delhi mla
-
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా రాజీనామా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు రాఘవ్ చద్దా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్‌కు అందజేశారు. పంజాబ్ నుంచి రాజ్యసభకు పంపాలని ‘ఆప్’ నిర్ణయించడంతో ఎమ్మెల్యే పదవిని రాఘవ్ చద్దా వదులుకున్నారు. ‘ఢిల్లీ విధానసభకు నేను రాజీనామా చేశాను. సభాపతితో సహా సభ్యులందరూ నన్ను ఎంతో ఆదరించారు. పంజాబ్ తరపున రాజ్యభలో బలంగా గళం వినిపిస్తాను. పంజాబ్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాన’ని రాఘవ్ చద్దా ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు. ఐదుగురు అభ్యర్థులు రాఘవ్ చద్దాతో పాటు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, ఐఐటీ ప్రొఫెసర్ సందీప్ పాఠక్, విద్యావేత్త అశోక్ కుమార్ మిట్టల్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాలను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ్య అభ్యర్థులుగా మార్చి 21న ప్రకటించింది. పంజాబ్‌లో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఏప్రిల్ 9న ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు నిర్వహించనున్నారు. (క్లిక్: పంజాబ్ సీఎం సంచలన ప్రకటన) యంగెస్ట్ ఎంపీ! 33 ఏళ్ల రాఘవ్ చద్దా.. రాజ్యసభలో అతి పిన్న వయస్కుడైన సిట్టింగ్ సభ్యునిగా గుర్తింపు పొందనున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జిగా ఆయన వ్యవహరించారు. వృత్తిరీత్యా చార్టెట్ అకౌంటెంట్ అయిన చద్దా.. ఢిల్లీ లోక్‌పాల్ బిల్లు రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. పంజాబ్ నుంచి రాజ్యసభకు నామినేటైన చద్దాకు ఆ రాష్ట్రంలో గట్టి పట్టుంది. (క్లిక్: రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు) -
అసెంబ్లీలో బెంచి ఎక్కిన ఎమ్మెల్యే
ఢిల్లీ అసెంబ్లీలో చిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా నిరసన వ్యక్తం చేయడానికి ఏకంగా బెంచి ఎక్కి నిలబడ్డారు. ఢిల్లీ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న గుప్తా.. ముందు వరుసలో స్పీకర్‌కు ఎడమవైపు కూర్చుంటారు. తెల్లటి కుర్తా, పైజమా ధరించిన ఆయన.. ఒక్కసారిగా ఉన్నట్టుండి బెంచి మీదకు ఎక్కి నిలబడ్డారు. ట్యాంకర్ల స్కాం గురించి మాట్లాడుతూ, నిరసన వ్యక్తం చేయడానికి ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. దాంతో స్పీకర్ సహా సభ్యులంతా ఒక్కసారిగా విస్తుపోయారు. కొంతమంది సభ్యులు ఆయన నిలబడటాన్ని సెల్ఫోన్లలో వీడియో తీసుకున్నారు. ఇంతవరకు ఎమ్మెల్యేలు ఇలా బెంచి మీద నిలబడటం తాను ఎప్పుడూ చూడలేదని, ఇది చాలా సిగ్గుచేటని స్పీకర్ రామ్ నివాస్ అన్నారు. సభాసమయాన్ని మీరు హైజాక్ చేస్తున్నారంటూ గుప్తా మీద మండిపడ్డారు. అయితే గుప్తా మాత్రం ఆయన మాటలు వినిపించుకోకుండా తన నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. విపక్ష నేతగా ఉన్న మీరు ఇలా చేయడం బాగోలేదని, వెంటనే కూర్చోవాలని స్పీకర్ పదే పదే ఆయనకు విజ్ఞప్తి చేశారు. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నారు. మిగిలినవాళ్లంతా ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులే. గుప్తా నిరసన వ్యక్తం చేసే సమయంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా సభలోనే ఉన్నారు.