నల్లగొండ అగ్రికల్చర్, న్యూస్‌లైన్: దేవరకొండ సహకార బ్యాంకు అక్రమాల కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. అయితే ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సీబీసీఐడీ చేత విచారణ జరిపిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని బ్యాంకు బోర్డు సమావేశంలో డెరైక్టర్లు ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసిందే. కేసు విచారణను వేగవంతం చేయడానికి బ్యాంక్ డీజీఎం నర్మదకు బాధ్యతలు అప్పగించారు. బ్రాంచిలో సుమారు రూ.18 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని వచ్చిన అరోపణల నేపథ్యంలో డీసీసీబీ అధికారులు ప్రాథమిక విచారణ జరిపించారు.
అరోపణలు వచ్చిన చిత్రియాల, తిమ్మాపూర్, దేవరకొండ, పీఏపల్లి సహకార సంఘాలలోని రికార్డులను స్వాధీనం చేసుకుని భద్రపరిచిన విషయం తెలిసిందే. అయితే దేవరకొండ బ్యాంకులో రూ.3.5 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసును సవాల్‌గా తీసుకున్న దేవరకొండ పోలీసులు క్షేత్రస్థాయిలో విచారణను చేపట్టి ఇప్పటికే నలుగురు వ్యక్తులను అరెస్టు కూడా చేశారు.
నాలుగు సంఘాలలో 6వేల మంది సభ్యులు..
దేవరకొండ బ్రాంచ్‌లోని నాలుగు సహకార సంఘాలలో సుమారు 6వేల మంది సభ్యులు ఉన్నారు.
వారి పేరు మీద అప్పు ఎంత ఉంది, వారికి ముట్టింది ఎంత, దళారుల చేతికి వెళ్లింది ఎంత అనే కోణంలో పోలీసులు సభ్యులను ఒక్కొక్కరిగా విచారించి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు.
ఇప్పటికే పలువురు బినామీల పేరున రుణాలను పొందిన దళారులు తాము తీసుకున్న రుణాలను నయాపైసాతో సహ చెల్లిస్తామని సొసైటీల చుట్టూ తిరుగుతున్నట్టు సమాచారం.
ఆ నాలుగు సొసైటీలలో సుమారు 2 వేలకు పైగా నకిలీ పాస్ పుస్తకాలను పెట్టి రుణాలను పొందినట్టు తెలుస్తోంది.
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దేవరకొండ పోలీసులు లోతైన విచారణ జరుపుతున్న నేపథ్యంలో కేసును సీబీసీఐడీకి అప్పగిస్తారా లేదా అనేది అనుమానాలకు తావిస్తోంది.
సీబీసీఐడీకి అప్పగిస్తే...
కేసును సీబీసీఐడీకి అప్పగిస్తే పోలీసుల వద్ద ఉన్న బ్యాంకు రికార్డులన్నింటినీ వారికి అప్పగించాల్సి ఉంటుంది. అదే సమయంలో పోలీసులు కూడా ఇప్పటి వరకు చేసిన విచారణను నిలిపివేసి కేసును మూసివేసే అవకాశం ఉంది. అయితే సీబీసీఐడీ బృందం క్షేత్రస్థాయి నుంచి విచారణ మొదలుపెట్టాల్సి ఉంటుంది. నాలుగు సొసైటీలలో రుణాలను పొందిన వారందరినీ విచారించి ఆధారాలను సేకరించాల్సి ఉండడంతో కేసు కొలిక్కి రావడానికి మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
రూ.4 కోట్లకు మించి అక్రమాలకు తావులేదు..
దేవరకొండ సహకార బ్యాంకులో సుమారు రూ.4కోట్ల కుమించి అక్రమాలు జరిగే అవకాశం ఉండదని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. రామయ్య బ్యాంకు మేనేజర్‌గా వెళ్లకముందే బ్యాంకులో సుమారు రూ.9 కోట్లకు పైగా రుణాల బకాయిలు పేరుకుపోయాయని అంటున్నారు. రామయ్య మేనేజర్‌గా వెళ్లిన తరువాత 2009 నుంచి 2013 వరకు రూ.9 కోట్లు మా త్రమే దేవరకొండ బ్రాంచికి ఇచ్చినట్లు తెలుస్తోంది. బకాయి రుణాలను రీషెడ్యూల్ చేయ డం పరిపాటిగా ఉంటుందని, అక్రమాలు జరి గేతే రూ.9 కోట్ల రుణాల మంజూరులో జరిగే అవకాశం మాత్రమే ఉంటుందని పేరు చెప్పడానికి ఇష్టపడని బ్యాంకు అధికారి ఒకరు పేర్కొన్నారు. విచారణ పూర్తయితే రూ.4 కోట్లకు మించి అక్రమాలకు తావుండకపోవచ్చని తెలిపారు.
విచారణ వేగవంతం
Published Thu, Jan 30 2014 4:00 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement