రైతుల వినతులను 3 నెలల్లో పరిష్కరించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులు తమ కష్టాలు, సమస్యలపై సమర్పించే వినతి పత్రాలను 3 నెలల్లో పరిష్కరించాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్‌కు తెలిపింది. రైతు సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన రైతు రుణ విమోచన కమిషన్ ఇచ్చే ఆదేశాలను అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి రైతుల సమస్యలు తెలుసుకోవచ్చునని, పరిష్కారానికి తగిన ఆదేశాలూ జారీ చేయవచ్చునంది. జిల్లా కేంద్రాల్లో రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏర్పాటు చేయవచ్చునని, దీనికి అవసరమైన సహాయ సహకారాల్ని అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతులు ఎన్ని వినతిపత్రాలు ఇచ్చారు.. అందులో ఎన్ని పరిష్కరించారు.. తదితర విషయాలపై 3 నెలలకోసారి కమిషన్ తన నివేదికను రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శికి సమర్పించాలని తెలిపింది.
వాటిని పరిశీలించి అవసరాన్ని బట్టి తాము తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. తమ సమస్యలను కమిషన్ దృష్టికి తీసు కెళ్లేందుకు క్షేత్రస్థాయిలో రైతులకు న్యాయసేవాధికార సంస్థ, పారా లీగల్ వలంటీర్లు తగిన సహాయ సహకారాలు అందించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రైతు ఆత్మహత్యల నివారణకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పి.శ్రీహరిరావు, సామాజిక కార్యకర్త డి.నర్సింహారెడ్డి, మరికొందరు పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
కమిషన్‌కు సదుపాయాలు కల్పించాం
ఈ వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ వాదనలు వినిపించారు. రైతుల కోసం రుణ విమోచన కమిషన్‌ను ఏర్పాటు చేశామని, కమిషన్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించామని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం ఓ కొత్త పథకం ప్రకటించనుందని వెల్లడించారు. రైతుబంధు కింద సాయాన్ని మరింత పెంచాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.