పుష్కర పనుల్లో అవినీతి
కర్నూలు(ఓల్డ్‌సిటీ): పుష్కర పనుల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య ఆరోపించారు. సోమవారం స్థానిక కళావెంకట్రావ్ భవనంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 12వ తేదీన కష్ణా పుష్కరాలు జరుగుతాయని తెలిసి కూడా హడావిడిగా పనులు ప్రారంభించారని, నామినేట్ పద్ధతిన నిధులు విడుదల కోసమే ఇలా చేశారన్నారు. జిల్లాకు రూ.250 కోట్లు తెచ్చినట్లు ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి చెబుతున్నారని, వాటిలో ఎంత ఖర్చు చేశారో వెల్లడిస్తే అవినీతి నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కర్నూలులో ఈద్గా పనులు కూడా పండుగకు రెండు రోజుల ముందు మొదలు పెట్టడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్ల గోదావరి పుష్కరాల్లో అపశ్రుతి జరిగిందని, కష్ణా పుష్కరాల్లో ఎక్కడ ఏ నష్టం జరిగినా సీఎం చంద్రబాబు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పుష్కర పనులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, పీసీసీ అధ్యక్షుడు సర్దార్ బుచ్చిబాబుతో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.