ఆ నాణేలను పురాణాలు అనేవారు!
గ్రంథపు చెక్క
ఇతర దేశాల మాదిరిగానే ప్రాచీన భారతదేశంలో కూడా తొలి మారక ద్రవ్యంగా పశుధనం ఉండేది. కొంతకాలం పోయిన తరువాత లోహపు కడ్డీలు ఉండేవి. ప్రాచీన రచనల ప్రకారం, ఇరాన్‌కు చెందిన అహ్మనీద్ వంశ చక్రవర్తులు సింధునది లోయలో కొంత ప్రాంతాన్ని తమ సామ్రాజ్యంలో భాగం చేసుకున్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలు చక్రవర్తికి కప్పం కింద నిర్దిష్ట పరిణామంలో బంగారు రజను చెల్లించుకునేవారు. ఆ విధంగా బంగారు రజను డబ్బు పాత్ర పోషించేది. బహుశా ఆరోజుల్లో అక్కడ బంగారం చాలా ఎక్కువగా ఉండేదనుకుంటా!
ఆ కాలంలో భారతదేశంలో స్వంత వెండి అస్సలుండేది కాదు. ఇతర దేశాల నుంచి వెండిని భారతదేశానికి తీసుకువచ్చేవారు. అందుకే బంగారంతో పోల్చి చూస్తే వెండి ధర ఇతరదేశాల్లో కంటే భారతదేశంలో ఎక్కువగా ఉండేది. ప్రాచీన భారతదేశంలో బాగా వాడకంలో ఉన్న నాణాలను సంస్కృత భాషలో ‘పురాణాలు’ అనేవారు. ఇవి బెంగాల్ నుంచి కాబూలు దాకా బాగా విస్తృతంగా వ్యాపించి ఉండేవి. ఇవి గుండ్రంగానో, నలు చదరంగానో ఉన్న చిన్న వెండి కడ్డీలు. అరుదుగా రాగి కడ్డీలు ఉండేవి.
ఒక నాణెం మీద ఎన్నో చిత్రాలను ముద్రించేవారు. కడ్డీ ఒకవైపు ఏ చిత్రం లేకుండా నున్నగా ఉండేది. రెండో వైపున మానవ ఆకారాలు, చెట్లు, పక్షులు, ఆయుధాలు, మత సంబంధమైన చిహ్నాలు, సూర్యచంద్రుల చిహ్నాలు... ఇలా ఎన్నో ఉండేవి. ఈ నాణాలు... అంటే పురాణాలు ఎప్పుడు అవతరించాయో చెప్పడం కష్టం. ప్రాచీన కాలంలో ఉత్తర భారతదేశం బలీయమైన విదేశీ ప్రభావానికి గురయ్యింది. ఇది నాణాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
- గె.అ. ఫ్యోదొరవ్, దవీదొవ్ రష్యన్ రచనకు
డా.నిడమర్తి మల్లికార్జునరావు చేసిస తెలుగు అనువాదం ‘నాణాలు చెప్పిన కథ’ పుస్తకం నుంచి.