death of woman
-
టీడీపీ నేత తోట కంచెకు విద్యుత్ సరఫరా.. షాక్‌తో మహిళ మృతి
వి.కోట(చిత్తూరు జిల్లా): టీడీపీ నాయకుడికి చెందిన మామిడి తోటకు వేసిన కంచెకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై ఓ మహిళ మృతిచెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం కేపీ బండ గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం... వి.కోట మండలంలోని యాలకల్లు గ్రామ పంచాయతీ కేపీ బండ గ్రామంలో అహ్మద్ జాన్ తన భార్య ఆసిఫా (35), ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నారు. వారి ఇంటి బాత్రూమ్కు అత్యంత సమీపంలో టీడీపీ నాయకుడు, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు చక్రపాణి నాయుడుకు చెందిన మామిడి తోట ఉంది.దానికి చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటుచేశారు. తోటలోని విద్యుత్ మోటర్‌కు సంబంధించిన స్టార్టర్‌ను ఆ ఇనుప కంచెకు అమర్చారు. వైర్లను పక్కనున్న స్తంభానికి చుట్టారు. ఈ క్రమంలో ఆసిఫా స్నానం చేసి బయటకు వస్తూ మామిడి తోట ఇనుప కంచెను తగిలారు. ఆ కంచెకు కరెంటు సరఫరా కావడంతో ఆమె షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. స్టార్టర్కు సంబంధించిన వైర్లు తెగి ఇనుప కంచెపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. తోట యజమానిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
ఏనుగు దాడిలో మహిళ మృతి
క్రిష్ణగిరి: ఏనుగు దాడిలో జీనూరుకు చెందిన సరస్వతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటన సూళగిరి వద్ద చోటు చేసుకొంది. వడ్డేనూరు అటవీ ప్రాంతంలో మకాం వేసిన ఏనుగుల మంద గురువారం తెల్లవారుజామున జాతీయ రహదారి మేలుమలై వద్ద క్రాస్ చేసి సూళగిరి సమీపంలోని జీనూరు వద్దకు చేరుకున్నాయి. ఆ సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు పొలం వద్దకు వచ్చిన సరస్వతి (45)పై మందలోని ఓ ఏనుగు దాడి చేసి తొండంతో బలంగా విసిరేసి ఘీంకారం చేసింది. ఏదో జరిగిందని స్థానికులు వెళ్లి చూడగా అప్పటికే సరస్వతి తీవ్ర గాయాలతో సృ్పహ తప్పింది. ఆమెను క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త రాజేంద్రన్, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అటవీశాఖ అధికార్లు సంఘటనా స్థలానికెళ్లి పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది. వేపనపల్లి వైపు బయల్దేరిన ఏనుగుల మంద జీనూరు వద్ద మహిళపై దాడి జరిగిన తర్వాత ఏనుగుల మంద వేపనపల్లి వైపు తరలిపోయాయని, మందలో ఐదు పెద్ద ఏనుగులు, రెండు గున్న ఏనుగులు ఉన్నట్లు స్థానికులు చూశారని అటవీశాఖ అధికారులు తెలిపారు.