రాణి డయానా గురించి షాకింగ్ న్యూస్
లండన్: కారు ప్రమాదంలో చనిపోయిన బ్రిటన్ యువరాణి డయానాకు సంబంధించి ఒక షాకింగ్ విషయం తెలిసింది. పెళ్లి అయిన పది రోజుల్లోనే ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఆమె తన రెండు చేతుల మణికట్టులను రేజర్ బ్లేడ్‌తో కోసుకునే ప్రయత్నం చేసిందని వెల్లడైంది. ఈ విషయాన్ని ఆమె తన సొంతమాటల్లో చెప్పినట్లు ఉన్న ఆడియో రికార్డులు ఉన్నట్లు తెలిసింది. ఆమె పెళ్లి అయిన తర్వాత చాలా మానసిక ఒత్తిడికి లోనైందని, అందుకు కారణం ఆమె భర్త చార్లెస్‌తోపాటు అతడి ప్రియురాలు క్యామిల్లానేనని తాజాగా బహిర్గతమైంది.
‘నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను. నేను రేజర్ బ్లేడ్లతో నా చేతుల మణికట్లు కోసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను’ అని ఒకప్పుడు ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ అయిన డయానా ఈ ఘటనకు పాల్పడుతూ తన వాయిస్‌ను రికార్డు చేసుకుంది. ఈ మాటలు దాదాపు 1991 ప్రాంతంలో రికార్డయినట్లు చెబుతున్నారు. అయితే, ఆమె ఈ రికార్డింగులను ఓ స్నేహితురాలి సహాయంతో 20 ఏళ్లు బయటకు రాకుండా భద్రపరిచినట్లు ది సన్ తెలిపింది.
గతంలోనే డయానాపై మోర్టన్ అనే పుస్తకం వచ్చినప్పటికీ అందులో కేవలం స్నేహితులు మాత్రమే ఈ విషయం చెప్పినట్లు ఉండగా తాజాగా విడుదల చేస్తున్న పుస్తకంలో మాత్రం ఆత్మహత్యా ప్రయత్నం విషయాన్ని డయానేనే స్వయంగా చెప్పినట్లు పేర్కొన్నారు. తాజా పుస్తకం ఆండ్రూ మోర్టన్: డయానా-హర్ ట్రూ స్టోరీ అనే పేరుతో వస్తోంది. 1996 ఆగస్టు 28న ఆమెకు చార్లెస్‌కు వివాహం కాగా, 1997 ఆగస్టులో కారు ప్రమాదంలో చనిపోయింది. ఇది ఇప్పటికీ ఓ మిస్టరీనే.