దక్షత కలిగిన సినిమా ‘దక్ష’: తనికెళ్ళ భరణి
‘దక్ష అంటే అన్ని వ్యవహారాలు సమన్వయం చేసేవాడు అని అర్థం‘ అలాంటి దక్షతతో కూడిన కథనంతో తెరపైకి రాబోతున్న దక్ష చిత్రం అందరిని ఆకట్టుకుంటుందని ప్రముఖ టాలివుడ్ నటుడు తనికెళ్ళ భరణి తెలిపారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా, వివేకానంద విక్రాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ దక్ష‘. ఈ సినిమా ద్వారా సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లోగోను ఫిల్మ్ ఛాంబర్లో తనికెళ్ళ భరణి, శరత్ బాబు విడుదల చేసారు.
ఈ సందర్భంగా తనికెళ్ళ భరణి మాట్లాడుతూ తల్లాడ సాయి కృష్ణ చిన్న స్థాయి నుంచి స్వశక్తితో వ్యక్తి అని,. గతంలో వ్యవసాయం కథాంశంగా తను దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్‌కు నేషనల్ అవార్డు రావడం గర్వకారణమని అన్నారు. తన నిర్మాణంలో రూపొందుతున్న దక్ష చిత్రంతో తన మిత్రుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరోగా పరిచయం కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. శరత్ బాబు మంచి మిత్రుడే కాకుండా ఇద్దరం కలిసి పలు చిత్రాల్లో కలిసి పని చేశామని గుర్తు చేసుకున్నారు. ‘ఆయుష్ తన తమ్ముడి కొడుకైనప్పటికీ నా దగ్గరే పెరిగాడని, తన తనయుడిగా ఇండస్ట్రీకి రావడం ఆనందంగా ఉందని శరత్ బాబు తెలిపారు. ఈ చిత్రం నిర్మాతకు ఆర్థికంగా, టెక్నీషియన్స్‌కు పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతుందన్నారు.
వినూత్న కథాంశంతో వస్తున్నాం..
‘దర్శకుడిగా నా మెదటి చిత్రాన్ని వినూత్నమైన కథతో, ఆసక్తికరమైన సన్నివేశాతో రూపొందించానని దర్శకుడు వివేకానంద విక్రాంత్ తెలిపారు. మంచి కథతో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు, అందులో దక్ష స్థానం సంపాదించుకుంటుందని అన్నారు. హీరో ఆయుష్ మాట్లాడుతూ ‘హీరో అవ్వాలనేది నా డ్రీమ్. ముంబైలో యాక్టింగ్ కోర్స్ చేశాను. మేమంతా చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. థ్రిల్లర్ కథాంశంతో హైదరాబాద్, అరకు, ఖమ్మం తదితర అదర్భుతమైన లొకేషన్స్‌లో షూటింగ్ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు అను, నక్షత్ర, క్లాసిక్ గ్రూప్ చైర్మెన్ తల్లాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు కథ,మాటలు శివ కాకు, సంగీతం రామ్ తవ్వ అందించగా కెమెరాకు శివ రాథోడ్, ఆర్.ఎస్ . శ్రీకాంత్ పని చేశారు.