ఆ 'ఇద్దరి' లైసెన్స్‌లు రద్దు చేయండి...
న్యూఢిల్లీ: నిర్భయ డాక్యుమెంటరీ 'ఇండియాస్ డాటర్' లో మహిళల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డిఫెన్స్ లాయర్లపై సోషల్ మీడియాలో న్యాయనిపుణులు, మహిళా సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు విరుచుకుపడుతున్నారు. మహిళలను కుక్కలతో పోలుస్తూ నీచమైన వ్యాఖ్యలు చేసిన ఎంఎల్ శర్మ, ఏకె సింగ్‌ల లైసెన్స్ రద్దు చేయాలని, వాళ్లను కఠినంగా శిక్షించాలంటూ వందలాది కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. భారత్‌లో మహిళలకు స్థానంలేదు అన్నశర్మ మాటలపై మహిళలు రగిలిపోతున్నారు. ఆ న్యాయవాదులపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోదు అని నిర్భయ తల్లి ప్రశ్నించారు.
'సమాజంలో ఇలాంటి వాళ్లకు చోటులేదు.. వాళ్లను అసలు ఉపేక్షించకూడదు.. ఇలాంటి మనస్తత్వం వున్న మనుషులు న్యాయవాదులుగా ఉండడం నేరం. బార్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకోవాలంటూ' సుప్రీంకోర్ట్ సీనియర్ లాయర్ తులసి వ్యాఖ్యానించారు.
మహిళలను అవమారపరుస్తున్న ఇద్దరు న్యాయవాదుల వ్యాఖ్యలను సుమెటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని ఇక తాత్సారం చేయొద్దని మాజీ అడిషనల్ సొలిసిటర్ జనరల్ రామచంద్రన్ బార్ కౌన్సిల్‌ని కోరారు.
అయితే ఈ వివాదంపై బార్ కౌన్సిల్ ఛైర్మన్ స్పందిస్తూ వ్యక్తిగతంగా ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నప్పటికీ, కచ్చితమైన ఫిర్యాదు లేకుండా ఏమీ చేయలేమన్నారు. ఇది ఇలా ఉంటే ఫిలిం మేకర్ లెస్లీ ఉద్విన్ తమ మాటలను వక్రీకరించారంటూ ఎం ఎల్ శర్మ, ఎకె సింగ్ ఆరోపిస్తున్నారు.