సైకిల్ పోలో.. ఆడేద్దాం చలో..
వాంకె శ్రీనివాస్: క్రికెట్, వాలీబాల్, చెస్, బ్యాడ్మింటన్, టెన్నిస్ ఆటలంటే ఇవేనా..క్రీడాభిమానుల్ని ఉర్రూతలూగించేవి ఎన్ని లేవు. మొన్నటికి మొన్న బీచ్ వాలీబాల్ టోర్నీ ఆక ట్టుకుంది. అలాంటిదే సైకిల్ పోలో..అంటే ఏంటి? అనే వాళ్లు సిటీలో చాలా మందే ఉన్నారు. అయితే బ్రిటిష్ కాలంలోనే ‘చూగాన్’గా ఈ ఆట ప్రాచుర్యంలో ఉంది. మళ్లీ ఈ ఆటకు ఇప్పుడిప్పుడే క్రేజ్ పెరుగుతోంది. ఆట పాతదైనా నగరంలో మాత్రం కొత్త గేమ్‌గానే మైదానానికి చేరుతోంది...
సైకిల్ పోలో అతి పురాతనమైన ఆట. బ్రిటిష్ కాలంలో చూగాన్ అనే పేరుతో మణిపూర్ రాష్ర్టంలో ఆడేవారు. మొదట్లో రాజులు, నవాబులు గుర్రాలపై నుంచి కట్టెతో చేసిన బంతితో ఆడేవారు. రానురాను ఈ ఆట సామాన్యునికి వీలుగా సైకిల్‌పై ఆడటం ప్రారంభించారు. కట్టె బంతికి బదులుగా రబ్బరు బంతి వాడుకలోకి వచ్చింది. దీనికి భారతదేశం పుట్టినిల్లు అని చెప్పవచ్చు. అధికారికంగా అప్పటి రక్షణ శాఖ మంత్రి వి.కె.కృష్ణ మీనన్ 1966లో రిపబ్లిక్ డే రోజు మొదటి సైకిల్ పోలోను ఆరంభించారు. 1970లో రాష్ట్రంలో జాతీయ టోర్నీ నిర్వహించారు.
రౌండ్లు, పాయింట్ల...
శిక్షణకు ఎక్కువ టైం అక్కర్లేదు. మిగిలిన ఆటలతో పోలిస్తే పోటీ తక్కువ. శ్రమ కూడా తక్కువే. పైగా అంతులేని మజా. ఈ అంశాలే యువతను సైకిల్ పోలోవైపు మళ్లిస్తున్నాయి. ఈ ఆటలో నాలుగు రౌండ్లు ఉంటాయి. ఒక్కో రౌండ్‌కు ఏడున్నర నిమిషాల నిడివి. బంతి టెన్నిస్ బాల్ సైజు కంటె కొంచెం పెద్దది. ఒక్కో రౌండ్‌ను చక్కర్ అంటారు. బాల్‌ను కొట్టేటప్పుడు కాలు కింద పెట్టకూడదు. బాల్ బరువు 85 నుంచి 90 గ్రాములు. సైజు 75 నుంచి 76.5 మిల్లీమీటర్ల, కొలత 24 సెంటిమీటర్లు ఉంటుంది. పోల్ స్టిక్ కట్టెతో తయారుచేస్తారు. గోల్‌పోస్టు ఎత్తు 2.5 మిల్లీమీటర్లు, వెడల్పు 1.5 మీటర్లు. ఈ ఆటలో అమ్మాయిలు వాడే సైకిళ్లను ఉపయోగిస్తారు.
శిక్షణ కేంద్రాలు:
సౌత్ లాలాగూడ వర్క్‌షాప్ ప్లే గ్రౌండ్-ఆర్.సత్యనారాయణ:7207691886,
జి.చందర్ 9848734766
మల్కాజిగిరి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లే గ్రౌండ్-జి.బాలనర్సింహ -9440491838
రైల్వే బాయ్స్ హైస్కూల్, నార్త్ లాలాగూడ- కె.ఆనంద్ కుమార్-9640443649
రామకృష్ణ విద్యాలయం, నేరేడ్మెట్ ఎక్స్ రోడ్డు-జి.సాయి వినోద్- 9848734766
ఆంధ్రప్రదేశ్ హార్స్ రైడింగ్ క్లబ్, చిలుకూరు-సెక్రటరీ కోచ్ కాదీర్ సిద్ధిఖ్-9949000085
సంఘీ స్కూల్, సంఘీ గుడి దగ్గర, కోచ్ జగదీశ్ నంబర్-9392400103
ఆడే పద్ధతి...
సైకిల్ తొక్కుతూ ఒక చేతితో బాల్‌ను కొడుతూ ముందుకు వెళ్లాలి. ఒక క్రీడాకారుడు బాల్‌ను వరుసగా మూడుసార్ల కంటే ఎక్కువ తాకకూడదు. ఒకరికి ఒకరు బాల్‌ను అందించుకుంటూ ప్రత్యర్థి జట్టు గోల్‌పోస్టులోకి నెట్టాలి.
విభాగాలు
(గర్ల్స్, బాయ్స్)
సబ్ జూనియర్ అండర్-14, జూనియర్ అండర్-18, 18 పైబడి మెన్, ఉమెన్ జట్లుగా పరిగణిస్తారు.
అడ్మిషన్‌కు అర్హత
కేవలం సైకిల్ తొక్కడం వస్తే చాలు సైకిల్ పోలో శిక్షణ తీసుకోవచ్చు. ఎలాంటి ఫీజు లేదు. మూడు నెలల్లో గేమ్‌పై పట్టు బిగించొచ్చు. సైకిల్, స్టిక్, బాల్ నిర్వాహకులే ఇస్తారు.