Delhi Lieutenant Governor Najeeb Jung
-
'నాపై కేసు పెడతానని బెదిరించారు'
న్యూఢిల్లీ: తనపై కేసు పెడతానని ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ బెదిరించారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ఆరోపించారు. నర్సరీ స్కూల్ కు కేటాయించిన స్థలాన్ని బీజేపీ కార్యాలయానికి కేటాయించిన విషయాన్ని లేవనెత్తడంతో తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తానని జంగ్ హెచ్చరించారని వెల్లడించారు. శుక్రవారం జరిగిన ఢిల్లీ డెవలప్ మెంట్ ఆథారిటీ సమావేశంలో భారతి పాల్గొన్నారు. 'స్కూల్స్, ఆస్పత్రులకు స్థలం కేటాయించాలని ఢిల్లీ ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు వచ్చాయి. దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. కానీ రాజకీయ కారణాలతో బీజేపీకి స్థలం కేటాయించారు. ఈ భూమిని గతంలో నర్సరీ పాఠశాలకు ఇచ్చార'ని భారతి గుర్తు చేశారు. తాను ఈ అంశాన్ని లేవనెత్తడంతో తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తానని జంగ్ బెదిరించారని సోమనాథ్ తెలిపారు. అయితే ఈ ఆరోపణలను లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తోసిపుచ్చింది. -
'అంతొద్దు.. అన్ని ఫైల్స్ పంపించు'
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాలను గుర్తించాలని, నియమనిబంధలు పాటించాలని ఆయన సూచించారు. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఫైల్స్ అన్ని కూడా తన కార్యాలయానికి వచ్చి వెళ్లాల్సిందేనని ఆదేశించారు. ఇవి తన ఆదేశాలు కావని భారత రాజ్యాంగం ప్రకారం, జీఎన్సీటీడీ(ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ) 1991 యాక్ట్, వ్యాపార లావాదేవీల నియమ నిబంధనల ప్రకారంఅలా చేయాల్సిందేనని అన్నారు. కొత్తగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ పరిపాలనకు చెందిన ఫైల్స్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి పంపించాల్సిన అవసరం లేదని అన్ని శాఖలకు చెప్పిన నేపథ్యంలో నజీబ్ జంగ్.. తాజాగా అందరు మంత్రులకు, అధికారులకు ఆ ఆదేశాలు జారీ చేశారు. మంత్రిమండలి తీసుకునే నిర్ణయాలు, ఆమోదం తెలిపేచట్టాలు తనకు తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. నజీబ్ జంగ్ బీజేపీ ఏజెంట్ అని గతంలో కేజ్రీవాల్ ఆయనను తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే.