17 నుంచి డీసెట్
రాయవరం/రాజమహేంద్రవరం రూరల్ : ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయ కోర్సు (డీఎడ్) శిక్షణ కళాశాలల్లో ప్రవేశానికి అర్హత పరీక్ష ‘డీసెట్-2016’ నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకూ మూడు రోజులపాటు రెండు విడతలుగా ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ తొలి విడత, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రెండో విడత పరీక్ష నిర్వహిస్తారు. జిల్లాలో 11,783 మంది పరీక్షకు హాజరు కానున్నారని బొమ్మూరులోని జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏఎం జయశ్రీ తెలిపారు.
గణితం 4,159 మంది, భౌతికశాస్త్రం 1,158 మంది, జీవశాస్త్రం 2,608 మంది, సాంఘిక శాస్త్రం 3,858 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)గా ఆన్లైన్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానంపై అంతగా అవగాహన లేకపోవడంతో గ్రామీణ అభ్యర్థుల్లో కాస్త గందరగోళం నెలకొందని చెబుతున్నారు.
అభ్యర్థులకు సూచనలు
హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగానే దాని నంబర్, పరీక్ష తేదీ, సమయం, పరీక్షా కేంద్రం చిరునామా పరిశీలించుకోవాలి.పేరు సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. హాల్‌టికెట్‌పై సూచనలు చదవాలి.ముందుగా కేటాయించిన తేదీ, సమయంలో మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు.
ఉదయం పరీక్షకు హాజరయ్యేవారు 9 గంటలకు, మధ్యాహ్నం హాజరయ్యేవారు 1.30 గంటలకు విధిగా పరీక్షా కేంద్రంలో రిపోర్టు చేయాలి. ఆలస్యంగా వస్తే అనుమతించరు.
అభ్యర్థులందరూ తప్పనిసరిగా డీఈఈసీఈటీ.ఈజీజీ.జీవోవీ.ఇన్, డీఈఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ వైబ్‌సెట్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించి ఉంచిన నమూనా పరీక్ష పేపరును ప్రాక్టీస్ చేయాలి.
పరీక్షా సమయంలో..
హాల్ టికెట్లో ఇచ్చిన పాస్‌వర్డ్‌తో కేటాయించిన కంప్యూటర్లో లాగిన్ అవాలి. మానిటర్‌పై తమ వివరాలు సరిచూసుకుని ‘ఐ కన్ఫర్మ’ లేదా ‘ఐ డినై’పై క్లిక్ చేయాలి.
పరీక్షకు సంబంధించిన అన్ని సూచనలూ క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకోవాలి.
తనకు ‘కేటాయించిన కంప్యూటర్ సరైన స్థితిలో ఉన్నది. సూచనలు చదివి అవగాహన చేసుకున్నాను’ అనే బాక్స్‌పై క్లిక్ చేయాలి. సూచనలు చదివిన తరువాత ‘ఐయామ్ రెడీ టు బిగిన్’ బటన్ క్లిక్ చేయాలి.
ప్రశ్నలకు ఇచ్చిన 4 సమాధానాల్లో సరైన దానిని ఎంచుకోవడానికి ‘మౌస్’ మాత్రమే వినియోగించాలి.
ఆన్లైన్ పరీక్ష పత్రాన్ని చూపించే స్క్రీన్
కుడిచేతిపై భాగంలో మిగిలి ఉన్న సమయం కనిపిస్తుంది.
అభ్యర్థులు సమాధానాలు నమోదు చేసే ప్రక్రియ ఆధారంగా ప్రశ్నా సంఖ్యలు వివిధ రంగులు, ఆకృతుల్లో ఉంటాయి.
ఎరుపు : సమాధానం రాయని ప్రశ్నలకు
తెలుపు చదరం : ప్రయత్నించని ప్రశ్నలకు
ఆకుపచ్చ పంచభుజి : ప్రయత్నించిన ప్రశ్నలకు
వెలైట్ : సమీక్ష కోసం గుర్తించిన ప్రశ్నలకు
వెలైట్ సర్కిల్ విత్ ఎ గ్రీన్ టిక్ : సమాధానం రాసి, తర్వాత సమీక్ష చేయడానికి అభ్యర్థి గుర్తించిన ప్రశ్నలు
ఒక ప్రశ్నకు అభ్యర్థి సమాధానాన్ని గుర్తించిన తరువాత సమాధానాన్ని ‘సేవ్’ చేసి తరువాతి ప్రశ్నకు వెళ్లడానికి ‘సేవ్ అండ్ నెక్ట్స్’ బటన్ నొక్కాలి. తరువాతి ప్రశ్నకు వెళ్లడానికి ముందు ఆ బటన్ క్లిక్ చేశారో లేదో గమనించాలి.
ఒక ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించిన తర్వాత మళ్లీ సరి చేసుకోవడానికి, మార్చుకొనడానికి ‘క్లియర్ రెస్పాన్స’ ఆప్షన్ కనిపిస్తుంది.
మానిటర్ కుడివైపున సమాధానం రాసిన ప్రశ్నలు, సమాధానం రాయని ప్రశ్నలు, సమీక్షకు గుర్తించిన ప్రశ్నలకు ‘రెడీ టు రిఫరెన్స’ కనిపిస్తుంది. సమాధానం ఎంపిక చేసే సమీక్ష కోసం గుర్తించిన ప్రశ్నలను సమాధానం రాసిన ప్రశ్నలుగా భావిస్తారు.
ప్రశ్న, సమాధానాలు పెద్ద అక్షరాలుగా కనబడకపోతే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకు వెళ్లాలి.
పరీక్ష జరిగే సమయంలో ఎప్పుడైనా సూచనలు చూసుకోవడానికి ‘ఇన్స్ట్రక్షన్స’ బటన్‌పై క్లిక్ చేయాలి.
పరీక్ష పూర్తయ్యే సమయంలో ‘సబ్మిట్’ బటన్ క్లిక్ చేయాలి. ఏదైనా కారణంతో లాగ్ అవుట్ అయితే, అప్పటివరకూ రాసిన సమాధానాలు సేవ్ అవుతాయి. తిరిగి ఆగిపోయినవద్ద నుంచి పరీక్ష ప్రారంభమవుతుంది.