ఆ వెహికిల్స్ పై ఢిల్లీలో నిషేధం
న్యూఢిల్లీ : దేశ రాజధాని, దాన్ని పరిసర ప్రాంతాల్లో పదేళ్లకు పైబడిన అన్ని డీజిల్ వాహనాలపై నిషేధం విధించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ సోమవారం ఆదేశాలు జారీచేసింది. పదేళ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ నూ వెంటనే రద్దు చేయాలని ఢిల్లీ ఆర్టీవోకు పేర్కొంది. పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలు రోడ్లపై ఇక కనిపించవద్దని కూడా చెప్పింది. ఇలాంటి వాహనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పింది. పర్యావరణ సమస్యపై ఈ సందర్భంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే డి-రిజిస్ట్రర్ చేసిన వాహనాల సమాచారాన్ని ఢిల్లీ-ఎన్సీఆర్ రీజియన్ ట్రాఫిక్ పోలీసుకు ఢిల్లీ ఆర్టీవో వెంటనే అందించాలని ఆదేశించింది. ఎన్జీటీ ఆర్డర్ ను పబ్లిక్ గా నోటీసు ప్రచురితం చేయాలని కూడా ఢిల్లీ ఆర్టీవోకు ఆదేశాలు వెళ్లాయి.
ఇప్పటికే 15ఏళ్లు దాటిన వాహనాలను ఢిల్లీలో రద్దు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే పాత వాహనాలను కూడా నిలిపివేయాలని ట్రిబ్ర్యునల్ అభిప్రాయం వ్యక్తంచేసింది. పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలతో ముంచుకొస్తున్న కాలుష్య ముప్పును నివారించేందుకు, వెంటనే ఆ వాహనాలను ఢిల్లీలో నిషేధించాలని ప్రభుత్వాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ కోరిన సంగతి తెలిసిందే. డీజిల్ కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, తీవ్ర శ్వాసకోశ సమస్యలు, హృద్రోగ సమ్యలతో పాటుగా రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయి.
మరోవైపు దేశంలోనే అత్యధిక వాయుకాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు రకరకాల చర్యలను తీసుకుంటున్నారు. సరి-భేసి విధానం ప్రయోగాత్మకంగా రెండుసార్లు అమలు చేసింది కూడా ఈ కారణంతోనే. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుతో వాహనదారులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది.