దద్దరిల్లిన కౌన్సిల్
సర్వేపై పేలిన మాటల తూటాలు
దర్గా భూములపై వెనక్కి తగ్గిన టీడీపీ
238 అంశాలపై చర్చ
ఒక్కరోజులోనే పూర్తయిన సమావేశం
మున్సిపల్ కమిషనర్ లేకుండానే కొనసాగిన కౌన్సిల్
విజయవాడ సెంట్రల్ : రెవెన్యూ సర్వే, దర్గా భూముల వ్యవహారంపై కౌన్సిల్లో పాలక, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. పురాతన భవనాలు, పింఛన్ల పంపిణీపై వాడీవేడిగా చర్చ సాగింది. యూసీడీ, టౌన్‌ప్లానింగ్ అధికారుల పనితీరు అధ్వానంగా ఉందంటూ అన్ని పార్టీల సభ్యులు మూకుమ్మడిగా మాటలదాడికి దిగారు. సర్వే పేరుతో ప్రజల నెత్తిన భారాలు వేస్తే సహించమంటూ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ, సీపీఎం సభ్యులు ధ్వజమెత్తారు. ‘తాము పన్నులు పెంచడం లేదని, మీరు కలలు కంటే నేనేం చేయలేను..’ అంటూ మేయర్ ఎదురుదాడికి దిగారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం సోమవారం మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన కౌన్సిల్హాల్లో జరిగింది. ఉదయం 10.35కు సభ ప్రారంభమైంది. ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావ్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాసరావు మృతికి సభ్యులు సంతాపం తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు సభను వాయిదా వేశారు. తిరిగి 4 గంటలకు ప్రారంభమైంది. మళ్లీ 6.20 గంటలకు వాయిదా వేశారు. తిరిగి 7 గంటలకు ప్రారంభమైంది. రాత్రి 8.15కు ముగిసింది. మొత్తం 238 అంశాలపై చర్చించారు. కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఈసారి మాత్రమే ఒక్కరోజులో సభ ముగిసింది. కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జి.వీరపాండ్యన్ శిక్షణ కోసం హైదరాబాద్ వెళ్లడంతో కౌన్సిల్‌కు హాజరుకాలేకపోయారు.
సర్వేపై రసవత్తర చర్చ
ఆస్తిపన్నులో తేడాలు, నీటి, డ్రెయినేజీ, ట్రేడ్ లెసైన్స్‌ల ఫీజుల వసూళ్ల క్రమబద్ధీకరణకు సంబంధించి కాంప్రహెన్సివ్ రెవెన్యూ సర్వే నిర్వహించాలని అంజెండాలో కమిషనర్ జి.వీరపాండ్యన్ చేసిన ప్రతిపాద నపై పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య రసవత్తర చర్చ సాగింది. ప్రజలపై పన్ను భారాలు మోపేందుకే సర్వే అస్త్రం ప్రయోగిస్తున్నారని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ సీపీ, సీపీఎం సభ్యులు చందన సరేష్, గాదె ఆదిలక్ష్మి, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు స్పష్టంచేశారు. వారు సవరణ తీర్మానం ఇచ్చారు. దీనిపై మేయర్ కోనేరు శ్రీధర్ తీవ్రంగా స్పందించారు. ‘పన్నులు పెంచుతున్నారని మీకు ఎవరు చెప్పారు. పన్నులు ఎగ్గొట్టేవాళ్లకు మీరు(ప్రతిపక్షాలు) కొమ్ము కాస్తున్నారు..’ అంటూ మేయర్ ఆరోపించారు. కమ్యూనిస్టుల పాలనలో 1995లో సర్వే చేసి పన్నులు పెంచలేదా.. అని ప్రశ్నించారు. ఆదాయం వస్తే నగరం ఎక్కడ బాగుపడుతోందోనని ప్రతిపక్షాలు బాధ పడుతున్నాయని విమర్శించారు. మూడు డివిజన్లలో సర్వే నిర్వహిస్తే రూ.74 లక్షల అదనపు ఆదాయం వచ్చిందని తెలిపారు. రూ.600 కోట్లు టార్గెట్ పెట్టి సర్వే చేస్తామంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని చందన సురేష్ అన్నారు. ఓటింగ్ నిర్వహించాలని మేయర్ అధికారులను ఆదేశించారు. డెప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఇచ్చిన సవరణ తీర్మానం సక్రమంగా లేదని, అందువల్ల ఓటింగ్ అవసరం లేదన్నారు. నగరంలో సమగ్ర సర్వే నిర్వహించే అధికారాన్ని కమిషనర్‌కు అప్పగిస్తూ అధికార పార్టీ తీర్మానం చేసింది.
దర్గా భూములపై వెనక్కి తగ్గిన పాలకపక్షం
దర్గా భూముల్లో గృహనిర్మాణాలకు అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదన విషయంలో పాలకపక్షం వెనక్కి తగ్గింది. వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల ఈ విషయమై అధికార పార్టీని గట్టిగా నిలదీశారు. ప్రభుత్వం వద్ద విచారణ పెండింగ్‌లో ఉండగా, గృహ నిర్మాణాలకు అనుమతులు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ సభ్యుడు ముప్పా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దర్గా భూముల్లో అనుమతులు నిలుపుదల చేసే అధికారం కౌన్సిల్‌కు లేదంటూ వింతవాదన వినిపించారు. అదే పార్టీ సభ్యుడు జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పొద్దంటూ కౌంటర్ వేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు అనుమతులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని మేయర్ ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. దర్గా భూముల వ్యవహరంలో ఆచితూచి వ్యవహరించాలని టీడీపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈక్రమంలోనే పాలకపక్షం వెనకడుగు వేసిందని సమాచారం.