d. venkatesh
-
యడ్యూరప్పపై అంటరానితనం ఫిర్యాదు
మండ్య (కర్ణాటక): కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప దళితుల పట్ల అంటరానితనం పాటిస్తున్నారంటూ మండ్య జిల్లాకు చెందిన డి.వెంకటేష్ అనే వ్యక్తి ఆ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కరువు యాత్రలు చేపడుతూ దళితుల ఇళ్లకు వెళ్లి భోజనం చేస్తున్నానని చెప్పుకుంటున్న యడ్యూరప్ప... అక్కడకు హోటల్ నుంచి ఆహారం తెప్పించుకుని తింటున్నారని ఆరోపించారు. తద్వారా దళితుల పట్ల వివక్ష చూపుతూ, వారి ఇళ్లలో భోజనం చేయడం తప్పనే సందేశాన్ని ప్రజల్లోకి పంపుతున్నారన్నారు. కరువు యాత్రలు చేపడుతున్న యడ్యూరప్ప ఈ నెల 18న తుమకూరు జిల్లాలోని ఓ దళిత బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్లి అక్కడకు హోటల్ నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారు. దీనిపై వెంకటేష్ ఎస్పీకి ఫిర్యాదు చేయగా బీజేపీ ఖండించింది. యడ్యూరప్ప వెళ్లేటప్పటికి ఆ ఇంట్లో వండిన ఆహారం అయిపోయినందునే హోటల్ నుంచి తెప్పించారని వివరణ ఇచ్చింది. -
డిఫరెంట్ లవ్‌స్టోరీ
తమిళంలో మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న చిత్రం ‘తంగ మీన్గళ్’. ఆ చిత్ర దర్శకుడు రామ్ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘తారామణి’. ఓ ఆంగ్లో-ఇండియన్ అమ్మాయికీ, పల్లెటూరి అబ్బాయికీ మధ్య సాగే వినూత్న ప్రేమకథ ఇది. ఆండ్రియా, అంజలి, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తెలుగు హక్కులను డీవీ సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేశ్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ పలు విభిన్నమైన చిత్రాలను అందించి, సక్సెస్ సాధించాం. మరో వైవిధ్యమైన చిత్రాన్ని అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. త్వరలో తెలుగు టైటిల్ ప్రకటిస్తాం. జీవా, కాజల్ అగర్వాల్ నటించిన తమిళ చిత్రాన్ని ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం డబ్బింగ్ జరుపుకుంటోంది. ‘తారామణి’, ‘ఎంతవరకు ఈ ప్రేమ’ చిత్రాలను ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.