dagadarthi airport
-
'రెండేళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి'
సాక్షి, కావలి: జిల్లాలో దగదర్తి మండలం దామవరంలో నిర్మించ తలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రెండేళ్లలో పూర్తి చేసి ప్రజలకు అంకితమిస్తామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చెప్పారు. విమానాశ్రయానికి అవసరమైన భూ సేకరణ, భూ వివాదాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్, కావలి సబ్‌కలెక్టర్ చామకూరి శ్రీధర్, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి శుక్రవారం కావలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా వివాదాస్పదంగా ఉన్న 300 ఎకరాల భూములపైనే వారు ప్రధానంగా దృష్టి సారించి, తక్షణమే తీసుకోవాల్సిన చర్యలు, విభిన్న అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నేతలు చేసిన దుర్మార్గపు వ్యవహారాలు, అక్రమాలు వల్లనే విమానాశ్రయ భూములను వివాదాలు చుట్టుముట్టాయన్నారు. భూ వివాదాలు పరిష్కరించకుండానే చంద్రబాబు ఎన్నికల కోసం శంకుస్థాపన డ్రామాలు ఆడారన్నారు. టీడీపీ నేతల స్వార్థం కోసం పేద ప్రజల భూములకు అక్రమంగా రికార్డులు సృష్టించుకుని, పేదల పొట్ట కొట్టారన్నారు. ప్రజలు చాలా ఏళ్లుగా విమానాశ్రయం నిర్మించాలని కోరుతున్నారని, అందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా నిర్మాణ పనులు ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. అందులో భాగంగానే తొలుత టీడీపీ నేతలు సృష్టించిన భూ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. అధికారులతో ఒక ప్రత్యేక కమిటీని నియమించి భూములను పరిశీలించి, ఎవరి స్వాదీనంలో వాస్తవంగా ఉందో గుర్తించే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మరో నెల రోజుల్లో విమానాశ్రయ భూములకు సంబంధించిన సమస్యలను కొలిక్కి తీసుకొస్తామని చెప్పారు. వీలైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భూమి పూజ చేయించి విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒంగోలు, నెల్లూరు నడుమ ఉన్న దామవరంలో నిర్మించే అంతర్జాతీయ విమానాశ్రయం ప్రజలు ప్రయాణాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదించిన దగదర్తిలోని అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని రెండేళ్లలో నిర్మించి ప్రజలకు కానుకగా ఇస్తామని ప్రకటించారు. విమానాశ్రయానికి డాక్టర్ వైఎస్సార్ పేరునే పెడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మన్నెమాల సుకుమార్‌రెడ్డి, కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, పందిటి కామరాజు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ప్రజలకు కానుకగా అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం
సింహపురి ప్రజల చిరకాల వాంఛ విమానయానం యోగం త్వరలో నెరవేరనుంది. ఐటీ, పరిశ్రమలకు కేంద్రాలుగా ఉన్న చెన్నై, బెంగళూరుకు కూడలిగా నెల్లూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది. నెల్లూరుకు అతి సమీపంలో కృష్ణపట్నం పోర్టు, పవర్ ప్రాజెక్ట్‌లతో పాటు విభిన్న జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల ఇంటిగ్రేటెడ్ సెజ్‌లు ఉన్నాయి. ప్రతిపాదిత విమానాశ్రయానికి సమీపంలో భారీ ఓడరేవు, నౌకా నిర్మాణ కేంద్రం, ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే.. ఇక్కడ నుంచి దేశ విదేశాలకు ప్రయాణ సౌకర్యం, కార్గో రవాణా వ్యవస్థ అభివృద్ధి సాధించనుంది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ ప్రతిపాదన గత ప్రభుత్వ హయాంలో కేవలం రన్ వేగా మారింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జిల్లా ప్రజల కల సాకారం అవుతోంది. సాక్షి, కావలి: కావలి నియోజక వర్గంలోని దగదర్తి మండలం దామవరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పురుడు పోసుకున్న అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా ప్రజలకు కానుకగా ఇవ్వనున్నారు. గత టీడీపీ పాలనలో విమానాశ్రయ నిర్మాణ ప్రక్రియ క్రమక్రమంగా శల్యమై ఒక దశలో నిర్మాణ ప్రతిపాదనలు రద్దు ప్రకటనలు కూడా వచ్చాయి. అప్పటి ప్రతిపక్షంతో పాటు ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆఖరుకు కేవలం రన్‌వే నిర్మాణానికి అధికారం అంతిమ దశలో శంకుస్థాపన చేసి టీడీపీ చేతులు దులుపుకుంది. ప్రభుత్వం మార్పు జరగడంతో అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంను అవసరమైన పనులు వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర విమానాయానశాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ విభాగం దామవరం విమానాశ్రయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండం గమనార్హం. దేశంలో విమానాశ్రయాలను పర్యవేక్షించడం, విమానాల రాకపోకల సమయాలను నిర్ధారించడం, విమానాశ్రయాలకు విమానాలు ల్యాండింగ్ వసతి కల్పించడం వంటి కార్యకలాలన్నీ కూడా ‘ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ అధికారికంగా పన్యవేక్షిస్తోంది. దీని వల్ల దామవరం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణాన్ని అదే సంస్థ చేపడితే అటు విమాన రాకపోకల సంఖ్యను మరిన్ని ఖరారు చేయడానికి, తద్వారా ప్రయాణికులకు సౌలభ్యత పెంచడం ద్వారా విమానాశ్రయం ప్రాధాన్యత పెరగడానికి దోహదపడుతుంది. కార్గో హ్యాండ్లింగ్ అంటే సరుకు రవాణా ద్వారా పెద్ద ఎత్తున జరగడానికి మార్గం సుగమం అవడం ద్వారా విమానాశ్రయం ఆర్థికంగా లాభాల బాట పట్టడానికి అవకాశం ఉంది. దామవరం వద్ద నిర్మించే అంతర్జాతీయ విమానాశ్రయం నమూనా ఎయిర్ పోర్టు స్వరూపం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతానికి ప్లాన్ ప్రతిపాదనలను ‘ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ రూప కల్పన చేసింది. ఈ విమానాశ్రయం కోసం మొత్తం 1379.71 ఎకరాలను భూసేకరణ చేయాల్సి ఉండగా, వాటిలో 1,061.095 ఎకరాల భూమిని భూసేకరణ ప్రక్రియ ముగిసింది. మిగిలిన 318.615 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ భూమిపై కొన్ని వివాదాల నెలకొని ఉండటంతో ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకొని అమలు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ► ఈ విమానాశ్రయం నెల్లూరుకు 30 కిలో మీటర్లు దూరంలో ఉత్తరం వైపున చెన్నై–విజయవాడ జాతీయ రహదారిపై పక్కనే దామవరం వద్ద నిర్మిస్తున్నారు. కావలికి 32 కిలో మీటర్లు, గూడూరుకు 52 కిలో మీటర్లు, 65 కిలో మీటర్లలో కందుకూరు (ప్రకాశం జిల్లా) పట్టణాలు ఉన్నాయి. ► విమానాశ్రయం నిర్మించే ప్రాంతంలో ఉత్తర–పడమర నడుమ 6 మీటర్ల ఎత్తులో తిప్పలు ఉన్నాయి. అందుకే రన్ వే ను పడమర వైపు క్లోజ్ అయ్యేటట్లుగా, విమానాలు తూర్పు వైపు నుంచి ల్యాండింగ్ అయ్యేటట్లుగా రన్ వే ను నిర్మించనున్నారు. ► 30 మీటర్లు వెడల్పు, 3,150 మీటర్లు పొడవు ఉండే రన్ వే ను నిర్మిస్తారు. ► 2030 నాటికి ఏడాదికి 5 లక్షల మంది ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగిస్తారని అంచనా. ► 2045 నాటికి ఏడాదికి 19 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకొంటారని అంచనా వేశారు. ► ప్రధానంగా కార్గో అంటే సరుకులు ఎగుమతి, దిగుమతులు పెద్ద ఎత్తున జరిగే విమానాశ్రయంగా దామవరం విమానాశ్రయం రూపుదిద్దుకోవడానికి అవకాశం ఉందని నిపుణులు పేర్కొటున్నారు. ► విమానాశ్రయ పరిపాలన ప్రధాన భవనమైన ‘టెర్మినల్’ బిల్డింగ్‌ను 4,000 చదరపు మీటర్లు విస్తీర్ణంలో నిర్మిస్తారు. రెండు ప్రధాన గేట్లు ఉండే ఈ విమానాశ్రయంలో చెక్ ఇన్ కౌంటర్లు–8, బ్యాగ్ చెక్ కౌంటర్లు– 2 ఏర్పాటు చేయనున్నారు. ► టెర్మినల్ బిల్డింగ్‌లో 1,400 మందికి వసతి ఉండేలా 10,000 చదరపు మీటర్లు ఉండే ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ► విమానాశ్రయం చుట్టూ 10,762 మీటర్లు ప్రహరీ 3 మీటర్లు ఎత్తులో నిర్మించనున్నారు. ప్రత్యేకతలు.. ప్రయోజనాలు దామవరం వద్ద రూ.5,600 కోట్లతో నిర్మించనున్న భారీ విమానాశ్రయానికి ఎన్నో ప్రత్యేకతలు.. ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాపార రీత్యా లాభసాటిగా ఉంటుందనే విమానయాన రంగ నిపుణుల సూచనలను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. జిల్లా కేంద్రమైన నెల్లూరుకు, ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకు సమీపంలో ఉంది. దేశంలో విశిష్టత ఉన్న కోల్కత్తా– చెన్నై జాతీయ రహదారికి పక్కనే ఈ ఎయిర్‌పోర్టు ఉంది. విశాఖపట్నం–చెన్నై కోస్టల్, పరిశ్రమల కారిడార్ పరిధిలో ప్రాధాన్యత ఉన్న ప్రదేశంలో ఉంది. నిత్యం దేశ విదేశాల నౌకలు రాకపోకలతో ప్రైవేట్ నౌకాశ్రయాలకు వ్యాపార సవాల్ విసురుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్న కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో ఉంది. జాతీయ, అంతర్జాతీయ విభిన్న పరిశ్రమలతో ఇంటిగ్రేటెడ్ సెజ్‌గా ప్రఖ్యాతగాంచిన ‘శ్రీసిటీ’ సెజ్‌కు ఉపయోగపడనుంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో కావలికి సమీపంలోని రామాయపట్నం సముద్రతీరంలో ‘పోర్టు కమ్ షిప్ యార్డ్ (భారీ ఓడరేవు, నౌకా నిర్మాణ కేంద్రం) నిర్మాణ జరగడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అతి సమీపంలో కేవలం 25 కిలో మీటర్ల దూరంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. -
విమానాశ్రయ భూముల జాబితా విడుదల
దగదర్తి: దామవరంలో ఏర్పాటు కానున్న విమానాశ్రయం కోసం సేకరిస్తున్న దామవరం, కోత్తపల్లి కౌరుగుంట లబ్ధిదారుల జాబితాను శనివారం రెవెన్యూ అధికారులు విడుదల చేశారు. కోత్తపల్లి కౌరుగుంట పరిధిలోని సర్వే నెంబర్ 334,335లో గత నెలలో కోంత మేర చెల్లింపులు జరిగాయి. మిగిలిన 119 మందికి చెందిన లబ్ధిదారుల జాబితాను శనివారం రెవెన్యూ అధికారలు విడుదల చేశారు. విమానాశ్రయం కోసం సేకరిస్తున్న ఎలాంటి అభ్యంతరాలు లేని డీకేటీ భూములకు సంబంధించిన 11.54 ఎకరాలకు రెండు, మూడు రోజుల్లో పరిహారం అందచేయనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆందోళన సాక్ష్యాత్తు రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వేనెంబరు 335లోని అనుభవదారులకు అనుకూలంగా ఇచ్చిన ఆదేశాలను రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాము 25 ఏళ్లకు పైగా భూములను సాగుచేసుకుంటున్నామని, ప్రస్తుతం ఈ భూములను విమానాశ్రయం కోసం సేకరిస్తున్నారని పరిహారం అందుకోవడానికి తాము అనర్హులమని రెవెన్యూ అధికారులు చెప్పడంతో కోత్తపల్లికౌరుగుంటకు చెందిన 38 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై పలుమార్లు జిల్లా అధికారులకు తెలిపినా పట్టించుకోలేదన్నారు. దీంతో కోత్తపల్లి కౌరుగుంటకు చెందిన 38 మంది రైతులు సెప్టెబరు 7వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు. రిట్ పిటిష¯ŒS పేరుతో ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు 17.9.2016 తేదీన కోత్తపల్లి కౌరుగుంటకు చెందిన 38 మంది రైతులను భూముల్లో నుంచి తొలగించరాదని, వారికి పరిహారం అందిచే విషయంలో ఏమి చర్యలు తీసుకోంటున్నారో తెలపాలని ఆదేశించిందన్నారు. ఈ విషయమై తాహసీల్దార్ మధుసూదనరావును వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లబ్ధిదారుల జాబితా ప్రకటించడం జరిగిందని, హైకోర్టు ఆదేశాలు తమ కార్యాలయానికి అందలేదన్నారు. ఆదేశాలు అందిన తరువాత పరిశీలిస్తామన్నారు. -
నిబంధనల ప్రకారం భూసేకరణ
ఇన్చార్జి కలెక్టర్ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి దగదర్తి మండలంలో భూసేకరణ వేగవంతం చేయాలని ఇన్చార్జి కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడారు. సీజేఎఫ్ఎస్, పట్టా, అసైన్డ్, ప్రభుత్వ భూములకు సంబంధించి కేటగిరీ వారిగా పెండింగ్ లేకుండా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కోర్టులో కేసులను పరిష్కరించి భూసేకరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకు 150 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి రూ.17 కోట్ల నష్టపరిహారం మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కావలి ఆర్డీఓ నరసింహన్, దగదర్తి తహసీల్దార్ వై. మధుసూదన్‌రావు పాల్గొన్నారు. సమాచారాన్ని అందజేయండి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివిద శాఖలకు సంబంధించిన 235 ఇండికేటర్ల సమాచారాన్ని వెంటనే అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఇన్చార్జి కలెక్టర్ ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 37 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 235 ఇండికేటర్లు ఉన్నాయన్నారు. సమావేశంలో సీపీఓ పీబీకే మూర్తి పాల్గొన్నారు.