రెండేళ్ల చదువు ఒకేసారి
దూబచర్ల (నల్లజర్ల రూరల్) :వారంతా డీఎడ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు. వారికి ఆ తరగతులు ప్రారంభమై మూడు నెలలవుతోంది. ఇంకా ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించలేదు. కొత్తగా ప్రథమ సంవత్సరం విద్యార్థులు వచ్చి కళాశాలలో చేరారు. ద్వితీయ సంవత్సరం తరగతులు చదువుతున్నా ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయకపోవడంతో తాము ద్వితీయ సంవత్సర విద్యార్థులమా? కాదా? అన్న సందేహం వారిలో వ్యక్తం అవుతోంది. ఇది దూబచర్లలో డైట్ కళాశాల ద్వితీయ సంవత్సర విద్యార్థుల ఆందోళన.. జిల్లాలో దూబచర్ల డైట్‌తో పాటు 30 ప్రైవేటు కళాశాలలున్నాయి. వీటిలో దాదాపు రెండువేల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నారు.
వీరందరికీ అక్టోబరు 6న మొదటి సంవత్సరం సిలబస్ పూర్తయింది. అప్పుడే పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఎట్టకేలకు డిసెంబర్ 29 నుంచి పరీక్షలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఏకారణంగానో వాయిదా వేసింది. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకారం పూర్తయితే త్వరలో నిర్వహించే డీఎస్సీకి అర్హత సాధించే వారమంటున్నారు. విద్యా సంవత్సరంలో తీవ్ర కాలయాపన జరగడంతో డీఎస్సీకి అర్హత కోల్పోయామంటున్నారు. ఇది మా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. మొదటి సంవత్సర సిలబస్ గుర్తుంచుకుంటూ రెండవ సంవత్సరం చదవటం ఇబ్బందికరంగా ఉందంటున్నారు.
రెండు సిలబస్‌లు చదవాల్సి వస్తోంది
ఏ విద్యార్థి అయినా ఏ సంవత్సరం సిలబస్ ఆ సంవత్సరం చదువుతారు. కాని మేం రెండు సిలబస్‌లను చదవాల్సి వస్తోంది. రెండేళ్ల సిలబస్‌ను గుర్తుంచుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది.
- కె.కనక మహలక్ష్మీ. డీ.ఎడ్.విద్యార్థిని, దూబచర్ల డైట్.
టీఎల్ ఎం చేయాలంటే కుదరడం లేదు
టీపీకి వెళ్లాలంటే ముందుగా మేం విద్యార్థులకు బోధించేందుకు వీలుగా కృత్యాధార బోధనోపకరణాలు తయారు చేసుకుంటాం. దీన్ని కొన్నిరోజులు పాటు సిలబస్ షెడ్యూల్‌కు అనుగుణంగా తయారు చేసుకోవాలి. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఆలస్యం కావడంతో వాటితో పాటు ద్వితీయ సంవత్సరం సిలబస్ చదువుకునేందుకే సమయం సరిపోతోంది. దీంతో టి.ఎల్.ఎం. తయారు చేయలేదు. ఇది టీపీపై ప్రభావం చూపుతుంది. - కోరాడ తిరుపతి. డీఎడ్ విద్యార్థి. దూబచర్ల డైట్.