Death of Debbie Wolfe: డెబ్బీ వూల్ఫ్
‘రేయ్ కెవిన్! కొంచెం కారు వేగంగా పోనీరా ప్లీజ్?’ వణుకుతున్న స్వరంతో చెప్పాడు జాన్. అదే మాట కారు ఎక్కినప్పటి నుంచి చెబుతూనే ఉన్నాడు. వెనుకే కూర్చున్న జెన్నీ.. ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ, ‘జాన్! కంగారుపడొద్దు. కెవిన్ ఇప్పటికే స్పీడ్‌గా వెళ్తున్నాడు. తనని తొందరపెట్టకు’ అంది సముదాయింపుగా. వెంటనే కెవిన్ కారు నడుపుతూనే పక్కనే కూర్చున్న జాన్ చేతిని భరోసాగా పట్టుకుని, ‘రేయ్ జాన్! మన డెబ్బీకేం కాదురా, నువ్వు భయపడకు. దగ్గరకి వచ్చేశాం. ఇంకో పది నిమిషాలంతే!’ అన్నాడు ధైర్యాన్నిస్తూ. కారు ఆపగానే, ముందు నుంచి జాన్, వెనుక నుంచి జెన్నీ వేగంగా కారు దిగి, ‘డెబ్బీ.. డెబ్బీ!’ అని అరుస్తూ, తెరిచి ఉన్న తలుపులను క్షణం పాటు చూసి లోపలికి పరుగు తీశారు. కారు శబ్దానికి కుక్కలన్నీ గుమిగూడి అరవడం మొదలుపెట్టాయి. వచ్చిన వాళ్లను గుర్తుపట్టి కాస్త శాంతించాయి. అప్పుడు సరిగ్గా సాయంత్రం 4 కావస్తోంది. కారు పార్క్ చేసిన కెవిన్‌కి వాకి ట్లో ఖాళీ మందు బాటిల్స్ చెల్లాచెదురుగా పడి ఉండటం వింతగా అనిపించింది. ఎందుకంటే డెబ్బీ తన ఇంటి పరిసరాలను ఎప్పుడూ నీట్‌గా ఉంచుకుంటుంది.ఇంట్లో ఎక్కడా డెబ్బీ కనిపించలేదు. కిచెన్‌లో ఆమె యూనిఫామ్ పడుంది. మంచం కిందకు పర్స్ విసిరేసినట్లుంది. కుక్కలకు ఆహారం అందక నకనకలాడుతున్నాయి. ఆమె కారు పార్కింగ్ ప్లేస్‌లో కాకుండా, వేరే చోట ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా డెబ్బీ ల్యాండ్‌ఫోన్ ఆన్సరింగ్ మెషిన్కొచ్చిన ఓ వాయిస్ మెసేజ్లోని మగ గొంతు.. ఆ ముగ్గురినీ బాగా భయపెట్టేసింది. ‘డెబ్బీ నీకేమైంది? చాలారోజుల నుంచి ఎందుకు నువ్వు డ్యూటీకి రావడం లేదు?’ అనేది దాని సారాంశం. నిజానికి ఆ ముగ్గురూ అక్కడికి వచ్చే గంట ముందే డెబ్బీ కోసం ఆమె పనిచేసే ఆసుపత్రికి వెళ్లారు. ‘నిన్న 4 గంటలకు డ్యూటీలోంచి వెళ్లిన డెబ్బీ, ఈరోజు డ్యూటీకి రాలేదు. ఫోన్‌కి స్పందించలేదు’ అని అక్కడివారు చెప్పడంతోనే వారు కంగారుగా డెబ్బీ ఇంటికి వచ్చారు. అంటే ఆ వాయిస్‌లో ఏదో కుట్ర దాగుందని వారికి అర్థమైంది. సుమారు 35 గంటలుగా డెబ్బీ నుంచి ఆ కుటుంబానికి ఎలాంటి అప్డేట్స్ లేవు. వెంటనే పోలీసులను ఆశ్రయిస్తే సరిగ్గా స్పందించలేదు. వేరే దారిలేక మర్నాడు డెబ్బీ ఇంటి ముందు చెరువుని తమ శక్తి మేరకు తనిఖీ చే శారు. సమీపంలో నివసించేవారిని ఆరా తీశారు. ఎక్కడా ఏ సమాచారం దొరకడం లేదు. ఇంటి ముందు చెరువు, చుట్టూ విశాలమైన స్థలంతో చక్కటి వాతావరణం మ«ధ్యనున్న ఆ ఇల్లంటే డెబ్బీకి చాలా ఇష్టం. కోరుకున్నట్లే ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటూ చాలా రకాల కుక్కల్ని పెంచుకునేది. ఆవే ఆమెను సెక్యూరిటీగా కాపాడేవి. ‘ఫాయెట్విల్లే వెటరన్స్ అడ్మినిస్ట్రేషన్ హాస్పిటల్’లో నర్స్‌గా పనిచేస్తున్న డెబ్బీ వూల్ఫ్‌కి 28 ఏళ్లు. చాలా అందగత్తె. