మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య
సాక్షి, కర్నూలు: భారతదేశ రాజకీయ చరిత్రలో ఆయనది చెరగని స్థానం. నీతి, నిజాయితీకి నిలువుటద్దం. పల్లె నుంచి ఢిల్లీకెదిగిన రాజకీయ మేధావి. ఎన్నో పదవులను అలంకరించడమే కాకుండా ఆ పదవులకు వన్నె తెచ్చిన మహా నాయకుడు దామోదరం సంజీవయ్య. ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం. కల్లూరు మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన మునయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించిన దామోదరం చిన్న తనంలోనే తండ్రి చనియారు. దీంతో అన్న చిన్నయ్య కష్టం మీదే 5వ తరగతి వరకు పెద్దపాడులో చదువుకున్నారు. అనంతరం కాలినడకనే నిత్యం కర్నూలుకు వచ్చి మున్సిపల్ హైస్కూల్‌లో 6వ తరగతి నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు చదివి, ఎస్‌ఎస్‌ఎల్‌సీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అనంతరం ఆర్ట్స్ (సీడెడ్) కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.
దామోదరం సంజీవయ్య ఉపయోగించిన మంచం, ట్రంక్ పెట్టె
ఉన్నత విద్యను అభ్యసించేందుకు తగిన ఆర్థిక స్థోమత లేని కారణంగా కర్నూలులోని పౌర సరఫరాల శాఖలో సివిల్ సప్లయ్ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం చేస్తూనే తనకు ఎంతో ఇష్టమైన ‘లా’ చదువును మద్రాసు నగరంలో పూర్తి చేశారు. అనంతరం మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నో కీలకమైన పదవులను చేపట్టినా.. ఎలాంటి అవినీతి అక్రమాలకు తావివ్వకుండా, నీతి, నిజాయితీలకు నిలువుట్టదంగా నిలిచారు.
1960 జనవరి 10వ తేదీన 39 సంవత్సరాల వయస్సులో రాష్ట్ర మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అయ్యారు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన రిక్షాలో అసెంబ్లీకి వెళ్లి నిజాయితీ చాటుకున్నారు. ఆయన మృతి చెందే వరకు ఆయనకున్న ఆస్తి.. దుస్తులు, భోజనం చేసేందుకు ఒక పళ్లెం, గ్లాసు తప్ప మరొకటి లేవు. 1972 మే 7వ తేదీన ఆకస్మికంగా మృతి చెందారు. ఆయనకు జానపద గేయాలు, నాటకాలంటే ఆయనకు ఎంతో ఇష్టం.
‘బోనస్’ సంజీవయ్యగా :
1964 జనవరి 22న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహద్దూర్ శాస్త్రి మంత్రి వర్గాల్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1965 మే 29వ తేదీన పార్లమెంట్‌లో బోనస్ చట్టాన్ని ప్రవేశపెట్టి దేశ వ్యాప్తంగా ఉన్న కార్మికుల ప్రయోజనాలు సంరక్షించి ‘బోనస్ సంజీవయ్య’గా మన్ననలు అందుకున్నారు. అలాగే జెనీవా అంతర్జాతీయ కార్మిక సదస్సులో భారత ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించి ఈఎస్‌ఐ చట్టంలో ‘కుటుంబం’ అనే పదాన్ని చేర్చడమే కాకుండా, మహిళా కార్మికుల తల్లిదండ్రులను కూడా పరిధిలో చేర్పించిన గొప్ప వ్యక్తి.
జ్ఞాపకార్థం ఇలా..
నిరుపేద దళిత కుటుంబంలో జన్మించి దేశానికి ఎన్నో సేవలను అందించిన దామోదరం సంజీవయ్య జ్ఞాపకార్థం జిల్లాలో ఎన్నో చేపట్టారు. గాజులదిన్నె ప్రాజెక్టుకు సంజీవయ్య సాగర్‌గా నామకరణం చేశారు. పెద్దపాడు గ్రామంలో ఆయన పేరుతో బాలికల వసతి గృహాన్ని, పెద్దపాడులో ఆయన స్వగృమాన్ని తీర్చిదిద్ది, కమ్యూనిటీ హాల్‌తో పాటు పార్కును ఏర్పాటు చేశారు. ఆయన జ్ఞాపకాలు చిరస్థాయిలో నిలిచిపోయేలా లైబ్రెరీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని పెద్దపాడు గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికీ ఆయన ఉపయోగించిన, ఆస్తిగా మిగిలిన మంచం, దుస్తులు, ట్రంకు పెట్టె భద్రంగా ఉన్నాయి.
సీఎంగా సేవలు
- 1960లో దళితులకు 6 లక్షల ఎకరాల బంజరు భూముల పట్టాలను అందించారు.
- జీఓ 559తో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించారు.
- దామోదరం హయాంలోనే రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్, చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్, మైనింగ్ కార్పొరేషన్, మౌలిక సదుపాయల సంస్థ, బీహెచ్‌ఈఎల్ ప్రారంభమయ్యాయి.
- తెలుగును అధికార భాషగా, ఉర్దూను రెండవ భాషగా ప్రోత్సహించడంతో పాటు వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని ఏర్పాటు చేశారు.
- 961లోనే నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య, మధ్యాహ్న భోజన పథకం, ఉపకార వేతనాలు ప్రవేశ పెట్టారు.
- మధ్య నిషేధాన్ని విభాగం, అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేశారు. గ్రేటర్ మున్సిపల్ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాటు
- దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ‘లా’ కమిషన్ ఏర్పాటు తెలంగాణలో భూమిని రీ సర్వే చేయించారు.
జయంతి వేడుకలకు ఏర్పాట్లు
మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను ఈ నెల 14వ తేదీన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఆ రోజు నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు సర్కిల్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ ఇన్‌చార్జ్ సోషల్ వెల్ఫేర్ డీడీ శిరీషను ఆదేశించారు. సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఘనంగా సన్మానించడంతో పాటు మెమొంటోలను అందజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment