చెరువుల్లా మారిన రోడ్లు
చింతలపూడి, న్యూస్‌లైన్ :
మెట్ట ప్రాంతంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నా నిబంధనలను లెక్కచేయకుండా, నాసిరకంగా పనులు చేయడంతో వేసిన కొద్ది కాలానికే అవి గోతులు పడుతున్నాయి. కాంట్రాక్టర్లు తమ జేబులు నింపుకోవడానికే నిబంధనలను పాటించడం లేదు. దెబ్బతిన్న రహదారులపై రాకపోకలు సాగించడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చింతలపూడి నుంచి గురుభట్లగూడెం వరకు రూ. 15 కోట్ల వ్యయంతో ఇటీవల రోడ్డు విస్తరించారు. భారీ క్వారీ వాహనాల రాకపోకలతో రోడ్డు అక్కడక్కడా దెబ్బతింది. మధ్యలో రాఘవాపురంలో కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం చేపట్ట లేదు. దీంతో మెయిన్ సెంటర్లో పెద్ద,పెద్ద గోతులు పడి రోడ్డు చెరువును తలపిస్తోంది. ఫాతిమాపురం నుంచి ప్రగడవరం వెళ్లే రోడ్డును రూ. కోటిపైగా వెచ్చించి ప్రస్తుతం విస్తరిస్తున్నారు.
వర్షాలకు రోడ్డు మార్జిన్ కొట్టుకు పోవడంతో పనుల్లో డొల్లతనాన్ని బయట పెడుతోంది. ఏలూరు-చింతలపూడి ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు అధ్వానంగా మారింది. పట్టణంలోని మారుతీ నగర్ సమీపంలో, పెట్రోలు బంకుల సమీపంలో, చైతన్యభారతి జూనియర్ కళాశాల సమీపంలో ఇటీవలే లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి మరమ్మతులు చేశారు. రోడ్డు వేసిన కొద్ది రోజులకు వర్షాలు పడ్డంతో యథాస్థితికి చేరుకుంది. రోడ్ల మరమ్మతులపై ఆర్అండ్బీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు నామమాత్రంగా పనులు చేసి జేబులు నింపుకొంటున్నారనే విమర్శలున్నాయి. రోడ్ల నిర్వహణ, మరమ్మతులకు ప్రభుత్వం రూ. కోట్లు మంజూరు చేసినా ఫలితం కనిపించడం లేదు. రోడ్డుపై వేసిన తారు పైకిలేచి కంకర తేలిపోతోంది. పలు ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోతున్నాయి. మరమ్మతుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే ఈపరిస్థితి ఉండదని ప్రజలంటున్నారు