Delhi Special Cell officers
-
Wrestler Sushil Kumar: సుశీల్ చిక్కాడు...
న్యూఢిల్లీ: పోలీసులు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసినా... కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించినా... యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో 19 రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఆదివారం ఉదయం ఢిల్లీ శివారులోని ముండ్కా ప్రాంతంలో సుశీల్ కుమార్, అతడి అనుచరుడు అజయ్ కుమార్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సుశీల్, అజయ్‌లను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు లోపల సుశీల్‌ను 30 నిమిషాలపాటు ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు మరిన్ని వివరాల రాబట్టేందుకు 12 రోజులపాటు తమ కస్డడీకి అప్పగించాలని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దివ్యా మల్హోత్రాను కోరగా.... ఆరు రోజులపాటు సుశీల్, అజయ్‌లను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చారు. ఏం జరిగిందంటే... ఈ నెల నాలుగో తేదీన అర్ధరాత్రి ఛత్రశాల్ స్టేడియంలో జాతీయ గ్రీకో రోమన్ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ రాణా, అతని మిత్రులు సోనూ, అమిత్ కుమార్‌లతో సుశీల్ కుమార్, అతని అనుచరులు గొడవ పడ్డారు. ఈ గొడవలో సాగర్, సోనూ, అమిత్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 23 ఏళ్ల సాగర్ రాణా మృతి చెందాడు. తమపై సుశీల్, అతని అనుచరులు దాడి చేశారని ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో సోనూ, అమిత్ పేర్కొన్నారు. దాంతో సుశీల్, అతని అనుచరులపై ఢిల్లీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 (హత్య)తోపాటు మరో 10 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాతి రోజు (మే 5) నుంచి సుశీల్ పరారీలో ఉన్నాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సుశీల్ హరియాణా, చండీగఢ్, పంజాబ్, గయా, గురుగ్రామ్ ఇలా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో గడిపినట్లు సమాచారం. ఫోన్ ద్వారా తన ఆచూకీ దొరకకూడదనే ఉద్దేశంతో సుశీల్ 14 వేర్వేరు సిమ్ కార్డులు వాడినట్లు తెలిసింది. సుశీల్ ఆచూకీ తెలిపితే రూ. లక్ష రివార్డు కూడా ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఆఖరికి ఆదివారం ఉదయం ఢిల్లీ శివారులో తన అనుచరుడు అజయ్‌తో కలిసి స్కూటర్‌పై వెళ్తుండగా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు సుశీల్ చిక్కాడు. ఖేల్ ఖతమ్! అంతర్జాతీయస్థాయిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించిన 37 ఏళ్ల సుశీల్ కుమార్ పరువు, ప్రతిష్ట తాజా ఉదంతంతో మసకబారిపోయింది. ఈ హత్యతో తనకు సంబంధంలేదని సుశీల్ వివరణ ఇస్తున్నాడు. అయితే అతనికి వ్యతిరేకంగా పోలీసుల వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నట్లు సమాచారం. నార్నర్త్ రైల్వేలో సీనియర్ కమర్షియల్ మేనేజర్ అయిన సుశీల్ ఐదేళ్లుగా ఛత్రశాల్ స్టేడియంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా కొనసాగుతున్నాడు. అయితే సుశీల్ సమక్షంలోనే గొడవ జరగడం... సాక్ష్యాలూ ధ్వంసం కావడం... ఎఫ్ఐఆర్లో అతని పేరు ఉండటం.. తాజాగా అరెస్టు కూడా కావడంతో సుశీల్ ఉద్యోగం ఊడే అవకాశముంది. ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు నెగ్గిన ఏకైక క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన సుశీల్... తాజా సంఘటనతో భవిష్యత్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాలకు తెరపడిందనే చెప్పాలి. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ లో చివరిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సుశీల్ 20వ స్థానంలో నిలిచాడు. సుశీల్ ఘనతలు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం. 2010 ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం. 2010 ఢిల్లీ, 2014 గ్లాస్గో, 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు 2006 దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం. ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం (2010), రజతం (2007), రెండు కాంస్యాలు (2003, 2008). కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో (2003, 2005, 2007, 2009, 2017) ఐదు స్వర్ణాలు, ఒక కాంస్యం (2005). 1998, 1999 ప్రపంచ క్యాడెట్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాలు. అవార్డులు అర్జున అవార్డు: 2005; రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న: 2009; పద్మశ్రీ: 2011 -
ఎర్రకోట వద్ద ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ ఇన్ జమ్మూకశ్మీర్(ఐఎస్‌జేకే) ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్‌చేశారు. ఎర్రకోట సమీపంలోని జామా మసీదు బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న పర్వేజ్(24), జంషీద్(19)లను అరెస్ట్ చేసినట్లు స్పెషల్ సెల్ డీసీపీ కుష్వాహా తెలిపారు. కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాకు చెందిన వీరిద్దరి నుంచి రెండు .32 పిస్టల్స్, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు తమ రాకపోకలకు ఢిల్లీని కేంద్రంగా మాత్రమే వాడుతున్నారనీ, ఇక్కడ దాడులకు ఎలాంటి ప్రణాళికలు రచించలేదని కుష్వాహా తెలిపారు. పర్వేజ్ యూపీలోని గజ్రోలా పట్టణంలో ఉన్న ఓ కళాశాలలో ఎంటెక్ చదువుతుండగా, జంషిద్ డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్నాడు. పర్వేజ్ సోదరుడిని భద్రతాబలగాలు ఈ ఏడాది జనవరిలో షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హతమార్చాయన్నారు. 2016, జూలైలో తన తమ్ముడు, హిజ్బుల్ ఉగ్రవాది ఫిర్దౌస్ను భద్రతాబలగాలు కాల్చిచంపడంతో పర్వేజ్ ఉగ్రబాట పట్టాడని పోలీసులు వెల్లడించారు. జంషిద్ ఆయుధాలను యూపీ నుంచి ఢిల్లీకి తరలిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. -
అక్రమ పాస్‌పోర్ట్‌ల కేసులో ‘ఐసిస్’ కోణం!
ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల దర్యాప్తు సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశీయులకు అక్రమ పాస్‌పోర్ట్‌లు సమకూరుస్తున్న షౌకత్ అలీ గ్యాంగ్‌కు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)తో సంబంధాలున్నాయా? ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది ఢిల్లీ స్పెషల్ సెల్. హైదరాబాద్‌తో పాటు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, సౌదీ అరేబియాల్లోనే నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న షౌకత్ అలీ సహా నలుగురు నిందితుల్ని శుక్రవారం అరెస్టు చేసిన విషయం విదితమే. నెలకు దాదాపు 20 మందిని నకిలీ వీసాలపై సౌదీ అరేబియా పంపుతున్నట్లు స్పెషల్ సెల్ అధికారులు ఆధారాలు సేకరించారు. వీరిలో అత్యధికం బంగ్లాదేశ్‌కు చెందిన రోహింగ్యా మైనార్టీలు ఉన్నట్లు చెప్తున్నారు. ఐసిస్‌లో చేరేందుకు వెళ్లే వారికి బోగస్ పాస్‌పోర్టులు, వీసాలతో షౌకత్ గ్యాంగ్ సహకరిస్తోందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దోమతెరల తయారీ ముసుగులో... బంగ్లాదేశ్ నుంచి వచ్చి దక్షిణ ఢిల్లీలోని సరాయ్ కాలేఖాన్ ప్రాంతంలో స్థిరపడిన షౌకత్ అక్కడ దోమతెరల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేశాడు. దీని ముసుగులో అక్రమంగా విదేశాలకు వెళ్లాలనే ఆసక్తి ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్ వాసుల్ని గుర్తించడం మొదలెట్టాడు. వారి పేర్లు, పుట్టిన తేదీలతో రూపొందించిన జాబితాను ఫొటోలతో సహా కోల్‌కతాలో ఉండే మహ్మద్ హఫీజ్ షేక్‌కు పంపేవాడు. వీటి ఆధారంగా హఫీజ్ నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేసేవాడు. వీటితో ఢిల్లీలోని సౌదీ అరేబియా ఎంబసీ నుంచి వీసాలు పొంది విదేశీయుల్ని ఆ దేశానికి పంపేస్తున్నారు. ఒక్కో పాస్‌పోర్ట్‌కు ఈ ముఠా రూ.1.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు స్పెషల్ సెల్ గుర్తించింది. ఢిల్లీలో విచారణ ముగిశాకే నగరానికి హైదరాబాద్ సీసీఎస్ అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు గతేడాది ఛేదించిన బోగస్ పాస్‌పోర్ట్ ముఠా సభ్యుడైన హుజీ ఉగ్రవాది నూర్ ఉల్ హక్ చాలా కాలం పాటు షౌకత్‌కు కుడి భుజంగా ఉన్నాడు. ఈ గ్యాంగ్ విదేశాలకు పంపినవారి ఆచూకీ ప్రస్తుతం అక్కడ లభించట్లేదని ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వారిలో అత్యధికులు ఐసిస్‌లో చేరేందుకు వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. విషయం తెలిసే షౌకత్ గ్యాంగ్ సహకరించి ఉంటుదని భావిస్తున్న పోలీసులు న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆ కోణంలో విచారించాలని నిర్ణయించారు. మరోపక్క షౌకత్ ముఠాను విచారించడానికి ఢిల్లీ వెళ్లిన నిఘా విభాగం అధికారులు సైతం ఈ కోణంలో ప్రశ్నించనున్నారు. ఢిల్లీ పోలీసుల విచారణలో షౌకత్ వెల్లడించిన అంశాల ప్రకారం హైదరాబాద్ సిట్ అధికారులు గత ఏడాది నమోదు చేసిన కేసులో అతడు వాంటెడ్‌గా మారనున్నాడు. అక్కడి అధికారుల విచారణ పూర్తయిన తరవాతే షౌకత్‌ను పీటీ వారెంట్‌పై తీసుకువచ్చే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.