ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశీయులకు అక్రమ పాస్‌పోర్ట్‌లు సమకూరుస్తున్న షౌకత్ అలీ గ్యాంగ్‌కు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)తో సంబంధాలున్నాయా? ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది ఢిల్లీ స్పెషల్ సెల్. హైదరాబాద్‌తో పాటు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, సౌదీ అరేబియాల్లోనే నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్న షౌకత్ అలీ సహా నలుగురు నిందితుల్ని శుక్రవారం అరెస్టు చేసిన విషయం విదితమే. నెలకు దాదాపు 20 మందిని నకిలీ వీసాలపై సౌదీ అరేబియా పంపుతున్నట్లు స్పెషల్ సెల్ అధికారులు ఆధారాలు సేకరించారు. వీరిలో అత్యధికం బంగ్లాదేశ్‌కు చెందిన రోహింగ్యా మైనార్టీలు ఉన్నట్లు చెప్తున్నారు. ఐసిస్‌లో చేరేందుకు వెళ్లే వారికి బోగస్ పాస్‌పోర్టులు, వీసాలతో షౌకత్ గ్యాంగ్ సహకరిస్తోందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
దోమతెరల తయారీ ముసుగులో...
బంగ్లాదేశ్ నుంచి వచ్చి దక్షిణ ఢిల్లీలోని సరాయ్ కాలేఖాన్ ప్రాంతంలో స్థిరపడిన షౌకత్ అక్కడ దోమతెరల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేశాడు. దీని ముసుగులో అక్రమంగా విదేశాలకు వెళ్లాలనే ఆసక్తి ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్ వాసుల్ని గుర్తించడం మొదలెట్టాడు. వారి పేర్లు, పుట్టిన తేదీలతో రూపొందించిన జాబితాను ఫొటోలతో సహా కోల్‌కతాలో ఉండే మహ్మద్ హఫీజ్ షేక్‌కు పంపేవాడు. వీటి ఆధారంగా హఫీజ్ నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేసేవాడు. వీటితో ఢిల్లీలోని సౌదీ అరేబియా ఎంబసీ నుంచి వీసాలు పొంది విదేశీయుల్ని ఆ దేశానికి పంపేస్తున్నారు. ఒక్కో పాస్‌పోర్ట్‌కు ఈ ముఠా రూ.1.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు స్పెషల్ సెల్ గుర్తించింది.
ఢిల్లీలో విచారణ ముగిశాకే నగరానికి
హైదరాబాద్ సీసీఎస్ అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు గతేడాది ఛేదించిన బోగస్ పాస్‌పోర్ట్ ముఠా సభ్యుడైన హుజీ ఉగ్రవాది నూర్ ఉల్ హక్ చాలా కాలం పాటు షౌకత్‌కు కుడి భుజంగా ఉన్నాడు. ఈ గ్యాంగ్ విదేశాలకు పంపినవారి ఆచూకీ ప్రస్తుతం అక్కడ లభించట్లేదని ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వారిలో అత్యధికులు ఐసిస్‌లో చేరేందుకు వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు.
విషయం తెలిసే షౌకత్ గ్యాంగ్ సహకరించి ఉంటుదని భావిస్తున్న పోలీసులు న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆ కోణంలో విచారించాలని నిర్ణయించారు. మరోపక్క షౌకత్ ముఠాను విచారించడానికి ఢిల్లీ వెళ్లిన నిఘా విభాగం అధికారులు సైతం ఈ కోణంలో ప్రశ్నించనున్నారు. ఢిల్లీ పోలీసుల విచారణలో షౌకత్ వెల్లడించిన అంశాల ప్రకారం హైదరాబాద్ సిట్ అధికారులు గత ఏడాది నమోదు చేసిన కేసులో అతడు వాంటెడ్‌గా మారనున్నాడు. అక్కడి అధికారుల విచారణ పూర్తయిన తరవాతే షౌకత్‌ను పీటీ వారెంట్‌పై తీసుకువచ్చే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.
అక్రమ పాస్‌పోర్ట్‌ల కేసులో ‘ఐసిస్’ కోణం!
Published Mon, Jan 18 2016 3:46 AM | Last Updated on Sun, Sep 3 2017 3:48 PM
Advertisement
Advertisement