Damodaram Sanjivayya
-
చిరస్మరణీయుడు మన సంజీవయ్య
దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య (1921–1972). ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1960లో ఏకగ్రీవంగా ఎన్నుకోబడినప్పుడు ఆయన వయస్సు కేవలం 39 సంవత్సరాలు. రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పదేళ్లకే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఘనుడు. రెండుసార్లు కేంద్ర మంత్రిగా, రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం మొదలుకొని, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కేబినెట్లలో దాదాపు 20 ఏళ్లు వివిధ శాఖల్లోనూ ఆయన పనిచేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన డి. సంజీవయ్య ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలకు నాంది పలికారు. భూమిలేని నిరుపేదలకు 6 లక్షల ఎకరాల బంజరు భూముల పంపిణీ, వృద్ధాప్య పెన్షన్లు, దేశం లోనే మొదటిసారి బాలికలకు సాంకేతిక విద్య అందించే దిశగా హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల స్థాపన, చర్మకారుల సంక్షేమం దృష్ట్యా లిడ్‌క్యాప్ ఏర్పాటు, పారిశ్రామికాభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్, మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు వంటివి ఆయన దూరదృష్టికి నిదర్శనాలు. స్పెక్యులేషన్ మూలంగా హైదరాబాద్ చుట్టుపక్కల భూముల ధరలు పెరగకుండా అరికట్టడానికి ప్రభుత్వపరంగా రెండువేల ఎకరాల భూమిని క్రయం చేసి, కొత్త పరిశ్ర మల ఏర్పాటుకు సుగమం చేశారు. కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్స్ ఏర్పాటుతో యాజమాన్యాలు–ప్రభుత్వం ఎప్పటికప్పుడు తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించే దిశగా సంజీవయ్య చేసిన కృషి ఎనలేనిది. ఆ మోడల్ తర్వాతి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసే విధంగా దోహదపడటం విశేషం. ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించి సాంఘిక న్యాయానికి బాట వేశారు సంజీవయ్య. షెడ్యూల్డు కులాలు, జాతులు, వెనకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు పెంచుతూ (14 నుండి 17 శాతం షెడ్యూల్డు కులాలకు; 24 నుండి 38 శాతం వెనుకబడిన తరగతులకు) తీసుకున్న నిర్ణయం ఆ రోజుల్లో సంచలనాత్మకం. ఈయనకు బోనస్ సంజీవయ్యగా గుర్తింపు ఉండేది. అంతకుమునుపు ఏమాత్రం బోనస్ పొందని 45 లక్షల మంది కార్మికులకు బోనస్ అందేలా పార్లమెంట్ ద్వారా చట్టం తెచ్చిన సంజీవయ్య కార్మికవర్గాలకు గుర్తుండిపోతారు. వీరి పదవీ కాలంలోనే కార్మిక చట్టాలను జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి వర్తింపజేశారు. దిగుమతి చేయబడే ముడి సరుకులు గానీ, యంత్రభాగాలు గానీ అంతగా అవసరం లేని 29 పరిశ్రమలను గుర్తించి, లైసెన్స్ అవసరం లేకుండా చేశారు. డీ–లైసెన్సింగ్ ఉత్తర్వులను అప్పటి పార్లమెంట్ సభ్యులైన దివాన్ చమన్‌లాల్, అటల్ బిహారీ వాజ్‌పేయి మెచ్చుకున్నారు. చిన్న పరిశ్రమల మనుగడకై సంజీవయ్య అధ్యయనం చేసి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. రాజకీయాల్లో నెగ్గుతూ వచ్చిన సాహితీవేత్త సంజీవయ్య. పద్యాలు, గేయాలు, పాటలు, స్తుతులు, కొన్ని నాటకాలు రాసి వాటిల్లో నటించారు కూడా. అఖిల భారత తెలుగు రచయితల మహాసభల్ని 1960 మే 6న హైదరాబాద్‌లో నిర్వహించిన గౌరవం సంజీవయ్యకే దక్కుతుంది. ఆ సభలో ‘మానవాభ్యుదయానికి భాషే ప్రామాణికం’ అని ఉద్బోధిస్తూ, ‘జై సరస్వతి’ అని తన ప్రసంగం ముగించారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఒక సెంటు భూమి, సొంత కారు, బ్యాంకు బ్యాలెన్సు కూడా ఉంచుకోని నిరాడంబర జీవి ఆయన. ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు బేగంపేటలోని గ్రీన్‌ల్యాండ్స్ అతిథి గృహమే ఆయన అధికారిక నివాసం. అక్షర జ్ఞానం లేని సాదాసీదా ప్రజానీకం తనను కలవడానికి వస్తే, తన పీఏ చేత వారి కాగితాల్ని రాయించి, ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కృషి చేయడం ఆయనకు ఎంతో సంతృప్తి కలిగించేది. 1972 మే 8న ఆకస్మికంగా ఆయన ఢిల్లీలో కన్ను మూశారు. వేద మంత్ర పఠనంతో, వైదిక పద్ధతిలో పాటిగడ్డలోని నేటి సంజీవయ్య పార్కులో జరిగిన అంత్యక్రియలతో జీవనయాత్ర చాలించిన సంజీవయ్య మనందరి స్మృతి పథంలో ఎప్పుడూ మెదులుతుంటారు. డాక్టర్ శ్రీనివాసులు దాసరి వ్యాసకర్త విశ్రాంత ఐఏఎస్ -
రిక్షాలో అసెంబ్లీకి వెళ్లిన నేత
సాక్షి, కర్నూలు: భారతదేశ రాజకీయ చరిత్రలో ఆయనది చెరగని స్థానం. నీతి, నిజాయితీకి నిలువుటద్దం. పల్లె నుంచి ఢిల్లీకెదిగిన రాజకీయ మేధావి. ఎన్నో పదవులను అలంకరించడమే కాకుండా ఆ పదవులకు వన్నె తెచ్చిన మహా నాయకుడు దామోదరం సంజీవయ్య. ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం. కల్లూరు మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన మునయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించిన దామోదరం చిన్న తనంలోనే తండ్రి చనియారు. దీంతో అన్న చిన్నయ్య కష్టం మీదే 5వ తరగతి వరకు పెద్దపాడులో చదువుకున్నారు. అనంతరం కాలినడకనే నిత్యం కర్నూలుకు వచ్చి మున్సిపల్ హైస్కూల్లో 6వ తరగతి నుంచి ఎస్ఎస్ఎల్సీ వరకు చదివి, ఎస్ఎస్ఎల్సీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అనంతరం ఆర్ట్స్ (సీడెడ్) కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. దామోదరం సంజీవయ్య ఉపయోగించిన మంచం, ట్రంక్ పెట్టె ఉన్నత విద్యను అభ్యసించేందుకు తగిన ఆర్థిక స్థోమత లేని కారణంగా కర్నూలులోని పౌర సరఫరాల శాఖలో సివిల్ సప్లయ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేస్తూనే తనకు ఎంతో ఇష్టమైన ‘లా’ చదువును మద్రాసు నగరంలో పూర్తి చేశారు. అనంతరం మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నో కీలకమైన పదవులను చేపట్టినా.. ఎలాంటి అవినీతి అక్రమాలకు తావివ్వకుండా, నీతి, నిజాయితీలకు నిలువుట్టదంగా నిలిచారు. 1960 జనవరి 10వ తేదీన 39 సంవత్సరాల వయస్సులో రాష్ట్ర మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అయ్యారు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన రిక్షాలో అసెంబ్లీకి వెళ్లి నిజాయితీ చాటుకున్నారు. ఆయన మృతి చెందే వరకు ఆయనకున్న ఆస్తి.. దుస్తులు, భోజనం చేసేందుకు ఒక పళ్లెం, గ్లాసు తప్ప మరొకటి లేవు. 1972 మే 7వ తేదీన ఆకస్మికంగా మృతి చెందారు. ఆయనకు జానపద గేయాలు, నాటకాలంటే ఆయనకు ఎంతో ఇష్టం. ‘బోనస్’ సంజీవయ్యగా : 1964 జనవరి 22న పండిట్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహద్దూర్ శాస్త్రి మంత్రి వర్గాల్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1965 మే 29వ తేదీన పార్లమెంట్లో బోనస్ చట్టాన్ని ప్రవేశపెట్టి దేశ వ్యాప్తంగా ఉన్న కార్మికుల ప్రయోజనాలు సంరక్షించి ‘బోనస్ సంజీవయ్య’గా మన్ననలు అందుకున్నారు. అలాగే జెనీవా అంతర్జాతీయ కార్మిక సదస్సులో భారత ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించి ఈఎస్ఐ చట్టంలో ‘కుటుంబం’ అనే పదాన్ని చేర్చడమే కాకుండా, మహిళా కార్మికుల తల్లిదండ్రులను కూడా పరిధిలో చేర్పించిన గొప్ప వ్యక్తి. జ్ఞాపకార్థం ఇలా.. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించి దేశానికి ఎన్నో సేవలను అందించిన దామోదరం సంజీవయ్య జ్ఞాపకార్థం జిల్లాలో ఎన్నో చేపట్టారు. గాజులదిన్నె ప్రాజెక్టుకు సంజీవయ్య సాగర్‌గా నామకరణం చేశారు. పెద్దపాడు గ్రామంలో ఆయన పేరుతో బాలికల వసతి గృహాన్ని, పెద్దపాడులో ఆయన స్వగృమాన్ని తీర్చిదిద్ది, కమ్యూనిటీ హాల్‌తో పాటు పార్కును ఏర్పాటు చేశారు. ఆయన జ్ఞాపకాలు చిరస్థాయిలో నిలిచిపోయేలా లైబ్రెరీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని పెద్దపాడు గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికీ ఆయన ఉపయోగించిన, ఆస్తిగా మిగిలిన మంచం, దుస్తులు, ట్రంకు పెట్టె భద్రంగా ఉన్నాయి. సీఎంగా సేవలు 1960లో దళితులకు 6 లక్షల ఎకరాల బంజరు భూముల పట్టాలను అందించారు. జీఓ 559తో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించారు. దామోదరం హయాంలోనే రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్, చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్, మైనింగ్ కార్పొరేషన్, మౌలిక సదుపాయల సంస్థ, బీహెచ్ఈఎల్ ప్రారంభమయ్యాయి. తెలుగును అధికార భాషగా, ఉర్దూను రెండవ భాషగా ప్రోత్సహించడంతో పాటు వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని ఏర్పాటు చేశారు. 961లోనే నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య, మధ్యాహ్న భోజన పథకం, ఉపకార వేతనాలు ప్రవేశ పెట్టారు. మధ్య నిషేధాన్ని విభాగం, అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేశారు. గ్రేటర్ మున్సిపల్ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాటు దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ‘లా’ కమిషన్ ఏర్పాటు తెలంగాణలో భూమిని రీ సర్వే చేయించారు. జయంతి వేడుకలకు ఏర్పాట్లు మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను ఈ నెల 14వ తేదీన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఆ రోజు నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ ఇన్చార్జ్ సోషల్ వెల్ఫేర్ డీడీ శిరీషను ఆదేశించారు. సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఘనంగా సన్మానించడంతో పాటు మెమొంటోలను అందజేయనున్నారు. -
'బీజేపీది బీసీ ఓట్ల కోసం రాజకీయం'
హైదరాబాద్: బీసీలకు అన్యాయం చేసేందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కంకణం కట్టుకున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు (వీహెచ్) అన్నారు. ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఐఐఎం, ఐఐటీలల్లో బీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. 60 ఏళ్లు గడిచినా బీసీల రిజర్వేషన్స్ 27 శాతం దాటడం లేదన్నారు. బీజేపీది బీసీ ఓట్ల కోసం రాజకీయం తప్ప చిత్తశుద్ధి లేదన్నారు. బీసీ క్రిమిలేయర్ విషయం తేల్చకుండా.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ కల్పిస్తామని వెంకయ్య మాయ మాటలు చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కూడా బీసీ ఓట్ల కోసం అప్పుడే రాజకీయాలు మెదలుపెట్టాడని మండిపడ్డారు. కాంగ్రెస్ కూడా మేలుకోవాలని, బీసీలు పార్టీ నుంచి చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నేతలకు సూచించారు. బీసీలను సమీకరించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించాలన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నన్ని రోజులు బీసీ రిజర్వేషన్స్ పై న్యాయం జరగదని, రిజర్వేషన్స్ రద్దు చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ ఉద్దేశమన్నారు. ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్ తో బీజేపీ సర్కార్ నడుస్తోందన్నారు. దామోదరం సంజీవయ్య జయంతిని కేసీఆర్ సర్కార్ విస్మరించిందన్నారు. ఒక్క మంత్రి గానీ, అధికారి కానీ సంజీవయ్య జయంతికి రాకపోవడం దారుణమన్నారు. దళితుడైన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని విస్మరించడం.. రాష్ట్రంలోని దళితులను అవమానించడమేనన్నారు.