Delhi acid attack
-
Delhi Acid Attack: జాగ్రత్త... ప్రమాదం పొంచే ఉంది
యాసిడ్ అమ్మకాల మీద నిఘా పెట్టాం. మహిళల రక్షణకు చట్టాలు కఠినతరం చేశాం. షీ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. యాప్స్ డెవలప్ అయ్యాయి. నిజమే. కాని ప్రమాదం పొంచే ఉంది. ఢిల్లీలో తాజా యాసిడ్ దాడి ఘటన ఈ విషయమే నిర్థరిస్తోంది. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి) నివేదిక ప్రకారం 2021లో దేశవ్యాప్తంగా 176 యాసిడ్ దాడులు నమోదయ్యాయి. మరో 73 అటెంప్ట్స్ జరిగాయి. అంటే ప్రమాదం పొంచే ఉంది. నిర్లక్ష్యం ఏ మాత్రం పనికి రాదు. వాస్తవాలు ఆందోళన కలిగిస్తున్నప్పుడు ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మంచిది. 2013లో సుప్రీం కోర్టు యాసిడ్ అమ్మకాల మీద జవాబుదారీ ఉండాలని చెప్పింది. రిజిస్టర్ మెయింటెయిన్ చేయాలని చెప్పింది. అంతే కాదు ఐ.డి.ప్రూఫ్ లేకుండా యాసిడ్ అమ్మకూడదు. అలా చేస్తే 50 వేల రూపాయల ఫైన్ ఉంది. అయితే 2016లో ఢిల్లీలో కొంతమంది పోలీసులు మఫ్టీలో యాసిడ్ కొన ప్రయత్నిస్తే 23 షాపులు ఎవరు ఏమిటి అనకుండా అమ్మారు. అప్పుడు గగ్గోలు అయ్యింది. తాజాగా ఢిల్లీలో జరిగిన యాసిడ్ దాడిలో నిందితుడు ఫ్లిప్‌కార్ట్ ద్వారా యాసిడ్‌ను కొన్నాడని పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఆన్లైన్ అమ్మకం దారులను యాసిడ్ అమ్మకాలపై జాగ్రత్త వహించవలసిందిగా తాకీదులు పంపుతున్నారు. అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే. పరిస్థితి దారుణం కోవిడ్ కాలంలో తప్ప దేశంలో యాసిడ్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీలు బలవుతూనే ఉన్నారు. ప్రేమ వద్దన్నారని, ప్రేమలో ఉన్నాక బ్రేకప్ చెప్పారని, పెళ్లయ్యాక విడిపోయారని రకరకాల కారణాల వల్ల పురుషులు ద్వేషంతో యాసిడ్ దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. 2016 నుంచి 2021 మధ్య 1300 యాసిడ్ దాడులు జరిగాయి. విషాదం ఏమిటంటే ఈ యాసిడ్ దాడుల్లో నేరస్తులకు శిక్ష పడుతున్న శాతం అతి తక్కువగా ఉండటం. 400 కేసులు నమోదు అయితే 10 మందికి మాత్రమే శిక్ష పడుతోందంటే ఎన్ని విధాలుగా తప్పించుకుంటున్నారో, తప్పించుకోవచ్చులే అనే ధైర్యంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అప్రమత్తత అవసరం విద్యార్థినులు, యువతులు, స్త్రీలు తమకు తారసపడుతున్న ప్రేమ, వైవాహిక బంధాలలో పురుషుల ధోరణి పట్ల అప్రమత్తంగా ఉండాలి. బెదిరిస్తున్నవారిని, వద్దనుకున్నా వెంటపడుతున్నవారిని, ఒకవేళ బంధం నుంచి బయటపడాలనుకుంటే ఆ మగవారిని గమనించి వారి ధోరణి ప్రమాదకరంగా అనిపిస్తే ముందే కుటుంబ సభ్యుల, పోలీసుల మద్దతు తీసుకోవాలి. ముఖ్యంగా ఇష్టం లేని ప్రేమ ప్రతిపాదిస్తున్నప్పుడు, ప్రేమలో నుంచి బ్రేకప్ చెబుతున్నప్పుడు, విడాకుల సందర్భాలలో ఒంటరిగా తిరిగేటప్పుడు అప్రమత్తంగా ఉండటం, ఎవరైనా అపరిచితుడు లేదా పాత మిత్రుడు దగ్గరిగా వస్తుంటే జాగ్రత్త పడటం, అసలు వీలైనంత సామరస్యంగా, ఒప్పుదలతో బంధాల నుంచి బయటపడటం... ఇవన్నీ ముఖ్యమైనవే. దేశంలో యాసిడ్ దాడులను నిర్మూలించామని ఎవరూ హామీ ఇవ్వడం లేదు. కనుక మన రక్షణకు మనమే బాధ్యత వహించాలి. కుటుంబం, పోలీసుల వద్ద సమస్యను దాచకుండా సాయం పొందాలి. (క్లిక్ చేయండి: వరతమ్మా నీకు వందనాలమ్మా!) -
