DCCB officers
-
అధికారికి బెదిరింపు కాల్.. సమర్థించుకున్న ఎమ్మెల్యే
సాక్షి, నల్గొండ : నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తన అధికార జులుం ప్రదర్శించారు. డీసీసీబీ ఉన్నతాధికారిపై బెదిరింపులకు పాల్పడిన ఆడియో టేపు ఒకటి వైరల్ అవుతోంది. సస్పెండ్ అయిన మహిళా ఆఫీసర్‌ను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆయన ఫోన్లో బ్యాంకు సీఈవో మోహన్‌రావును బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనతోపాటు డీసీసీబీ చైర్మన్‌పై కూడా వీరేశం అసభ్యపదజాలం వాడారు. ముందుగా నార్కెట్‌పల్లి ఎంపీపీ ఫోన్‌ను సీఈవో అయిన మోహన్‌రావుకు కలిపి వీరేశంకు అందించారు. ఇక అక్కడ నుంచి వీరేశం తన వాగ్దాటిని ప్రదర్శించారు. చైర్మన్ సోమవారం వస్తారని చెబుతున్నా వినకుండా ఎమ్మెల్యే అధికారిని తిట్టడం అందులో గమనించవచ్చు. చైర్మన్ అందులో సంతకం పెట్టాలని అధికారి చెబుతున్న క్రమంలో.. ఇలాంటి విషయంలో సీఈవోదే తుది అధికారం అని జీవోలో స్పష్టంగా పేర్కొని ఉందంటూ ఎమ్మెల్యే వాదనకు దిగారు. వికలాండివనే సహిస్తున్నానని.. డ్రామాలు ఆడుతున్నావా అంటూ ఎమ్మెల్యే ఆ అధికారిపై మండిపడ్డారు. ఫైల్ నంబర్చెప్పాలంటూ అధికారిని బెదిరించటం... అధికారి ఛైర్మన్ ప్రస్తావన తేవటంతో ఆ సంగతి తనకు చెప్పొద్దని ‘నీ అయ్య జాగీరా’... అంటూ పరుష పదజాలం, ఆపై అసభ్య పదాలతో ఎమ్మెల్యే దూషించారు. చైర్మన్‌ని వెధవ అని సంభోదిస్తూ మధ్యలో సంపత్ రెడ్డి అనే వ్యక్తి ప్రస్తావన తీసుకొచ్చి దుర్భషలాడారు. ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తున్నావన్న విషయం గుర్తుంచుకోవాలని.. కావాలంటే లంచం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నానంటూ ఎమ్మెల్యే చెప్పటం అందులో ఉంది. సోమవారం మల్లికార్జున్ అనే వ్యక్తిని పంపిస్తానని.. ఖచ్ఛితంగా పని జరగకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని ఎమ్మెల్యే హెచ్చరించారు కాగా, పందొమ్మిది కోట్ల ప్రజాధనం కొల్లగొట్టి సస్పెండ్ అయిన మహిళా ఉద్యోగిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ వీరేశం బెదిరించినట్లు బాధిత వ్యక్తి మోహన్‌రావు చెప్తున్నారు. పని చేయనుందుకే బెదిరించా : ఎమ్మెల్యే కాగా, ఈ ఫోన్ కాల్ దుమారం పై ఎమ్మెల్యే వీరేశం స్పందించారు. డీసీసీబీ అధికారిపై తాను చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్ధించుకున్నారు. ‘‘నేను సీఈఓ ను బెదిరించలేదు. పనిచేయనందుకే ప్రశ్నించాను. ప్రజలతోనే ఉంటూ, అవినీతికి, అక్రమాలకు దూరంగా ఉంటాను కాబట్టే నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తాను నియోజకవర్గ అధికారులతో స్నేహపూర్వకంగానే ఉంటానని ఎమ్మెల్యే వీరేశం స్పష్టం చేశారు. మళ్లీ చిక్కుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే -
చెముడులో బినామీ బాగోతంపై విచారణ
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలపై వస్తున్న ఆరోపణల విషయంలో అటు డీసీసీబీ అధికారులు, ఇటు జిల్లా సహకార శాఖ అధికారులు తక్షణమే స్పందిస్తున్నారు. ఇటీవల పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని రావివలస సొసైటీపై ప్రాథమిక విచారణతో పాటు 51స్టాట్యూటరీ విచారణకు ఆదేశించారు. తాజాగా ‘సాక్షి’ దిన పత్రికలో ‘చెముడులో మరో బినా మీ బాగోతం!’ శీర్షికన ప్రచురితమైన వార్తపై సంబంధిత అధికారులు స్పందించారు. సుమా రు రూ. 2 కోట్లు వరకు పక్కదారి పట్టిందని, ఇప్పటికే అక్కడ ఎంపీటీసీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ కథనాన్ని ఆధారంగా చేసుకుని తమ వైపుగా డీసీసీబీ సీఈఓ శివశంకర ప్రసాద్ ప్రాథమిక విచారణకు ఆదేశించగా, శాఖా పరంగా మరో జిల్లా సహకార అధికారి వెంకటరావు ప్రాథమిక విచారణకు ఆదేశించారు. డీసీసీబీ తరఫున సాలూరు బ్రాంచ్ ఏజీఏం సీహెచ్ ఉమామహేశ్వరావు విచారణ చేపట్టనుండగా, జిల్లా సహకార శాఖ తరఫున పార్వతీపురం డివిజనల్ రిజిస్టార్ చిన్నయ్య నేతృత్వంలో విచారణ చేయనున్నారు. వీరిచ్చే ప్రాథమిక నివేదికల ఆధారంగా స్టాట్యూటరీ విచారణ చేపట్టేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. -
