డిఫరెంట్ లవ్‌స్టోరీ
తమిళంలో మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న చిత్రం ‘తంగ మీన్‌గళ్’. ఆ చిత్ర దర్శకుడు రామ్ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘తారామణి’. ఓ ఆంగ్లో-ఇండియన్ అమ్మాయికీ, పల్లెటూరి అబ్బాయికీ మధ్య సాగే వినూత్న ప్రేమకథ ఇది. ఆండ్రియా, అంజలి, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తెలుగు హక్కులను డీవీ సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేశ్ దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ పలు విభిన్నమైన చిత్రాలను అందించి, సక్సెస్ సాధించాం. మరో వైవిధ్యమైన చిత్రాన్ని అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. త్వరలో తెలుగు టైటిల్ ప్రకటిస్తాం. జీవా, కాజల్ అగర్వాల్ నటించిన తమిళ చిత్రాన్ని ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం డబ్బింగ్ జరుపుకుంటోంది. ‘తారామణి’, ‘ఎంతవరకు ఈ ప్రేమ’ చిత్రాలను ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.