ప్రముఖ దర్శకుడి కన్నుమూత
సాక్షి, చెన్నై : ప్రముఖ తమిళ దర్శకుడు సీవీ రాజేంద్రన్(81) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం చెన్నైలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రముఖ దర్శకుడు సీవీ శ్రీధర్‌కు రాజేంద్రన్ సోదరుడు. తమిళనాడు చెంగల్పట్టు సమీపంలోని చిత్తామురి ఆయన స్వస్థలం. తమిళంతో పాటు కన్నడం, హిందీ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు తెరకెక్కించారు. శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు రూపొందించారు.
శివాజీ గణేశన్ కుమారుడు ప్రభును సంగిలి చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఈయనే. సుమతి ఎన్ సుందరి, గర్జనై, కలాట్టా కళ్యాణం వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను చిత్ర పరిశ్రమకు అందించారు. అమెరికాలో ఉన్న రాజేంద్రన్ కుమారుడు వచ్చిన తర్వాత చెన్నైలోని టీ నగర్లో రాజేంద్రన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.