'రెండేళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి' | Kavali MLA Says International Airport Completed Within Two Years | Sakshi
Sakshi News home page

'రెండేళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి'

Published Sat, Nov 23 2019 10:49 AM | Last Updated on Sat, Nov 23 2019 10:49 AM

Kavali MLA Says International Airport Completed Within Two Years - Sakshi

విమానాశ్రయ భూములపై జేసీ, సబ్‌ కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్ష

సాక్షి, కావలి:  జిల్లాలో దగదర్తి మండలం దామవరంలో నిర్మించ తలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రెండేళ్లలో పూర్తి చేసి ప్రజలకు అంకితమిస్తామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చెప్పారు. విమానాశ్రయానికి అవసరమైన భూ సేకరణ, భూ వివాదాలపై జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్, కావలి సబ్‌కలెక్టర్‌ చామకూరి శ్రీధర్, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి శుక్రవారం కావలి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా వివాదాస్పదంగా ఉన్న 300 ఎకరాల భూములపైనే వారు ప్రధానంగా దృష్టి సారించి, తక్షణమే తీసుకోవాల్సిన చర్యలు, విభిన్న అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నేతలు చేసిన దుర్మార్గపు వ్యవహారాలు, అక్రమాలు వల్లనే విమానాశ్రయ భూములను వివాదాలు చుట్టుముట్టాయన్నారు. భూ వివాదాలు పరిష్కరించకుండానే చంద్రబాబు  ఎన్నికల కోసం శంకుస్థాపన డ్రామాలు ఆడారన్నారు. టీడీపీ నేతల స్వార్థం కోసం పేద ప్రజల భూములకు అక్రమంగా రికార్డులు సృష్టించుకుని, పేదల పొట్ట కొట్టారన్నారు. ప్రజలు చాలా ఏళ్లుగా విమానాశ్రయం నిర్మించాలని కోరుతున్నారని, అందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా నిర్మాణ పనులు ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.

అందులో భాగంగానే తొలుత టీడీపీ నేతలు సృష్టించిన భూ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. అధికారులతో ఒక ప్రత్యేక కమిటీని నియమించి భూములను పరిశీలించి, ఎవరి స్వాదీనంలో వాస్తవంగా ఉందో గుర్తించే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మరో నెల రోజుల్లో విమానాశ్రయ భూములకు సంబంధించిన సమస్యలను కొలిక్కి తీసుకొస్తామని చెప్పారు. వీలైతే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భూమి పూజ చేయించి విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒంగోలు, నెల్లూరు నడుమ ఉన్న దామవరంలో నిర్మించే అంతర్జాతీయ విమానాశ్రయం ప్రజలు ప్రయాణాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిపాదించిన దగదర్తిలోని అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని రెండేళ్లలో నిర్మించి ప్రజలకు కానుకగా ఇస్తామని  ప్రకటించారు. విమానాశ్రయానికి డాక్టర్‌ వైఎస్సార్‌ పేరునే పెడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మన్నెమాల సుకుమార్‌రెడ్డి, కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, పందిటి కామరాజు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement