మంత్రికి పనిలో 30 శాతం వాటా
ఖలీల్‌వాడి : మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసే ప్రతి పనిలో 30 శాతం వాటా తీసుకుంటున్నారని డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్‌ఆండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి హైదరాబాద్‌లో నిర్మించిన సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్తూపంలో మంత్రికి వాటాలు ఉన్నాయన్నారు. 2 నెలల క్రితం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తాను చేసిన అవినీతిని నిరూపించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరాడని నిజానికి మంత్రి సహజ వనరులు దోచుకున్నాడని మానాల ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో ఇసుక, మైనింగ్, మొరంను ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని,మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా తక్కవ కాదన్నారు. బట్టాపూర్ మైనింగ్ పేరుతో రూ. వందల కోట్లు అవినీతికి పాల్పడ్డారన్నారు. ప్రశాంత్ రెడ్డి స వాలును స్వీకరిస్తూనే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా మీకు ఒక సవాల్ విసిరుతున్నానని మానాల పేర్కొన్నారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్లలో మొదటి నాలుగేళ్లు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా మీరు చేసిన అవినీతి రాష్ట్ర ప్రజలకు తెలుసునని మానాల అన్నారు. ఇప్పుడు రోడ్లు భవనల శాఖ మంత్రిగా చేసిన పనులలో అవినీతి జరిగిందన్నారు. మంత్రిగా ఉండి జిల్లాను అభివృద్ధి చేయాల్సింది పోయి నియోజకవర్గానికి పరిమితమైనారని విమర్శించారు. అవసరం లేని చోట రోడ్లు నిర్మించి ప్రతి దాంట్లో కమిషన్ తీసుకున్నాడని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ బట్టాపూర్లో ఉన్న క్వారీ మంత్రి ప్రశాంత్ రెడ్డి బీనామీదని ఆరోపించిందని, ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి దానిని తన బంధువులదని ఒప్పుకున్నాడని అన్నారు. క్వారీలో వనరులను దోచుకున్నావని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే పొంత న లేకుండా మంత్రి సమాధానం చెప్పడం సరైనది కాదన్నారు. మంత్రి క్వారీ విలువ రూ.10 కోట్లు ఉంటుందని, దీనికి 10 ఎకరాల భూమి ఉంటుందని, క్వారీని రూ.10 కోట్లకే ప్రతిపక్షాలకు ఇస్తానని పొంతన లేని మాటలు చెప్పడం సరైనది కాదన్నారు.
2014లో ప్రశాంత్ రెడ్డి చూపించిన ఆస్తుల విలువ ఎంత? 2023లో ఆస్తుల విలువ ఎంతో స్పష్టం చేస్తే మంత్రి అవినీతి బండారం బయట పడుతుందన్నారు. మంత్రి తమ్ముడు గంజాయి స్మగ్లర్ అని పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆరోపించిన తర్వాత నియోజకవర్గంలో ఎందుకు కేసులు నమోదు అ య్యాయన్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి అవినీతిపై చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమన్నారు. చెక్‌డ్యామ్‌లో వాటాతోనే ఇటీవల వర్షాలతో వేల్పూర్ మండలంలో కట్టలు తెగిపోయినట్లు కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఆన్వేష్‌రెడ్డి ఆరోపించారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు తాహెర్ బిన్ హందాన్, సంతోష్, శ్రీని వాస్, గంగారెడ్డి, వినయ్, విక్కీ యాదవ్, రత్నాకర్, కార్పొరేటర్ రోహిత్, ప్రమోద్, సాగర్, ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్ పాల్గొన్నారు.