విచారణ వేగవంతం
నల్లగొండ అగ్రికల్చర్, న్యూస్‌లైన్: దేవరకొండ సహకార బ్యాంకు అక్రమాల కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. అయితే ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సీబీసీఐడీ చేత విచారణ జరిపిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని బ్యాంకు బోర్డు సమావేశంలో డెరైక్టర్లు ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసిందే. కేసు విచారణను వేగవంతం చేయడానికి బ్యాంక్ డీజీఎం నర్మదకు బాధ్యతలు అప్పగించారు. బ్రాంచిలో సుమారు రూ.18 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని వచ్చిన అరోపణల నేపథ్యంలో డీసీసీబీ అధికారులు ప్రాథమిక విచారణ జరిపించారు. అరోపణలు వచ్చిన చిత్రియాల, తిమ్మాపూర్, దేవరకొండ, పీఏపల్లి సహకార సంఘాలలోని రికార్డులను స్వాధీనం చేసుకుని భద్రపరిచిన విషయం తెలిసిందే. అయితే దేవరకొండ బ్యాంకులో రూ.3.5 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసును సవాల్‌గా తీసుకున్న దేవరకొండ పోలీసులు క్షేత్రస్థాయిలో విచారణను చేపట్టి ఇప్పటికే నలుగురు వ్యక్తులను అరెస్టు కూడా చేశారు. నాలుగు సంఘాలలో 6వేల మంది సభ్యులు.. దేవరకొండ బ్రాంచ్‌లోని నాలుగు సహకార సంఘాలలో సుమారు 6వేల మంది సభ్యులు ఉన్నారు. వారి పేరు మీద అప్పు ఎంత ఉంది, వారికి ముట్టింది ఎంత, దళారుల చేతికి వెళ్లింది ఎంత అనే కోణంలో పోలీసులు సభ్యులను ఒక్కొక్కరిగా విచారించి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలువురు బినామీల పేరున రుణాలను పొందిన దళారులు తాము తీసుకున్న రుణాలను నయాపైసాతో సహ చెల్లిస్తామని సొసైటీల చుట్టూ తిరుగుతున్నట్టు సమాచారం. ఆ నాలుగు సొసైటీలలో సుమారు 2 వేలకు పైగా నకిలీ పాస్ పుస్తకాలను పెట్టి రుణాలను పొందినట్టు తెలుస్తోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దేవరకొండ పోలీసులు లోతైన విచారణ జరుపుతున్న నేపథ్యంలో కేసును సీబీసీఐడీకి అప్పగిస్తారా లేదా అనేది అనుమానాలకు తావిస్తోంది. సీబీసీఐడీకి అప్పగిస్తే... కేసును సీబీసీఐడీకి అప్పగిస్తే పోలీసుల వద్ద ఉన్న బ్యాంకు రికార్డులన్నింటినీ వారికి అప్పగించాల్సి ఉంటుంది. అదే సమయంలో పోలీసులు కూడా ఇప్పటి వరకు చేసిన విచారణను నిలిపివేసి కేసును మూసివేసే అవకాశం ఉంది. అయితే సీబీసీఐడీ బృందం క్షేత్రస్థాయి నుంచి విచారణ మొదలుపెట్టాల్సి ఉంటుంది. నాలుగు సొసైటీలలో రుణాలను పొందిన వారందరినీ విచారించి ఆధారాలను సేకరించాల్సి ఉండడంతో కేసు కొలిక్కి రావడానికి మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రూ.4 కోట్లకు మించి అక్రమాలకు తావులేదు.. దేవరకొండ సహకార బ్యాంకులో సుమారు రూ.4కోట్ల కుమించి అక్రమాలు జరిగే అవకాశం ఉండదని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. రామయ్య బ్యాంకు మేనేజర్‌గా వెళ్లకముందే బ్యాంకులో సుమారు రూ.9 కోట్లకు పైగా రుణాల బకాయిలు పేరుకుపోయాయని అంటున్నారు. రామయ్య మేనేజర్‌గా వెళ్లిన తరువాత 2009 నుంచి 2013 వరకు రూ.9 కోట్లు మా త్రమే దేవరకొండ బ్రాంచికి ఇచ్చినట్లు తెలుస్తోంది. బకాయి రుణాలను రీషెడ్యూల్ చేయ డం పరిపాటిగా ఉంటుందని, అక్రమాలు జరి గేతే రూ.9 కోట్ల రుణాల మంజూరులో జరిగే అవకాశం మాత్రమే ఉంటుందని పేరు చెప్పడానికి ఇష్టపడని బ్యాంకు అధికారి ఒకరు పేర్కొన్నారు. విచారణ పూర్తయితే రూ.4 కోట్లకు మించి అక్రమాలకు తావుండకపోవచ్చని తెలిపారు.