భారత మాజీ క్రికెటర్ దీపక్ కన్నుమూత
అహ్మదాబాద్:తన ఆరంగేట్రం టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన భారత మాజీ క్రికెటర్ దీపక్ శోధన్(87) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారజామున అహ్మదాబాద్‌లోని తన స్వగ్రహంలో తుదిశ్వాస విడిచారు. భారత పాతతరం టెస్టు క్రికెటర్‌గా గుర్తింపు పొందిన దీపక్.. 1952లో పాకిస్తాన్‌తో ఈడెన్ గార్డెన్ లో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఆరంగేట్రం చేశారు. స్వతహాగా ఎడమచేతి వాటం బౌలర్ అయిన దీపక్.. తొలి టెస్టు మ్యాచ్‌లోనే బ్యాట్‌తో మెరిశాడు.
భారత్ 179 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దశలో క్రీజ్‌లోకి వచ్చిన శోధన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన దీపక్ 15 ఫోర్లు సాయంతో 110 పరుగులు చేశాడు. తద్వారా మొదటి టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి భారతీయ క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. అయితే టెస్టు కెరీర్ ఎంతోకాలం సాగలేదు. 1953లో వెస్టిండీస్‌పై చివరి టెస్టు మ్యాచ్ ఆడిన దీపక్ కేవలం మూడు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. దేశవాళీలో బరోడా, గుజరాత్ జట్లకు ప్రాతినిథ్యం వహించిన ఆయన 43 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడారు.