రుధిర క్షేత్రం వద్ద నేతల నివాళి
చీరాల :
కారంచేడు అగ్రవర్ణాల దాడుల్లో ప్రాణాలు అర్పించిన వారి పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పలువురు దళిత సంఘాల నేతలు పేర్కొన్నారు. కారంచేడు మృతవీరుల 31వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక విజయనగర్ కాలనీలోని రుధిర క్షేత్రం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ కారంచేడు ఘటన తర్వాత దళితులంతా ఒక్కటై ఒక పెద్ద ఉద్యమం నడిపారని గుర్తు చేశారు. ఎన్నో పోరాటాలు జరిపి నిందితులకు శిక్షలు పడేలా చేశామన్నారు. బాధిత కుటుంబాలకు దళిత మహాసభ అండగా నిలిచి 430 మందికి ఇళ్లు, 70 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, 200 ఎకరాల సాగుభూమిని ఇప్పించామన్నారు. కారంచేడు కేసు సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లి నిందితులకు శిక్షపడేలా చేసిన తేళ్ల జడ్సన్‌ను అభినందించారు. కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు కోటి జేమ్స్, తేళ్ల జడ్సన్, డి.భాస్కరరావు, డి.సుందరరావు, డాక్టర్ ఎన్.చంద్రశేఖర్, పల్నాటి శ్రీరాములు, భగత్‌సింగ్, నీలం నాగేంద్రం, తేళ్ల వెంకటస్వామి, దుడ్డు వందనం, జాలాది మోహన్ పాల్గొన్నారు.