ఎగుమతుల్లో ఉమ్మడి రాష్ట్రానిది ఐదోస్థానం
కస్టమ్స్ చీఫ్ కమిషనర్ దీప బి దాస్‌గుప్తా
కాకినాడ: పోర్టు ఎగుమతుల్లో అవిభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదో స్థానంలో నిలిచిందని కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ చీఫ్ కమిషనర్ దీప బి దాస్ గుప్తా పేర్కొన్నారు. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్‌కు సంబంధించిన పలు అంశాలపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఐఈఓ), ది కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్, ఆంధ్రాబ్యాంకు, కృష్ణపట్నం పోర్టు సంయుక్తంగా మంగళవారం కాకినాడలోని హెలికాన్ టైమ్స్‌లో చర్చా గోష్టి ఏర్పాటు చేశాయి. ముఖ్య అతిథిగా దీప విచ్చేశారు. కార్యక్రమంలో ఎఫ్ఐఈఓ సదరన్ రీజియన్ చైర్మన్ వాల్టర్ డిసౌజా మాట్లాడుతూ గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తర్వాతి స్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్దని అన్నారు. ఆంధ్రా పోర్టుల నుంచి ఈ ఏడాది సుమారు రూ.60 వేల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయన్నారు.
కాకినాడలో కస్టమ్స్ కమిషనరేట్
తొలి కమిషనర్‌గా శివనాగ కుమారి
కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ కమిషనరేట్ కాకినాడలో ఏర్పాటు కానుంది. కమిషనరేట్ ఏర్పాటుకు ప్రక్రియ పూర్తయ్యిందని, విశాఖలో ఉన్న కమిషనరేట్-2 కార్యాలయాన్ని కాకినాడకు తరలించడం ఒక్కటే మిగిలి ఉందని బుధవారం కాకినాడలో ఎగుమతి, దిగుమతిదారుల సమావేశానికి వచ్చిన చీఫ్ కమిషనర్ దీపా బి దాస్‌గుప్తా ‘సాక్షి’కి ధ్రువీకరించారు. విశాఖపట్నం-2 కమిషనరేట్ కమిషనర్‌గా పనిచేస్తున్న బీవీ శివనాగ కుమారి అదే హోదాలో ఇక్కడకు రానున్నారు.