స్కూల్ విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటన.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు నోటీసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్కూల్ విద్యార్థినిపై బుధవారం జరిగిన యాసిడ్ దాడి ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్లి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థినిపై యాసిడ్ చల్లారు. అయితే ఈ ఘటనతో ప్రమాదకరమైన యాసిడ్ అందరికీ ఎంత సులభంగా దొరుకుతుందో మరోసారి బహిర్గతమైంది. యాసిడ్ విక్రయాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించినప్పటికీ అది మార్కెట్లో లభిస్తోంది. ఇప్పుడు ఢిల్లీ విద్యార్థినిపై దాడి చేసిన నిందితులు యాసిడ్‌ను ఆన్లైన్లో కొనుగోలు చేశారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టి ఇంటికి తెప్పించుకున్నారు. దీంతో ఇంత సులభంగా యాసిడ్ ఎలా దొరుకుతుందని ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ సంస్థలు దీనిపై ఇంకా స్పందించాల్సి ఉంది. ఢిల్లీ విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు 12 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. బైక్‌పై వచ్చి దాడి చేసిన సచిన్ అరోరా, హర్షిత్ అగర్వాల్‌తో పాటు వీరికి సాయం చేసిన వీరేందర్ సింగ్‌ను అరెస్టు చేశారు. మహిళలపై యాసిడ్ దాడులు పెరిగిన కారణంగా 2013లో వీటి విక్రయాలపై నిషేధం విధించింది సుప్రీంకోర్టు. లైసెన్స్ ఉన్న షాపు ఓనర్లే యాసిడ్‌ను విక్రయించాలని, వాటిని కోనుగోలు చేసే వారి వివరాలు సేకరించాలని నిబంధనలు తీసుకొచ్చింది. కానీ ఇప్పటికీ మార్కెట్లో కూరగాయలు కొన్నంత ఈజీగా యాసిడ్‌ను కొనుగోలు చేస్తున్నారు. చదవండి: బైకర్ మెడకు చుట్టుకున్న తాడు.. అమాంతం గాల్లో ఎగిరి.. -
ఢిల్లీలో దారుణం.. 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. తన చెల్లెలితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ఓ 17 ఏళ్ల బాలికపై ఇద్దరు దుండగులు యాసిడ్ దాడి చేశారు. ముసుగులు ధరించి బైక్‌పై వచ్చి యాసిడ్ దాడి చేయటంతో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మొహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు తనకు తెలిసిన వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేయడంతో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బుధవారం ఉదయం 9 గంటలకు పోలీస్ కంట్రోల్ రూమ్(పీసీఆర్)కు యాసిడ్ దాడి జరిగినట్లు ఫిర్యాదు అందినట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో దాడి జరిగినట్లు చెప్పారు. ఘటన జరిగిన సమయంలో తన చెల్లెలితో బాధితురాలు ఉందన్నారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ శ్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ ఘటనపై మీడియాతో వివరాలు వెల్లడించారు బాధితురాలి తండ్రి. ‘మా కుమార్తెలు (ఒకరు 17, ఒకరు 13 ఏళ్ల వయసు) ఇద్దరు ఉదయం బయటకు వెళ్లారు. ఒక్కసారిగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి మా పెద్ద కూతురిపై యాసిడ్ దాడి చేసి పారిపోయారు. వారు ముఖాలకు మాస్కులు ధరించారు.’ అని తెలిపారు. Swati Maliwal (@SwatiJaiHind), chairperson, Delhi Commission for Women on acid attack on 17-year-old Delhi schoolgirl today pic.twitter.com/g2ge62RAez — NDTV (@ndtv) December 14, 2022 ఇదీ చదవండి: మియాపూర్ ప్రేమోన్మాది దాడి కేసు: యువతి తల్లి మృతి -
ప్రేమించలేదనే అక్కసుతో డాక్టర్ దురాగతం
ఢిల్లీ బ్యూరో: తనను ప్రేమించలేదని తోటి డాక్టర్ యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దానిని చైన్‌స్నాచింగ్‌గా చిత్రీకరించేందుకు యత్నించారు. కానీ మొబైల్ ఆధారంగా అసలు విషయం బయటపడింది. నిందితులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఇందులో ఒకరు మైనర్ కావడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలు మహిళా డాక్టరు అమృత్ కౌర్ బెలారుస్‌లో ఎంబీబీఎస్ చదువుతుండగా ఆమెతోపాటు అశోక్‌యాదవ్ చదువుతున్నాడు. ఈ సమయంలోనే అతను కౌర్‌పై ప్రేమను పెంచుకున్నాడు. కౌర్ అతనిని ప్రేమించలేదు. ఇదిలాఉండగా కౌర్ వివాహం వేరే అతనితో కుదిరింది. ఈ నేపథ్యంలో యాదవ్ అతని స్నేహితుడి సహాయంతో కౌర్‌పై దాడికి వ్యూహం పన్నాడు. మంగళవారం ఉదయం కౌర్ హరినగర్‌లోని తన ఇంటి నుంచి స్కూటీపై ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్తుండగా రాజోరీగార్డెన్‌లో ఫోన్ కాల్ రావడంతో స్కూటీని రోడ్డు పక్కగా ఆపి మాట్లాడుతోంది. మోటారుసైకిల్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి బైక్‌పై ముందున్న వ్యక్తి బ్యాగ్ లాక్కోవడానికి చూడగా ఆమె ప్రతిఘటించింది. వెనకాల ఉన్న వ్యక్తి ఆమెపై యాసిడ్‌తో దాడికి పాల్పడ్డాడు. దీంతో కౌర్ ముఖం కుడివైపు భాగం దెబ్బతింది. ఆమె కుడి కన్ను పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనను బ్యాగ్ స్నాచింగ్ ఘటనగా చూపడానికి ప్రయత్నించిన్పటికీ పోలీసులు అనుమానంతో దర్యాప్తు చేశారు. 12 పోలీసు బృందాలు నిందితుల కోసం గాలింపు జరిపాయి. కౌర్ చేతి నుంచి లాక్కొన్న బ్యాగు పశ్చిమ ఢిల్లీలోని ఖయాలా ప్రాంతంలో, మొబైల్ ఫోన్ యమునా విహార్ ప్రాంతంలో పోలీసులకు దొరికాయి. మహిళపై దాడి చేసిన తరువాత నిందితులు బ్యాగ్‌లో నుంచి మొబైల్ ఫోన్ తీసుకొని దానిని స్విచాఫ్ చేసి బ్యాగును పారవేశారని,ట్రాన్స్ యమునా ప్రాంతంలో మళ్లీ మొబైల్ ఆన్ చేశారని పోలీసులు పేర్కొంటున్నారు. మొబైల్ ఫోన్ ఆధారంగానే పోలీసులు నిందితులను గుర్తించారు. పశ్చిమ ఢిల్లీలోని మాదీపుర్ ప్రాంతంలో నిందితులను అరెస్టు చేశారు. ఇదిలాఉండగా దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నగరంలో మహిళా డాక్టర్‌పై జరిగిన యాసిడ్ దాడి కేసులో నిందితులైన డాక్టర్, అతడి స్నేహితుడిని అరెస్టు చేసి, ఇద్దరు బాలురను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.