నేడు ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవం
ఆత్మస్థైర్యానికి అడ్డేదీ !
వారి మనోధైర్యం అందరికీ ఆదర్శం.. చిన్న చిన్న కారణాలతో చింతించే మనుషులకు వారి జీవన ప్రయాణమే ఓ పాఠం. కుంగుబాటుకు లొంగిపోక ధైర్యంగా ఎదుర్కొని నిలిచిన వారి పోరాట పటిమ అమోఘం. రంగం ఏదైనా రాణించేస్తామనే వారి ధీమా మేరునగం. ఎవరెస్టు అయినా ఎక్కేస్తామనే వారి ఉత్సాహానికి సరిహద్దు అంబరం. పదుగురిలో మేం ‘ప్రత్యేక ప్రతిభావంతుల’మంటూ చాటి చెబుతున్న వారి ఆత్మస్థైర్యం నిత్య స్ఫూర్తిదాయకం.
శరీరానికే వైకల్యం..
తన వైకల్యం శరీరానికే తప్ప మనస్సుకు కాదని నిరూపించాడు బాలరాజు. పులిచెర్ల మండలం పాళెం పంచాయతీ తుడుంవారిపల్లెకు చెందిన బాలరాజు(45) చిన్న వయస్సులోనే ఎడమకాలు కోల్పోయాడు. నిరాశ చెందకుండా కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. పొలం పనులు సొంతంగా చేసుకుంటున్నాడు. ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది 102 రోజుల పని సైతం పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఘన సన్మానమూ అందుకున్నాడు. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయాలకు వైకల్యం అడ్డు రాదంటున్నాడు బాలరాజు. -కల్లూరు