సగటు మనిషికి లేని భద్రత నా కెందుకు?
* పోలీసుల రక్షణను నిరాకరిస్తున్న కేజ్రీవాల్
* అయోమయంలో క్షేత్రస్థాయి సిబ్బంది
ఘజియాబాద్: ‘తనను రక్షణ అవసరం ఉన్న రాజకీయ నాయకుల జాబితా నుంచి తొలగించాలని ఇటీవల కేజ్రీవాల్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీకి వినతిపత్రం అందజేశారు. పోలీసులకు మాత్రం రెండు చేతులు జోడించి రక్షణ వలయం నుంచి నన్ను వదిలేయమని’ విజ్ఞప్తి చేస్తున్నారు. సామాన్యులకు లేని రక్షణ, తాను తీసుకోనని వాదిస్తున్నారు? ఆయన భద్రత నిరాకరించినప్పటికీ పోలీసులు విధులు నిర్వహించక తప్పడం లేదు.
ఘజియాబాద్ పోలీస్ వ్యాన్ నిరంతరం కేజ్రీవాల్ నివాసం పరిసరాల్లో గస్తీ నిర్వహిస్తోంది. అతను బయటకు వెళితే.. ఢిల్లీ సరిహద్దు వరకూ తమ పోలీసులు, పోలీస్ ఎస్కాట్ రక్షణగా ఉంటుంది. అక్కడ ఢిల్లీ పోలీసులు బాధ్యతలు తీసుకొంటారు. నగరంలో ఎక్కడకు వెళ్లినా ఘజియాబాద్ పోలీసులు నీడలా ఉంటున్నారు. ఎందుకంటే ఆయనొకప్పుడు ఢిల్లీకి ముఖ్యమంత్రి.. అందుకే ఢిల్లీ పోలీసులు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తున్నారు.
30 మంది సిబ్బంది అతనికి రక్షణ వలయంగా ఉంటోంది. కౌశాంభిలోని ఆయన ఇంటి బయట యూపీ పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆప్ నేత తీరుతో పోలీసు సిబ్బందికి అయోమయానికి గురవుతున్నారు. ఓ వైపు ఉన్నతాధికారుల ఆదేశాలు.. ఆప్ నేతల తీరుతో తీవ్ర ఇబ్బం దులు తప్పడం లేదని పోలీసులు అంటున్నారు.
అవసరం లేదంటున్న సహచరులు
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తర్వాత కేజ్రీవాల్ కౌశాంభి ప్రాంతంలో ఆయన సొంత ఇంటికి మకాం మార్చారు. అక్కడి నుంచి ఆప్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. నగరంలో ఎక్కడైనా ఆయన రక్షణ బాధ్యతలు పోలీసులదేనని, కనీసం ఎక్కడకు వెళ్తున్నారనే విషయాన్ని సమాచారం ఇవ్వాలని, తమను భాగస్వామ్య చేయాలని మరో పోలీసు అధికారి కోరారు. ‘అతనికి(కేజ్రీవాల్)కు భద్రత అవసరం లేదు. అతని కదలికలపై పోలీసులకు చెప్పాల్సిన అవసరమూ తమకు లేదు. ఆయన ఎక్కడకు వె ళ్తే అక్కడకు రావ చ్చు అని కేజ్రీవాల్ సహాయకులు అంటున్నార’ని పోలీసు అధికారులు మీడియాకు తెలిపారు.
పోలీసువర్గాల్లో గందరగోళం..
కేజ్రీవాల్ వీఐపీ కాబట్టి అతనికి రక్షణ అవసరమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అదే సందర్భంలో కేజ్రీవాల్ తీరుపట్ల పోలీసు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘అతను కోరినా..కోరకపోయినా వీఐపీకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉన్నది. అందుకే ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భద్రత విషయంలో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. యూపీ, ఢిల్లీ పోలీసులు ఆయన రక్షణకు పోలీసు సిబ్బందిని నియమిస్తున్నారు.
కానీ, కేజ్రీవాల్ తనకు పోలీసుల రక్షణ అవసరం లేదని మొండిగా తిరస్కరిస్తున్నారు. అతడి పర్యటన, కదలికల వివరాలను కేజ్రీవాల్ లేదా అతని సహచర నాయకులు కూడా సమాచారం ఇవ్వడం లేదని పోలీసులు ఉన్న తాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అతని నివాస అపార్టుమెంటు ఎదుట పోలీసులు రోజంతా నిరాశతోనే గడపాల్సి వస్తోందని పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు.
ఇలాంటి వైఖరి ప్రమాదకరం
ఓ మాజీ ముఖ్యమంత్రి తాను ఎక్కడకు వెళ్తున్న విషయాన్ని సూచన ప్రాయంగానైనా చెప్పడం లేదు. ఈ కారణంగా పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు, ఆమ్ఆద్మీ(సగటు మనిషి) కాబట్టి తనకు భద్రత అవసరం లేదని కేజ్రీవాల్ పోలీసులతో వాదిస్తున్నారు. ఇలాంటి వైఖరి అతనికే ప్రమాదకరమని ఓ సీనియర్ పోలీస్ అధికారి పేర్కొన్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులకు కేజ్రీవాల్ భద్రతపై నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదుల చేసినా ఫలితం లేకుండా పోతోందని మరో పోలీసు అధికారి పేర్కొన్నారు.