సాక్షి, హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇటీవల పంజాబ్‌లోనూ పాగా వేసి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. గోవా, తదితర రాష్ట్రాల్లో ఖాతా తెరిచిన ఆప్ ఇప్పుడు తెలంగాణలో ఆరంగేట్రం చేసేందుకు తహతహ లాడుతోంది. పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జి సోమనాథ్ భారతి ఇప్పటికే వారంలో రెండురోజులు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మాజీ ప్రభుత్వ ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నేతలతో తరుచూ సమావేశమవుతూ పార్టీ విస్తరణకు ప్రయత్నిస్తున్నారు.
చార్మినార్ నుంచి పాదయాత్ర..
కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న ఆప్ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ నెల 14న హైదరాబాద్‌కు రానున్నట్టు తెలిసింది. తమ పార్టీ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తోందని పంజాబ్ ఎన్నికల్లో ఆప్ పదే పదే చెప్పింది. తాజాగా అంబేడ్కర్ జయంతి పురస్కరించు కుని 14న నగరంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ పాదయాత్రను కేజ్రీవాల్ జెండా ఊపి ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర సెర్చ్ కమిటీ కన్వీనర్ ఇందిరాశోభన్ తెలిపారు. హైదరాబాద్‌లోని చార్మినార్ నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కానున్నట్టు ఆమె తెలిపారు.
ఓ మాజీ ఐఏఎస్, మాజీ ఎంపీకి ఆహ్వానం!
రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా ఉండాలంటే భారీ స్థాయిలో కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుందని ఆప్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో బలమైన నేతల చేరిక, క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరింపజేసే వ్యూహాత్మక కార్యాచరణ, ఆర్థికంగా బలమైన నేతల కోసం ఆప్ కేంద్ర కమిటీ అన్వేషణ సాగిస్తోందని విశ్వసనీయంగా తెలిసింది.
ఇందులో భాగంగా ఇటీవల ఉద్యోగానికి రాజీనా మా చేసి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఓ మాజీ ఐఏఎస్‌ను పార్టీలోకి ఆహ్వా నిస్తున్నారని తెలిసింది. పలు నియోజకవర్గాల్లో సుదీర్ఘ కాలం శాసనసభ్యులుగా పనిచేసిన వారి కుటుంబీకులను కూడా పార్టీలోకి ఆహ్వానించేం దుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్–బీజేపీ కాకుండా మరో ప్రత్యామ్నాయ వేదికలోకి వెళ్లాలని ఆలోచనలో ఉన్న ఓ మాజీ ఎంపీతో కూడా కేజ్రీవాల్ కోర్ టీం ఇటీవల ఢిల్లీ కేంద్రంగా చర్చలు జరిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
41 స్థానాల్లోనూ డిపాజిట్లు గల్లంతు
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సీట్లకు గాను 41 స్థానాల్లో ఆప్ తరఫున అభ్యర్థులు పోటీ చేసినా డిపాజిట్లు దక్కలేదు. మొత్తంగా 13,134 ఓట్లు (0.06 శాతం)మాత్రమే వచ్చాయి. ఈ స్థితిలో ఉన్న పార్టీ ఎప్పుడు పుంజుకుంటుందనే విషయాన్ని పక్కనబెడితే.. ఢిల్లీలో చేసిన అభివృద్ది, పంజాబ్‌లో ఇటీవలి విజయం ఆసరాగా ప్రజల్లోకి వెళ్లేందుకు కేంద్ర కమిటీ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలిసింది. ముందుగా సభ్యత్వ నమోదు చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment