ఐదంటే ఐదే..!
సాక్షి, హైదరాబాద్: అంతర్ధాన దశలో ఉన్న కృష్ణ జింకలకు ఆయువు పోసి వందల కొద్దీ జింకలకు గంతులు నేర్పిన అభయారణ్యమది. ప్రాణహిత నది ఒడ్డున చెంగు చెంగున ఎగురుతూ కనువిందు చేసే లేడి పిల్లలకు నెలవైన ప్రాంతమది. గుంపులు గుంపులుగా ఉండే జింకలకు ఆ అడవే మృత్యుపాశమైంది. అటవీ శాఖ నిర్లక్ష్యం కారణంగా వాటి ఉనికి వెతుక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న సొంత జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌లోని కోటపల్లి మండలం ప్రాణహిత నది ఒడ్డున ఉన్న వెంచపల్లి జింకల అభయారణ్యం వేటగాళ్లకు అడ్డాగా మారింది. 1980లో మందలకు మందలుగా ఉన్న కృష్ణ జింకలు ఇప్పుడు పదిలోపే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. త్వరలో అటవీ జంతువుల గణన మొదలవనున్న నేపథ్యంలో వాటి సంఖ్యను ఎలా చూపించాలో తెలియక అటవీ అధికారులు తలపట్టుకున్నారు.
1999లో కృష్ణ జింకల అరణ్యంగా..
మంచిర్యాల జిల్లా కోటపల్లి రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతమే ఈ ప్రాణహిత జింకల అభయారణ్యం. కోటపల్లి, పారుపల్లి, జనగామ, సుపాక, అర్జనగుట్ట, కిన్నారం గ్రామాల పరిధిలోని ప్రాణహిత నది ఒడ్డున ఈ వెంచపల్లి అరణ్యం విస్తరించి ఉంది. 1980లో వైల్డ్ లైఫ్ అభయారణ్యంగా ఉన్న ఈ ప్రాంతంలో కృష్ణ జింకలు ఎక్కువగా ఉండటంతో 1999లో కృష్ణ జింకల అభయారణ్యంగా ప్రకటించారు. కానీ సమీప ప్రాంతంలోనే పంటపొలాలు ఉండటం, జింకలు తరచూ అక్కడికి వస్తుండటంతో వేటగాళ్లు మాటు వేసి హతమార్చుతూ వచ్చారు. వెంచపల్లి ప్రాంతానికెళ్తే కచ్చితంగా జింకలు ఉంటాయని ప్రచారం జరగటంతో వేటగాళ్లకు అడ్డా అయిపోయింది.
అసలున్నాయో లేవో..
ఉచ్చులు, విద్యుత్ తీగలతో గ్రామీణ ప్రాంత వేటగాళ్లు.. జీపులు, ఆధునిక ఆయుధాలతో పట్టణ ప్రాంత హంటర్లు పచ్చిక బయళ్లపై విరుచుకుపడటంతో కృష్ణజింకల ఆన వాళ్లు లేకుండా పోయాయి. అటవీ అధికారులు అడవిని వదిలి పట్టణాల్లో ఉండటం, అక్కడి నుంచి విధులు నిర్వ ర్తించటంతోనే జంతువులకు రక్షణ కరువైందని స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖ 2007 లెక్కల ప్రకారం ఇక్కడ 40 కృష్ట జింకలు ఉన్నట్లు తేలింది. 2015లో కిన్నారం గ్రామంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తాకి పెద్ద పులి చనిపోవడంతో నిద్ర లేచిన ఫారెస్టు అధికారులు ఆ ఏడాది మరోసారి గణన చేయగా.. ఐదు కృష్ట జింకలే లెక్కకు దొరికాయి. తర్వాత రెండేళ్లలో చేసిన గణనలో కృష్ణ జింకల లెక్కలు అధికారులు బయటపెట్టలేదు.
100కు పైగా ఉన్నాయి
వెంచపల్లి అభయారణ్యంలో 100కు పైగా కృష్ట జింకలు ఉన్నాయి. ఈ నెలలో కృష్ణ జింకల గణన చేస్తాం. అడవిలో తరచూ పెట్రోలింగ్ చేస్తున్నాం. ప్రాణహిత మార్గంలో రోడ్డు వెంట ప్రమాద సూచికలు ఏర్పాటు చేశాం.
– రవి, ఫారెస్టు రేంజర్