సాంస్కృతిక మండలి మాజీ అధ్యక్షుడు రమణమూర్తి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాంస్కృతిక మండలి మాజీ అధ్యక్షుడు, సినీ నిర్మాత ఆర్వీ రమణమూర్తి(72) కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజాము రెండున్నర గంటలకు మృతిచెందారు. ఇందిరాపార్క్ సమీపంలోని ఆయన నివాసంలో ఆయన భౌతికకాయాన్ని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. రమణమూర్తికి ఇద్దరు కుమార్తెలు. సాయంత్రం బన్సీలాల్ పేటలోని శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.
అభిరుచి కలిగిన నిర్మాత..: రమణమూర్తి మంచి అభిరుచి కలిగిన సినీ నిర్మాతగా, సాంస్కృతికరంగ ప్రముఖునిగా పేరుపొందారు. ఆంధ్రప్రదేశ్ కళావేదిక పక్షాన పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన అభినందన, నీరాజనం, సాయిమహిమ వంటి సంగీత ప్రధాన చిత్రాలను నిర్మించారు. ప్రముఖ హిందీ సినీ సంగీత దర్శకుడు ఓపీ నయ్యర్‌ను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. ఇటీవలే ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగయ్య చిత్రాన్ని నిర్మించేందు కు కథ తయారుచేసుకుని కొన్ని పాటలు కూడా రికార్డు చేయించారు. ఎందరో పేద కళాకారులకు ఆర్థికసాయం అందజేశారు. తొలినాళ్లలో దివంగత సీఎం టి.అంజయ్యకు, ఆ తరువాత ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కె.రోశయ్యకు సన్నిహితునిగా పేరుపొందారు. కాగా రమణమూర్తి మృతిపట్ల సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, జ్ఞానపీఠ్ అవార్డుగ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. రమణమూర్తి మరణం కళారంగానికి తీరని లోటని రోశయ్య పేర్కొన్నారు.