'నాపై కేసు పెడతానని బెదిరించారు'
న్యూఢిల్లీ: తనపై కేసు పెడతానని ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ బెదిరించారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ఆరోపించారు. నర్సరీ స్కూల్ కు కేటాయించిన స్థలాన్ని బీజేపీ కార్యాలయానికి కేటాయించిన విషయాన్ని లేవనెత్తడంతో తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తానని జంగ్ హెచ్చరించారని వెల్లడించారు. శుక్రవారం జరిగిన ఢిల్లీ డెవలప్ మెంట్ ఆథారిటీ సమావేశంలో భారతి పాల్గొన్నారు.
'స్కూల్స్, ఆస్పత్రులకు స్థలం కేటాయించాలని ఢిల్లీ ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు వచ్చాయి. దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. కానీ రాజకీయ కారణాలతో బీజేపీకి స్థలం కేటాయించారు. ఈ భూమిని గతంలో నర్సరీ పాఠశాలకు ఇచ్చార'ని భారతి గుర్తు చేశారు. తాను ఈ అంశాన్ని లేవనెత్తడంతో తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తానని జంగ్ బెదిరించారని సోమనాథ్ తెలిపారు. అయితే ఈ ఆరోపణలను లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తోసిపుచ్చింది.