Cuttack hospital
-
రెండు వారాల్లో 54 మంది శిశువులు మృతి
భువనేశ్వర్ : ఒడిశా కటక్‌లోని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సర్దార్ వల్లభాయిపటేల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పిడియాట్రిక్స్ సంస్థలో నవజాత శిశువులు వరుసగా మరణిస్తున్నారు. గత 14 రోజుల్లో 54 మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఈ సంఘటనతో నవీన్ పట్నాయిక్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఒడిశా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అటాన్ సబ్యసాచి నాయక్ వెల్లడించారు. నవజాత శిశువుల మరణాలకు గల కారణంపై ఈ కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామన్నారు. అయితే ఆసుపత్రిలో మృతి చెందిన శిశువులకు పోస్ట్ మార్టం నిర్వహించడం లేదని బీజేపీ ఆరోపించింది. శిశువు మృతికి నిరసనగా సెప్టెంబర్ 2 తేదీన రాష్ట్రంలో బంద్‌కు ఆ పార్టీ పిలుపునిచ్చింది. మరో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా శిశువుల మరణాలపై స్పందించింది. త్వరలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ఆసుపత్రిని సందర్శిస్తారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. -
రేప్‌కు గురైన మైనర్ బాలిక పరిస్థితి విషమం
ఒడిశా రాష్ట్రంలోని నయాగర్ జిల్లాలో అత్యాచారానికి గురైన గిరిజన మైనర్ బాలిక పరిస్థితి విషమంగా ఉందని కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యులు శనివారం ఇక్కడ వెల్లడించారు. ఆ బాలిక పాక్షికంగా సృహలో ఉంటుందని తెలిపారు. మైనర్ బాలిక మెడపైన బలమైన గాయానికి శస్త్ర చికిత్స నిర్వహించామని, అయినా ఆ బాలిక మట్లాడలేకపోతుందని చెప్పారు. ఆగస్టు 20న కందపడ పోలీస్ స్టేషన్ పరిధిలో కందమిరిగి గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులు పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. రక్తపు ముడుగులో విగత జీవిగా ఉన్న ఆ మైనర్ బాలికను కుటుంబ సభ్యులు చూసి భువనేశ్వర్‌లోని క్యాపిటల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితిలో ఎంతకు మార్పు రాకపోవడంతో ఆమెను కటక్‌లోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఘటన తీవ్ర సంచలనం రేపింది. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులు చేపట్టిన నిరసనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.