రుణ విముక్తి కమిషన్ ను ఏర్పాటు చేయాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణ విముక్తి కమిషన్‌ను వెంటనే ఏర్పాటుచేయాలని, కరువు సహా యక చర్యల్లో భాగంగా యుద్ధప్రాతిపదికన రైతులకు విత్తనాలు, ఎరువులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీఎంకు లేఖ రాశారు. ఈ కమిషన్ ఏర్పాటుకు అసెంబ్లీలో బిల్లు ఆమోదించి 2 నెలలు గడచినా అది కార్యరూపం దాల్చలేదని అన్నారు. రెండేళ్లుగా కరువు పరిస్థితులు నెలకొనడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. ఖరీఫ్‌కు సన్నాహాలు జరుగుతున్నందున రైతులకు పాత అప్పులను మాఫీ చేసి రుణభారం తగ్గించాలన్నారు. కాగా, తెలంగాణ, ఏపీ న్యాయవాదుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతున్నా కేంద్రం ప్రేక్షకపాత్ర వహించడాన్ని ఆయన ఖండించారు.