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేది. కన్నవారంటే ప్రాణం. ఏ పని చేసినా వారికి చెప్పకుండా చేసేదే కాదు. రోజూ ఉదయం, సాయంత్రం వారికి ఫోన్ చేసేది. జాన్, జన్నీలే కాదు ఫ్యామిలీ ఫ్రెండ్ కెవిన్ అంటే కూడా ఆమెకు చాలా ఇష్టం. డెబ్బీ మిస్ అయిన ఐదు రోజులకు పోలీసులు.. విచారణ మొదలుపెట్టారు. అయినా జెన్నీ, జాన్, కెవిన్ మాత్రం డెబ్బీ కోసం తమ ప్రయత్నాలు ఆపలేదు. డెబ్బీ కనిపించకుండా పోయిన ఆరో రోజున కెవిన్, గోర్డాన్ అనే మరో వ్యక్తితో కలసి డెబ్బీ ఇంటి చుట్టూ క్లూ కోసం క్షుణంగా వెతుకుతున్నాడు. ఇంటికి కాస్త దూరంలో బురద నేలపై రెండుజతల పాదముద్రలు చెరువు వైపు నడిచినట్లుగా కనిపించాయి. వాటిని అనుసరించి చెరువు లోపలికి చూస్తే, పెద్ద గ్రిల్ పీపాలో మృతదేహం ఉన్నట్లు కనిపించింది. వెంటనే సమాచారం పోలీసులకు చేరింది. కాసేపటికి వారు చెరువులో అదే స్పాట్ నుంచి డెబ్బీ మృతదేహాన్ని బయటికి తీయించారు. అయితే పీపాలాంటిదేమీ చెరువులో దొరకలేదని, డెబ్బీ ఒంటి మీదున్న జాకెట్ నీటిలో తేలడాన్ని చూసి కెవిన్ వాళ్లు పొరబడి ఉంటారని పోలీసులు చెప్పారు. చెరువు నీళ్లు అపరిశుభ్రంగా ఉండగా, పోస్ట్ మార్టమ్‌లో డెబ్బీ మృతికి మంచి నీళ్లు కారణమని తేలింది. అయినా పోలీసులు.. ‘కుక్కలతో ఆడుకుంటూ డెబ్బీ ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయింది’ అని కేసు మూసేశారు. అయితే డెబ్బీ ఇంటి సమీపంలో ఉండే ఒక ఇంట్లోని పీపా మిస్ అయ్యిందని జెన్నీ తన విచారణలో గుర్తించింది. పీపా చాలాకాలం అక్కడే ఉన్న ఆనవాలును ఆమె కళ్లారా చూసిందట. అంటే కెవిన్, గోర్డాన్లు ఆ రోజు చెరువులో పీపా చూడటం నిజమేనని జెన్నీకి నమ్మకం కలిగింది.కేసు కొట్టేసిన కొన్ని నెలలకు డెబ్బీ మృతదేహంపై లభించిన దుస్తులు, వస్తువులు పేరెంట్స్‌కి అందాయి. అయితే ఆ దుస్తులు డెబ్బీ సైజ్ కంటే చాలా పెద్దవని, అవి అసలు డెబ్బీ దుస్తులే కావని పేరెంట్స్ మళ్లీ కోర్టుకెక్కారు. పైగా మృతదేహానికి వేసిన షూస్ మగవారికి చెందినవని న్యాయపోరాటం మొదలుపెట్టారు. దాంతో ఈసారి అధికారులు.. డెబ్బీ పనిచేసే ఆసుపత్రిలో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. నిజానికి ఆ ఇద్దరూ డెబ్బీ ప్రేమ కోసం తపించినవారే, ఆమె వెంటపడినవారే, ఆమెని వేధించినవారే! ఆమె ఇల్లు ఎక్కడో తెలుసున్నవారే! వారిలో ఒకడు డెబ్బీ ఫోన్ నంబర్ కనిపెట్టి మరీ కాల్స్ చేసి ఇబ్బంది పెట్టేవాడట! పైగా అతడు డెబ్బీ సహోద్యోగి కావడంతో డెబ్బీ ఫోన్‌కి ఫేక్ వాయిస్ మెసేజ్ పంపించింది అతడేనని నమ్మి, ఆ దిశగా కూడా విచారించారు. కానీ ఏ క్లూ దొరకలేదు.నార్త్ కరోలినా, ఫాయెట్విల్లేకి 7 మైళ్ల దూరంలో ఒంటరిగా నివసించే డెబ్బీ 1985 డిసెంబరు 26 సాయంత్రం 4 గంటలకు ఆసుపత్రి డ్యూటీ నుంచి వెళ్లి ఇక తిరిగి రాలేదు. సరిగ్గా ఆరు రోజులకు తన ఇంటి ముందున్న చెరువులో శవమై తేలింది. ఈ కేసును నేటికీ పరిష్కరించలేదు. న్యాయపోరాటం చేసిన జాన్, జెన్నీ, కెవిన్ అనారోగ్య సమస్యలతో ఒకరి తర్వాత ఒకరు కన్నుమూశారు. డెబ్బీని ఇంటికి వచ్చి ఎత్తుకెళ్లారా? ఇంటి ముందు ఖాళీ మందు సీసాలు ఎవరు వేశారు? ఆమె మిస్ అయినరోజే ఫేక్ వాయిస్ మెసేజ్ ఎవరు పంపారు? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లేవు. దాంతో ఈ ఉదంతం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.∙సంహిత నిమ్మన