని మినహా మిగతా పథకాలపై లబ్ధిదారులు అనాసక్తి ప్రదర్శిస్తుండటంతో బలవంతంగా ముందుకు పోతున్నారు.
పశుగ్రాసం కొరతను అధిగమించడానికి ట్యాంక్‌బెడ్ కల్టివేషన్, అరకొరగా పశుదాణా పంపిణీ, సైలేజ్ బేల్స్ ఇచ్చారు. గతేడాది 300 యూనిట్ల వరకు మినీషీప్, గోట్స్ మంజూరు చేసినా అందులో 90 శాతం అర్హులకు కాకుండా అధికార పార్టీ నేతలు చెప్పిన వాళ్లకు ఇచ్చేశారు. గత నాలుగేళ్లుగా జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి కూడా పాడి పశువు లేదా పాడి గేదె పంపిణీ చేయలేదంటే ఆ శాఖ దీనస్థితి అర్థమవుతుంది. జిల్లాలో డబుల్ డిజిట్ గ్రోత్ సాధించడానికి పాలు, గ్రుడ్లు, మాంసం అభివద్ధికి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ శాఖ డైరెక్టరేట్‌కు మూడు నెలలకోసారి రూ.వందలకోట్ల బడ్జెట్‌తో నివేదికలు, ప్రతిపాదనలు పంపుతున్నా ఫలితం కనిపించడం లేదు. తాజాగా రూ.776 కోట్ల భారీ బడ్జెట్‌తో తయారు చేసిన మూడేళ్ల ప్రణాళిక పంపడం విశేషం.